
‘గుస్తాఖ్-ఎ-నబీ కీ ఏక్ హీ సజా, సర్ తన్ సే జుదా’ (ప్రవక్తను అవమానించినందుకు ఒకే శిక్ష.. శిరచ్ఛేదం) అనే నినాదం ప్రజలను సాయుధ తిరుగుబాటు వైపు ప్రేరేపించేలా ఉందని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నినాదం దేశ సార్వభౌమత్వం, ఐక్యత, సమగ్రతతోపాటు చట్టబద్ధమైన అధికారాన్ని సవాలు చేసే విధంగా ఉందని కోర్టు పేర్కొంది.
బరేలీ అల్లర్ల కేసులో మౌలానా తౌఖీర్ రజా ఖాన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను సెప్టెంబర్ 7న విచారించిన న్యాయమూర్తి అశుతోష్ శ్రీవాస్తవ ఈ వ్యాఖ్యలు చేశారు. పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.
బరేలీలో ముస్లింలపై జరిగినట్లు ఆరోపిస్తున్న అఘాయిత్యాలకు నిరసనగా నిర్వహించిన ప్రదర్శనలో హింసను ప్రేరేపించారనే ఆరోపణలు తౌఖీర్ రజాపై ఉన్నాయి. ఈ నిరసనకు ఎలాంటి అనుమతి తీసుకోలేదని, అయినప్పటికీ పెద్ద సంఖ్యలో ప్రజలతో ఊరేగింపు నిర్వహించారని కోర్టు తన పరిశీలనలో పేర్కొంది. పోలీసులు అడ్డుకోవడంతో అల్లర్లు చెలరేగి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమైనట్లు కోర్టు తెలిపింది.
ఈ ఘటన అనంతరం తన పిలుపుకు స్పందించిన పెద్ద సంఖ్యలో ప్రజలకు తౌఖీర్ రజా కృతజ్ఞతలు తెలిపారని, వారి చర్యలను ప్రశంసిస్తూ ప్రసంగం చేశారని కోర్టు పేర్కొంది. ఇటువంటి ప్రవర్తనను సమర్థించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది.
మత, రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకునేందుకు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ప్రాథమికంగా కనిపిస్తోందని కోర్టు అభిప్రాయపడింది. ‘సర్ తన్ సే జుదా’ వంటి నినాదాలు ప్రజల్లో హింసాత్మక భావాలను రెచ్చగొట్టే ప్రమాదం ఉందని, ఇవి చట్టబద్ధమైన వ్యవస్థను సవాలు చేసే స్థాయికి చేరకూడదని కోర్టు వ్యాఖ్యానించినట్లు వెల్లడైంది.
ఈ కేసులో పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాదులు సతీష్ త్రివేది, ఇమ్రాన్ ఉల్లా, న్యాయవాదులు శేషాద్రి త్రివేది, మహమ్మద్ ఇమ్దాద్ సిద్ధిఖీ వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ అనూప్ త్రివేది హాజరయ్యారు. ఆయనకు న్యాయవాదులు నితేష్ కుమార్ శ్రీవాస్తవ, పరితోష్ మాల్వీయ, సంజయ్ కుమార్ సింగ్ సహకరించారు.
బరేలీ అల్లర్ల కేసులో నిందితుడి పాత్ర, నిరసన సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు, అనంతరం చేసిన ప్రసంగం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న అలహాబాద్ హైకోర్టు.. బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది.





