News

శ్రీవారి భక్తులకు సరికొత్త అనుభూతి.. ప్రారంభానికి సిద్ధమైన వరల్డ్ క్లాస్ ఎస్వీ మ్యూజియం

34views

తిరుమలలో భక్తులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఎస్వీ మ్యూజియం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ మ్యూజియాన్ని ప్రారంభించేందుకు టీటీడీ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రూపుదిద్దుకున్న ఈ మ్యూజియం పనులను టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులతో సమీక్ష నిర్వహించారు.

మ్యూజియంలోని అన్ని విభాగాల పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు. భక్తులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు, సౌకర్యాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. మ్యూజియం నిర్వహణకు సంబంధించి టీసీఎస్‌ బృందానికి కూడా అవసరమైన సూచనలు అందించాలని, అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వెంకయ్య చౌదరి దిశానిర్దేశం చేశారు.

తిరుమల బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు.. సిగ్నల్ వ్యవస్థపై టీటీడీ ప్రత్యేక దృష్టి
మరోవైపు ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై కూడా అదనపు ఈవో సమీక్షించారు. ముఖ్యంగా తిరుమల, ఘాట్‌ రోడ్లు, కాలిబాట మార్గాల్లో మొబైల్ నెట్‌వర్క్‌ను పటిష్ఠం చేయాలని అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల సమయంలో ప్రత్యేకించి లక్షలాది మంది భక్తులు తరలివచ్చే గరుడసేవ రోజున మొబైల్ సిగ్నల్ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న సెల్‌ టవర్ల పనితీరును సర్వీస్ ప్రొవైడర్లతో కలిసి సమీక్షించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా నెట్‌వర్క్‌ సామర్థ్యాన్ని పెంచి, ఎలాంటి అంతరాయం లేకుండా కమ్యూనికేషన్ సేవలు అందేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. బ్రహ్మోత్సవాల నాటికి తిరుమల, తిరుపతి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతుండగా, భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు ఆధునిక సౌకర్యాలు అందించేందుకు టీటీడీ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది.