
ఇంటి ముందు ముగ్గు.. కేవలం అలంకారం కాదు. లక్ష్మీదేవికి స్వాగతం పలకడంతో పాటు భూమాతకు కృతజ్ఞతలు తెలిపే ఆచారంగా భావిస్తారు.
మన సనాతన సంప్రదాయాల్లో ప్రతి ఆచారం వెనుక ఏదో ఒక అంతరార్థం దాగి ఉంటుంది. అయితే కాలక్రమంలో ఆ ఆచారాల వెనుక ఉన్న కారణాలు, ప్రయోజనాలు తెలియకపోవడంతో కొన్నింటిని కేవలం మొక్కుబడిగా పాటిస్తున్నాం. మరికొన్నింటిని పూర్తిగా పక్కన పెడుతున్నాం. మన నిత్యజీవితంలో భాగమైన వాకిట్లో ముగ్గు వేయడం కూడా అలాంటి ఆచారాల్లో ఒకటి.
చాలామందికి ఇంటి ముంగిట ముగ్గు వేయడం అంటే ఇంటిని అందంగా అలంకరించడం మాత్రమే. కానీ సంప్రదాయ దృష్టిలో ముగ్గుకు అంతకంటే గొప్ప ప్రాధాన్యత ఉంది.
లక్ష్మీదేవికి స్వాగతం
పూర్వకాలంలో ఇంటి ముందు ముగ్గును ప్రధానంగా బియ్యప్పిండితో వేసేవారు. వాకిట్లో ముగ్గు వేయడం ద్వారా లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించినట్లవుతుందని పెద్దలు చెబుతారు. బియ్యప్పిండితో వేసిన ముగ్గు కేవలం ఇంటి గుమ్మాన్ని అందంగా మార్చడమే కాదు.. చీమలు, చిన్న జీవులకు ఆహారంగా కూడా ఉపయోగపడేది. అందువల్ల బియ్యప్పిండితో ముగ్గు వేయడాన్ని ఒక విధమైన అన్నదానంగా కూడా భావించేవారు.అన్నదానం చేసే అవకాశం లేని సమయంలోనూ ఇంటి వాకిట్లో బియ్యప్పిండితో ముగ్గు వేయడం ద్వారా చిన్న జీవులకు ఆహారం అందించిన పుణ్యఫలం లభిస్తుందని సంప్రదాయ విశ్వాసం.
శుభ్రతకు కూడా ప్రాధాన్యత
ముగ్గు వేయడానికి ముందు ఇంటి వాకిలిని శుభ్రం చేయడం మన పూర్వీకుల ఆచారం. ముందుగా ఇల్లు, పరిసరాలను శుభ్రం చేసి.. ఆ తర్వాత వాకిట్లో కళ్లాపి చల్లి ముగ్గు వేస్తారు. ఇలా చేయడం వల్ల ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండటంతో పాటు ధూళి, సూక్ష్మజీవుల ప్రభావం కొంతవరకు తగ్గుతుందని పెద్దలు భావించేవారు. అంటే ముగ్గు వెనుక ఆధ్యాత్మికతతో పాటు పరిశుభ్రత, జీవకారుణ్యం, పర్యావరణ స్పృహ కూడా ముడిపడి ఉన్నాయని చెప్పవచ్చు.
భూమాతకు కృతజ్ఞతగా ముగ్గు
మనిషిని తల్లి తన గర్భంలో తొమ్మిది నెలలు మోస్తుంది. కానీ మన జీవితాంతం మన భారాన్ని మోసేది భూమాత. మనం నడిచేది ఆమెపైనే.. మనకు ఆహారాన్ని అందించేది ఆమెనే.. మన జీవనానికి ఆధారమైన ప్రకృతి సంపదలన్నీ ఆమె నుంచే లభిస్తాయి.అందుకే ఉదయం నిద్రలేచిన తర్వాత భూమిని గౌరవించడం, ఆమెకు కృతజ్ఞతలు తెలపడం మన సంప్రదాయంలో ఒక ముఖ్యమైన భావనగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇంటి వాకిట్లో ముగ్గు వేయడాన్ని భూదేవికి సమర్పించే చిరు కానుకగా, ఆరాధనా క్రియగా భావిస్తారు.
పూజలు, శుభకార్యాల్లో ముగ్గుకు ప్రత్యేక స్థానం
పూజలు, వ్రతాలు, యజ్ఞయాగాలు, వివాహాలు వంటి శుభకార్యాల్లో ముగ్గుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. శుభకార్యం జరిగే ప్రదేశాన్ని శుభ్రపరచి, ముగ్గులతో అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది.
ముగ్గు ఉన్న ప్రదేశాన్ని పవిత్రంగా, శుభప్రదంగా భావించడం మన సంప్రదాయంలో భాగం.
భూమాతను క్షమాపణ కోరే భావన
రోజువారీ జీవితంలో మనం తెలియకుండానే భూమికి ఎన్నో విధాలుగా హాని చేస్తుంటాం. నేలను దున్నడం, తవ్వడం, గుంతలు చేయడం, వివిధ పనుల కోసం భూమిని ఉపయోగించడం అనివార్యమే.
ఇలాంటి పనుల వల్ల భూమాతకు కలిగే బాధకు క్షమాపణగా, ఆమె పట్ల కృతజ్ఞతగా రోజూ వాకిట్లో ముగ్గు వేయాలనే భావనను మన పెద్దలు చెప్పారు. అందుకే ముగ్గు కేవలం రంగులతో వేసే అందమైన ఆకారం కాదు. అది భూమాతకు నమస్కారం.. లక్ష్మీదేవికి స్వాగతం.. చిన్న జీవులకు ఆహారం.. ఇంటికి శుభానికి సంకేతం. కాలం మారినా.. జీవన విధానాలు మారినా.. మన సంప్రదాయాల వెనుక ఉన్న ఈ అంతరార్థాన్ని తెలుసుకుని ఆచరించడం ద్వారా వాటి విలువను తరువాతి తరాలకు అందించవచ్చు.





