
మహారాష్ట్రలోని పింప్రి-చించ్‌వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అనుమతులు లేకుండా నిర్మించిన ఓ చర్చి భవనాన్ని అధికారులు కూల్చివేశారు. కాలేవాడి (రాజవాడేనగర్) ప్రాంతంలోని ‘జీసస్ ఈజ్ లార్డ్’ చర్చికి చెందిన సుమారు 7,400 చదరపు అడుగుల విస్తీర్ణంలోని నిర్మాణాన్ని మున్సిపల్ కార్పొరేషన్ ఆక్రమణల తొలగింపు విభాగం పూర్తిగా తొలగించింది.
మున్సిపల్ అధికారుల ప్రకారం.. ఈ చర్చి నిర్మాణానికి కార్పొరేషన్ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. నిర్మాణానికి సంబంధించి చర్చి నిర్వాహకులకు గతంలోనే నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య సెప్టెంబర్ 7 రాత్రి కూల్చివేత చర్య చేపట్టినట్లు వెల్లడించారు.
మరోవైపు, ఈ చర్చి ద్వారా బలహీన వర్గాలకు చెందిన ప్రజలను, పేదలను మత మార్పిడికి ప్రేరేపిస్తున్నారంటూ స్థానికుల నుంచి గతంలోనే అధికారులకు పలు ఫిర్యాదులు అందినట్లు సమాచారం.
ఈ చర్చికి సంబంధించి మరో కేసు కూడా గతంలో నమోదైంది. ‘ప్రార్థనతో నయం చేయలేని వ్యాధులను సైతం నయం చేయవచ్చు’ అని నమ్మించి ప్రజలను మోసం చేశారనే ఆరోపణలపై ఏప్రిల్ 26, 2026న పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు ఆధారంగా చర్చి పాస్టర్ కెన్నెత్ సిల్వాతోపాటు మరో ఏడుగురిపై మహారాష్ట్రలో అమల్లో ఉన్న నరబలి, ఇతర అమానవీయ, దుష్ట, అఘోరీ ఆచారాలు, చేతబడి నివారణ–నిర్మూలన చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. సిద్ధాంత్ చవాన్ ఈ మేరకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఈ పరిణామాల నేపథ్యంలో మే 3, 2026న హిందుత్వ సంస్థలు, స్థానిక పౌరులు కలిసి చర్చికి వ్యతిరేకంగా భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలు శంకర్ జగ్‌తాప్, గోపీచంద్ పడల్కర్ కూడా పాల్గొన్నట్లు సమాచారం. ‘కాలేవాడి కన్వర్షన్ ఫైల్స్’ వెనుక ఉన్న వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ సందర్భంగా డిమాండ్లు వినిపించాయి.





