
పచ్చదనం పెంపు, జీవవైవిధ్య పరిరక్షణ, పర్యావరణ సమతుల్యతే లక్ష్యంగా ‘వన్ ఎర్త్–వన్ లైఫ్’ సంస్థ చేపడుతున్న సీడ్‌బాల్స్ కార్యక్రమానికి ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పాల్గొన్నారు. విద్యార్థులు, సంస్థ వాలంటీర్లు తయారు చేసిన 2 లక్షల సీడ్‌బాల్స్‌ను కలెక్టర్ స్వీకరించారు.
సీడ్‌బాల్స్ ద్వారా ప్రకృతి పునరుత్పత్తికి, పచ్చదనం పెంపునకు అవకాశం కలుగుతుందని కలెక్టర్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాలను అభినందించారు. విద్యార్థులు, మహిళలు, యువతను ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడం ద్వారా పర్యావరణంపై సామాజిక స్పృహ మరింత పెరుగుతుందని పేర్కొన్నారు.
కాలుష్య నియంత్రణ, ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు, పరిశుభ్రత, రీసైక్లింగ్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. అంతరించిపోతున్న దేశవాళీ విత్తనాలను సంరక్షించి, ప్రజలకు ఉచితంగా అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సాంప్రదాయ విత్తన సంపదను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
విద్యార్థులకు పర్యావరణంపై అవగాహన
చిన్న వయసు నుంచే విద్యార్థులకు మైక్రో గార్డెనింగ్, మొక్కల పెంపకం, విత్తనాల సంరక్షణ, వ్యర్థాల విభజన వంటి అంశాలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. పిల్లల్లో ప్రకృతి పట్ల బాధ్యత పెంపొందిస్తే భవిష్యత్ తరాలను పర్యావరణహిత జీవన విధానం వైపు నడిపించవచ్చన్నారు.
కొండలు, అటవీ ప్రాంతాల్లో సీడ్‌బాల్స్ విత్తనం
వన్ ఎర్త్–వన్ లైఫ్ ఫౌండర్ ఏలూరి లీలా కుమారి మాట్లాడుతూ నగరాల్లో పచ్చదనం పెంచడంతో పాటు ప్రతి ఇంటికీ పర్యావరణ పరిరక్షణను చేరువ చేయడమే తమ సంస్థ లక్ష్యమన్నారు. మిద్దె తోటలు, ఇంటి వ్యర్థాలతో కంపోస్టు తయారీ తదితర అంశాలపై గృహిణులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో ‘ధన్వంతరి వనం’ పేరుతో ఔషధ మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా చేపట్టినట్లు వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణ ఒక్కరోజు కార్యక్రమం కాదని.. ప్రతి కుటుంబం, విద్యార్థి, మహిళ తమ రోజువారీ జీవితంలో భాగంగా చేసుకోవాల్సిన బాధ్యత అని పేర్కొన్నారు.
కాగా, సిద్ధం చేసిన 2 లక్షల సీడ్‌బాల్స్‌ను అనుకూలమైన కొండలు, అటవీ, బంజరు ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా వెదజల్లి, సహజంగా విత్తనాలు మొలకెత్తేలా చర్యలు చేపట్టనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.





