
దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న ముఠాను మార్కాపురం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. దేవతామూర్తుల విగ్రహాలు, ఆలయాల్లోని విలువైన వస్తువులను అపహరించిన 13 మందిని అరెస్ట్ చేసి.. వారి నుంచి సుమారు రూ.22.70 లక్షల విలువైన దేవతామూర్తుల విగ్రహాలు, వెండి ఆభరణాలు, ఇతర ఆలయ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
ఈ మేరకు ప్రకాశం, మార్కాపురం జిల్లాల ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మార్కాపురం జిల్లా పరిధిలోని సీఎస్‌పురం, పామూరు, కనిగిరి, కొనకనమిట్ల మండలాల్లో ఇటీవల వరుసగా ఆలయ చోరీలు చోటుచేసుకోవడంతో నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ప్రత్యేక బృందాలు దర్యాప్తు ముమ్మరం చేసి పామూరు మండలం రావిగుంటపల్లి గ్రామ శివారులో నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. అరెస్టయిన వారిలో రావిగుంటపల్లికి చెందిన ఇండ్ల విష్ణువర్ధన్, సీఎస్‌పురానికి చెందిన తమ్మిశెట్టి రమణయ్య, గుడ్లూరు మండలం ఏలూరుపాడుకు చెందిన మల్లాల చెంచు సుబ్బారావు, పొదిలికి చెందిన సోమరాజుపల్లి ఉమా మహేశ్వరరావు, కనిగిరి మండలం వంగపాడుకు చెందిన కొమ్మి కాటంరాజు, సీఎస్‌పురానికి చెందిన బత్తుల శ్రీను, కొత్తపట్నం మండలం పల్లెపాలెంకు చెందిన పిన్నీ రాజీవ్, ఒంగోలు కమ్మపాలేనికి చెందిన కమ్మ సూర్యతేజ, ఎన్‌జీపాడు మండలం వినోదరాయునిపాలెంకు చెందిన మోకా ఆంజనేయులు, అద్దంకికి చెందిన డేరంగుల వెంకట రమణ, సీఎస్‌పురం వడ్డెపాలేనికి చెందిన బండారు తిరుపతయ్య, గిద్దలూరుకు చెందిన దూదేకుల నాగూర్ షరీఫ్, విగ్రహాలను కొనుగోలు చేసిన కొమరోలు మండలం భావాపురానికి చెందిన చందలూరి బాల గురవయ్య ఉన్నట్లు తెలిపారు.
పోలీసులు స్వాధీనం చేసుకున్న వాటిలో సీఎస్‌పురం శివాలయంలో చోరీకి గురైన సుమారు రూ.12 లక్షల విలువైన రెండు పార్వతీ పరమేశ్వరుల పంచలోహ విగ్రహాలు, ఒక ఇత్తడి అయ్యప్ప విగ్రహం ఉన్నాయి. అలాగే కనిగిరి మండలం చీర్లదిన్నె గ్రామంలోని కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో అపహరించిన సుమారు రూ.10 లక్షల విలువైన 4.5 కిలోల వెండి కవచం, వెండి నాగాభరణం, కొనకనమిట్ల మండలం గొట్లగట్టు రామాలయం నుంచి అపహరించిన సుమారు రూ.25 వేల విలువైన 25 కిలోల ఇత్తడి హనుమంత వాహనం, పామూరు మండలం వగ్గంపల్లి పోలేరమ్మ తల్లి ఆలయం నుంచి అపహరించిన సుమారు రూ.50 వేల విలువైన ఇత్తడి కిరీటం, రెండు చేతుల కవచాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.
నిందితుల్లో కొందరు బేల్దారు పనులు, మరికొందరు స్లాబ్ మిల్లర్ పనులు చేసేవారని పోలీసులు తెలిపారు. ఆయా పనుల కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లే సమయంలో వీరి మధ్య పరిచయం ఏర్పడిందన్నారు. విష్ణువర్ధన్ ఓ ప్రైవేట్ వెంచర్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తుండగా, అతనికి సుబ్బారావు సహాయకుడిగా ఉండేవాడని తెలిపారు.
ఈ ముఠా ముందుగా దేవాలయాలను గుర్తించి, అక్కడి పరిస్థితులను పరిశీలించిన అనంతరం చోరీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఇలా మార్కాపురం జిల్లా పరిధిలోని పలు ఆలయాల్లో వరుస దొంగతనాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందన్నారు.





