News

కొప్పరపు కవుల పద్యాలతో తెలుగు భాషకు పూర్వ వైభవం

29views

సుప్రసిద్ధ ప్రవచనకర్త, బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మకు కొప్పరపు కవుల కళాపీఠం ఆధ్వర్యంలోని*జాతీయ ప్రతిభా పురస్కారం-2026 లభించింది. కళాపీఠం 24వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నం పిఠాపురం కాలనీలోని కళాభారతి ఆడిటోరియంలో షణ్ముఖశర్మను ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి బి. కృష్ణమోహన్ మాట్లాడుతూ.. కొప్పరపు కవుల పద్యాలను పాఠ్యాంశాల్లో చేర్చడం ద్వారా తెలుగు భాషకు పూర్వవైభవాన్ని తీసుకురావచ్చని అభిప్రాయపడ్డారు. తెలుగు సాహిత్యానికి, అవధాన ప్రక్రియకు కొప్పరపు కవులు చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ యు. దుర్గాప్రసాదరావు మాట్లాడుతూ.. అవధాన ప్రక్రియను శిఖరాగ్ర స్థాయికి తీసుకెళ్లిన మహనీయులు కొప్పరపు కవులు అని కొనియాడారు. వారు అందించిన సాహిత్య సంపద ఆధారంగా ఒక అవధాన విశ్వవిద్యాలయాన్ని సైతం ఏర్పాటు చేయవచ్చని అన్నారు.

పురస్కారం అందుకున్న బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ మాట్లాడుతూ.. కొప్పరపు కవులు గంటకు 500 పద్యాలు చెప్పగలిగిన అసాధారణ ప్రతిభావంతులని పేర్కొన్నారు. అలాంటి మహనీయుల పేరిట ఏర్పాటు చేసిన జాతీయ పురస్కారానికి తనను ఎంపిక చేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. కొప్పరపు కవుల సాహిత్య ప్రతిభను, తెలుగు భాషకు వారు చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

అనంతరం ‘శతావధాన సౌందర్యం’ గ్రంథాన్ని ఆవిష్కరించారు.