ArticlesNews

సమాజ సేవలో స్వయంసేవకులు: ఆత్మీయతతో కూడిన నిస్వార్థ సమర్పణ

5views
వైష్ణవ జన్ తో తేనె రె కహియే, జే పీడ్ పరాయీ జానె రే’.. ఇతరుల కష్టాలను, బాధలను తనవిగా భావించి, ఆ బాధల నుంచి వారిని విముక్తం చేయడం కోసం చేపట్టే సహజమైన చర్యలనే ధర్మమన్నారు. ‘నాకు రాజ్యం కావాలన్న కోరిక లేదు, స్వర్గం పట్ల లేదా మోక్షం పట్ల కోరికలేదు. దుఃఖంలో మునిగితేలుతున్న వారినీ, పీడితులను ఆ బాధలు, వేదనల నుంచి ముక్తి కల్పించాలన్నదే నా కోరిక (కామయే దుఃఖ తప్తానాం ప్రాణినామార్తి నాశనమ్)’, ఇవి రాజా రంతిదేవుడు ప్రసిద్ధంగా అన్న మాటలు. అందుకే, వలసపాలన, బానిసత్వం నుంచి విముక్తమైన తర్వాత వచ్చిన నాయకులు, రాజ్యాంగనిర్మాతలు ఈ ధర్మం గొప్పదనం తెలుసుకుని, ‘ధర్మచక్ర ప్రవర్తనాయః’ అని లోక్‌సభలో, ‘సత్యం వద ధర్మం చర’ అని రాజ్యసభలో రాశారు. అత్యున్నత న్యాయస్థానం ధ్యేయ వాక్యం ` ‘యతో ధర్మస్తతో జయః’. ఇక భారత జాతీయ జెండాపై ఉన్న చక్రమే ‘ధర్మచక్రం.
భారతదేశంలో ‘రాష్ట్రం’ అన్నది పశ్చిమానికి చెందిన ‘నేషన్ స్టేట్’కు భిన్నమైంది. ఇక్కడ రాష్ట్ర అంటే సమాజం అని అర్థం. భారతదేశానికి చెందిన ఈ ఆధ్యాత్మికత ఆధారిత సంపూర్ణ-సమగ్ర జీవన దృక్పథాన్ని “హిందూ జీవన దృక్పథం” (హిందూ వ్యూ ఆఫ్ లైఫ్) అని డాక్టర్ రాధాకృష్ణన్ అభివర్ణించారు. దీని ఆధారంగా ధర్మాన్ని ఆచరించడం హిందుత్వ అభివ్యక్తి మాత్రమే. యావత్ భారతదేశంలో జీవించే ఈ సమాజం ఒక్కటే, మనందరం సమానం, వీరంతా నా వాళ్లే అన్న సంస్కారం, సంస్కృతి స్వయంసేవక్ సంఘ శాఖలోని కార్యక్రమాలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తల సాంగత్యంతో, సహవాసంతో అలవడుతుంది. మానవ, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు స్వయంసేవకులు అందించిన విశిష్టమైన, ఆత్మీయమైన సేవా కార్యాలను పూర్తిగా, ప్రత్యక్షంగా చూశాను, అనుభవంలోకి వచ్చాయి. విభజన దారుణాల కాలంలో అయినా, భూకంపాలు, వరదలు లేదా కరోనా వంటి అంటువ్యాధుల సమయంలో అయినా, వారి సేవలు అనన్యమైనవి. సిద్ధాంతపరంగా సంఘాన్ని వ్యతిరేకించేవారు కూడా స్వయంసేవకుల దేశభక్తి, క్రమశిక్షణ, అంకితభావం, సేవలతో ప్రభావితమయ్యారు. అంతేకాదు, ఆ విషయాలలో వారిని ప్రశంసిస్తారు కూడా.
seva4
కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ పాలనా కాలంలో ‘భాగ్ మిల్ఖా భాగ్’ చిత్రం ప్రసిద్ధ రన్నర్ మిల్ఖా సింగ్ జీవితం ఆధారంగా తీసింది. విభజనానంతరం పాకిస్తాన్ నుంచి భారత్ వచ్చిన నిరాశ్రిత హిందూ కుటుంబాలలో మిల్ఖా సింగ్ ది కూడా ఒకటని సినిమాలో చూపారు. దానితోపాటుగా, నిరాశ్రయుల కోసం సంఘ స్వయంసేవకుల ద్వారా నడిపిన సహాయక శిబిరాల దృశ్యాలు కూడా ఇందులో చూపించారు. కాంగ్రెస్ పాలనలో అటువంటి దృశ్యాలు చూపడం సాహసోపేతమైన చర్య. ఈ విషయమై సినిమా దర్శకుడిని ప్రశ్నించినప్పుడు, ‘దాదాపు నాలుగేళ్లుగా ఈ సినిమాపై పని చేస్తున్నాను. పాకిస్తాన్ నుంచి నిరాశ్రితులుగా భారత్ వచ్చినవారితో నేను ప్రత్యక్షంగా మాట్లాడాను. వారంతా కూడా సంఘం చేపట్టిన సహాయ శిబిరాల గురించి ఉల్లేఖించారు’ అని చెప్పాడు.
1977లో ఆంధ్రప్రదేశ్‌లో (కోస్తా ఆంధ్ర) దివిసీమలో భయంకరమైన తుఫాన్ వచ్చి, ఆ ప్రాంతాన్ని ధ్వంసం చేసింది. ఆ సందర్భంలో స్వయంసేవకులు ఎంతో అంకితభావంతో, సాహసంతో చేసిన సేవా కార్యక్రమాలు అనన్యమైనవి. కుళ్లిపోయి వాసన వస్తున్న మృతదేహాలకు దహన సంస్కారాలు చేపట్టింది సంఘం (ఆ పని చేసే స్వయంసేవకులను ‘శవ సేన’ అని పిలిచేవారు). పూర్తిగా ధ్వంసమైన మూలపాలెం గ్రామంలోని అందరికోసం పక్కా ఇళ్లను నిర్మించి ‘దీనదయాళ పురం’ పేరుతో ఈ ఇళ్లను ప్రజలకు అందించే కార్యక్రమానికి నాటి విదేశాంగ మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయ్, నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ చెన్నారెడ్డి హాజరయ్యారు. ఇద్దరూ కూడా సంఘ్ చేపట్టిన సేవాకార్యక్రమాలను ఎంతగానో ప్రశంసించారు. ఈ సమయంలో ప్రసిద్ధ గాంధేయవాది శ్రీ ప్రభాకర్ రావ్ జీ ఆర్‌ఎస్‌ఎస్‌ అంటే ‘రెడీ ఫర్ సెల్ఫ్‌లెస్ సర్వీస్’ అంటూ ‘ఆర్‌ఎస్‌ఎస్‌’కు కొత్త అర్ధాన్ని చెప్పారు.
2009 మేలో పశ్చిమ బెంగాల్‌లో వచ్చిన ఐలా తుపాను, రాష్ట్రంలోనే కాక 24 పరగణా జిల్లాలో చాలా విధ్వంసాన్ని సృష్టించింది. స్వయంసేవకులు తక్షణం సేవలోకి దూకారు. ఆ తర్వాత అక్కడ జరిగిన సంఘ శిక్షా వర్గ్‌కు నేను వెళ్లవలసి వచ్చింది. వారి సేవలు ప్రత్యక్షంగా చూసేందుకు మొదట జీప్ ద్వారా, తర్వాత పడవలో, అంతిమంగా మోకాళ్లలోతు బురదలో నడిచి సహాయక శిబిరానికి చేరుకోవలసి వచ్చింది. అక్కడ ఏయే సంస్థలు సహాయక కార్యక్రమాలు చేపట్టాయని నేను ప్రశ్నించినప్పుడు, అన్ని సంస్థలూ కూడా ముఖ్య మార్గాల్లో పని చేస్తున్నాయని జవాబువచ్చింది. అత్యధిక విధ్వంసం జరిగిన మారుమూల ప్రాంతాల్లో కేవలం సంఘానికి చెందిన స్వయంసేవకులు మాత్రమే పని చేస్తున్నారు.
seva1
2013లో కేదార్‌నాథ్‌లో క్లౌడ్ బరస్ట్ కారణంగా వచ్చిన వరదల్లో బాధితులకు సహాయం చేసేందుకు, స్వయంసేవకులు దేశవ్యాప్తంగా ప్రజల నుంచి విరాళాలు సేకరించారు. ఆ సమయంలో నాకు విదర్భకు చెందిన ఎం.డి. రామ్‌టేకే పేరుగల వ్యక్తి నుంచి ఈమెయిల్ వచ్చింది. ‘నేను ఆర్‌ఎస్‌ఎస్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తాను, విరోధిని. నేను దృఢమైన అంబేద్కర్వాదిని. సాక్షాత్తు బుద్ధ భగవానుడి అవతారం డా॥ అంబేడ్కర్ అని విశ్వసిస్తాను. అయినప్పటికీ, ఆర్‌ఎస్‌ఎస్‌కి చెందిన వారు సేవా కార్యక్రమాలను ఎంతో నిజాయితీతో, విశ్వసనీయతతో చేస్తారని అనుభవపూర్వకంగా చెప్పగలను. మీరు వారికి సేవ కోసం రూ.100 ఇస్తే, వారు తమ జేబులోని మరో పదిరూపాయలను జోడించి, 110 రూపాయలను సేవ కోసం ఉపయోగిస్తారు. అందుచేత, ఈ సమయంలో స్వయంసేవకులు మీ దగ్గరకు సహాయనిధి కోసం డబ్బు అడిగితే, మీరు పెద్ద మనసు చేసుకొని వారికి సహాయం చేయండి,’ అంటూ రాశారు.
అటువంటి నిస్వార్ధ, ఆత్మీయ సేవలు చేసే సంస్కారాన్ని వారు స్వయంసేవక శాఖ నుంచి అందుకుంటారు. ప్రకృతి లేక మానవ నిర్మిత విపత్తుల సమయంలో స్వయంసేవకులు సహాయక, పునరావాస చర్యలు చేపడుతున్నారు. కానీ,రాజనీతిక దుర్భావన కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వం రెండుసార్లు ` 1948లోనూ, 1975లోనూ సంఘంపై అనుచితమైన, చట్టవిరుద్ధమైన, అప్రజాస్వామిక ఆంక్షలు విధించి, సంఘ్‌ను అన్ని విధాలా అణచివేయడానికి ప్రయత్నాలు చేసింది. అయినప్పటికీ, ప్రజాస్వామ్య ప్రతిఘటన, పోరాటం అనంతరం సంఘ్ కార్యకలాపాలు మళ్లీ తీవ్రస్థాయిలో ప్రారంభమయ్యాయి.
1989-90లో సంఘ వ్యవస్థాపకులు డా॥ హెడ్గేవార్ శతజయంతి సందర్భంగా, సౌకర్యాల కొరత కారణంగా మురికివాడల్లో నివసిస్తున్న ఆర్థికంగా వెనుకబడిన సమాజ సభ్యులతో నిరంతరం సంపర్కంలో ఉండడం ద్వారా వారి అవసరాలను తీర్చడానికి సేవా కార్యక్రమాలను ప్రారంభించాలనే ఆలోచన వచ్చింది. ఈ నేపథ్యంలో సంఘ్ 1991లో సేవా విభాగాన్ని ప్రారంభించింది. నేడు, సంఘ్ స్వయంసేవకులు విద్య, ఆరోగ్యం, భద్రత, ఆర్థిక స్వావలంబన రంగాలలో వివిధ సేవాసంస్థల ద్వారా 1,67,113 సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
సంఘ్ స్వయంసేవకులు ఇలా చేయగలుగుతున్నారు, చేస్తూ వస్తున్నారు, ఎందుకంటే వారి సైద్ధాంతిక పునాది హిందుత్వపై ఆధారపడి ఉంది. ఈ హిందుత్వం ‘మతం’ కాదు. ఇది ఆధ్యాత్మికత ఆధారిత సంపూర్ణ, సర్వతోముఖమైన జీవన దృష్టి. అందుకే, ఆత్మీయత ఆధారంగా నిరపేక్ష భావనతో స్వయంసేవకులు ఇక్కడ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కొంతమంది వీరి సేవలను ‘మిషనరీల సేవ’లతో పోలుస్తుంటారు. కానీ, వాస్తవంలో మిషనరీలు మతాంతరీకరణ కోసం సేవలు అందిస్తారు. వారి సేవా భావం మూలంలో భారతీయత లేదు. క్రైస్తవ మిషనరీలుమతమార్పిడుల కోసం సేవలు చేస్తారనే విషయం, వారు చేపట్టే సేవా కార్యాల స్వభావం కారణంగా బాగా ప్రచారంలోకి వచ్చింది. మతమార్పిడులకు అవకాశం లేని చోట, వారు సేవా కార్యక్రమాలు చేపట్టరు. ఒక ఉదాహరణతో ఇది స్పష్టమవుతుంది.
మణిపూర్‌లో, మయన్మార్ సరిహద్దుకు సమీపంలో, ఉఖ్రుల్ అనే ఒక గ్రామం ఉంది. అక్కడ ఉన్నవారందరూ క్రైస్తవ మతం తీసుకున్నారు. అందువల్ల, అక్కడ ఎలాంటి విద్యా సౌకర్యాలు గానీ, పాఠశాలలు గానీ లేవు. 1971లో ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్ అయిన శంకర్ (భయ్యాజీ) కేనే ఆ గ్రామాన్ని సందర్శించినప్పుడు, అక్కడి పిల్లలకు విద్య అందుబాటులో లేకపోవడాన్ని గమనించారు. ఆయన అక్కడి పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందారు. భయ్యాజీ కొంతమంది పిల్లలను చదువుకోసం మహారాష్ట్రకు తీసుకువెళ్లారు. కానీ, తమ పిల్లలను మణిపూర్ నుండి ఒక అపరిచితుడితో మహారాష్ట్రకు పంపడం తల్లిదండ్రులకు కష్టంగా ఉండేది. అందుకే భయ్యాజీ, మహారాష్ట్ర నుండి తనతో పాటు వచ్చిన 12 ఏళ్ల బాలుడిని వారికి ధైర్యం చెప్పడానికి ఉఖ్రుల్‌లో ఉంచారు. క్రమంగా, వారిలో నమ్మకం పెరిగింది. ప్రతి సంవత్సరం, కొంతమంది పిల్లలు చదువుకోవడానికి మహారాష్ట్రకు రావడం మొదలుపెట్టారు. అది వారి జీవితాల్లోకి కొత్త వెలుగును తెచ్చింది.
చదువుకోవడానికి వచ్చిన పిల్లలందరూ క్రైస్తవులు. భయ్యాజీ (సంఘ ప్రచారక్) వారిని హిందూ మతంలోకి మార్చడానికి ప్రయత్నించలేదు. వారు క్రైస్తవులుగానే ఉండిపోయారు. చదువు పూర్తి చేసుకుని ఉఖ్రుల్‌కు తిరిగి వచ్చాక, ఈ పిల్లలు మంచి ఆదాయం ఆర్జించడం ప్రారంభించారు. భయ్యాజీ స్ఫూర్తితో, పిల్లలు అక్కడే ఉండి చదువుకోవడానికి వీలుగా ఉఖ్రుల్‌లో ఒక పాఠశాలను స్థాపించారు. సమీపంలోని పాఠశాలల పేర్లలో తరచుగా ‘స్కూల్’ లేదా ‘హైస్కూల్’ అనే పదాలు ఉంటాయి, కానీ భయ్యాజీ స్ఫూర్తితో స్థాపించిన ఈ పాఠశాలకు ‘ఓఝా శంకర్ విద్యాలయ’ అని పేరు పెట్టారు (స్థానిక మాండలికంలో, సమాజంలోని పెద్దలను గౌరవంగా ‘ఓఝా’ అని పిలుస్తారు).
‘సేవ’ అనే పదాన్ని ప్రయోగించక ముందు, భారతదేశంలో ఇటువంటి కార్యకలాపాలన్నింటినీ ‘ధర్మం’గా పరిగణించారు. ఇప్పటికీ అలాగే పరిగణిస్తున్నారు. ఇక్కడ ‘ధర్మం’ అంటే మతం కాదు. మన భాషలో మతాన్ని ‘పూజ’ లేదా ‘ఆరాధన’కు సమానార్థకంగా భావించవచ్చు. భారతదేశంలో ‘ధర్మం’ అనేది ఆధ్యాత్మికతకు ఒక అభివ్యక్తి. భారతదేశ ఆధ్యాత్మిక దృక్పథం సంపూర్ణమైంది, సర్వవ్యాపకమైంది. అది ఈ విశ్వం మొత్తం కూడా ఆధ్యాత్మికత ద్వారా పరస్పరం అనుసంధానితమై ఉందని భావిస్తుంది. అందువల్ల, భారతదేశంలో ప్రాచీన కాలం నుండి ‘వసుధైవ కుటుంబకం’ అనే సూత్రాన్ని పాటిస్తున్నారు. ‘నేను’ అనే భావన తగ్గి, కనువిప్పు కలిగినప్పుడు, ‘మనం’ అనే భావన పరిధి సహజంగానే విస్తరిస్తుంది. మనవారు కానివారు కూడా మనవారే అన్న భావన కలగడం మొదలవుతుంది. ఈ భావనే వారికోసం ఏదైనా చేసేలా మనల్ని ప్రేరేపిస్తుంది. అనుబంధ భావనతో సమాజానికి తిరిగి ఇవ్వడమే నిజమైన ధర్మం. స్వామి వివేకానంద ఐరిష్ శిష్యురాలైన సిస్టర్ నివేదిత, ‘ఏ సమాజంలోనైతే ప్రజలు తమ శ్రమ ఫలాలను (ప్రతిఫలాన్ని) తమ కోసం ఉంచుకోకుండా సమాజానికి అందిస్తారో, ఆ సమాజం అలా సేకరించిన ప్రతిఫలం (సామాజిక మూలధనం)తో సుసంపన్నమవుతుంది. ఆ సమాజంలోని ప్రతి వ్యక్తి జీవన ప్రమాణం మెరుగుపడుతుంది,’ అన్నారు. ఈ సామాజిక మూలధనాన్ని కొనసాగించడమే ధర్మం. ‘రెలిజియన్’ అంటే ధర్మం కాదు, ఉపాసన. ‘నేను’ అనే భావన అల్పమై, ‘మనం’ అనే భావన వ్యాపకం కావడానికి ఉపాసన సహాయపడుతుంది. ధర్మ ఆచరణలో కూడా ఉపాసన తోడ్పడుతుంది.
service
భారతీయ తత్వ విచారణ లేదా ఆలోచనలో భౌతిక సమృద్ధి (అభ్యుదయం), మోక్షం (ముక్తి), రెండిటి కోసం కృషి చేయడానికి సమానమైన ప్రాముఖ్యతను ఇచ్చారు. అందుకే ‘యతో అభ్యుదయ నిఃశ్రేయస సిద్ధిః స ధర్మః’ అంటూ వర్ణించారు. ఉత్పత్తిలో సమృద్ధి, పంపిణీలో సమానత్వం, వినియోగంలో సంయమనం అనేవి ప్రవర్తనా సూత్రాలుగా పరిగణిస్తారు. సంయమనంతో కూడిన వినియోగం ద్వారా మిగిలిపోయిన సంపదను, సమాజ శ్రేయస్సు కోసం, తాము కూడా ఆ సమాజానికి చెందినవారమనే భావనతో అంకితం చేయడమే ‘ధర్మం’. దీనివల్ల సామాజిక మూలధనం పెరుగుతుంది. సమాజానికి ఇవ్వడం ‘దానం’ అని, సమాజానికి తిరిగి ఇవ్వడం ‘ధర్మం’ అని రవీంద్రనాథ్ టాగోర్ అన్నారు. భారతదేశం శతాబ్దాలుగా ఈ సంప్రదాయాన్ని పాటిస్తోంది. యాత్రికుల కోసం నిర్మించిన వసతి గృహాన్ని ‘ధర్మశాల’ అంటారు. ‘ధర్మదాయ’ వైద్యశాలలో వైద్య చికిత్స, సంరక్షణ అందిస్తారు. పూర్వకాలంలో, రోడ్లు నిర్మించడం, నీడ కోసం చెట్లు నాటడం, నీటి కోసం బావులు లేదా మెట్ల బావులు నిర్మించడం, పుణ్యక్షేత్రాల వద్ద నదులపై ఘాట్లు నిర్మించడం వంటివాటినన్నింటినీ ‘ధర్మ’ (ధార్మిక) కార్యాలుగా పరిగణించారు.
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో, రష్యా పోలాండ్‌పై దాడి చేసినప్పుడు, 675 మంది స్త్రీలు, పిల్లలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఒక ఓడలో పారిపోయారు. అనేక దేశాలు వారికి ఆశ్రయం ఇవ్వడానికి నిరాకరించాయి. బ్రిటిష్ పాలన ఉన్న ఆ సమయంలో వారు ముంబైలో ఆశ్రయం కోరినప్పుడు, వారు క్రైస్తవులు అయినప్పటికీ బ్రిటిష్ వారు వారికి అనుమతి నిరాకరించారు. ఈ విషయం జామ్‌నగర్ (గుజరాత్) మహారాజుకు తెలిసినప్పుడు, ఆయన బ్రిటిష్ ప్రభుత్వాన్ని, ‘వారిని ముంబైలో దిగనివ్వండి. నేను వారందరినీ నా రాజ్యానికి తీసుకువస్తాను’ అని అభ్యర్థించారు. అయినప్పటికీ, బ్రిటిష్ వారు అనుమతి నిరాకరించారు. చివరకు, జామ్‌నగర్ మహారాజు వారిని సముద్ర మార్గం ద్వారా జామ్‌నగర్‌కు ఆహ్వానించి, జామ్‌నగర్ సమీపంలోని బాలాచెరిలో వారికి వసతి ఏర్పాటు చేసి, ఆహారం అందించడానికి గోవా నుండి ఏడుగురు వంటవారిని రప్పించారు (వారిని శాకాహారులుగా మార్చే యత్నం చేయలేదు). బ్రిటిష్ ప్రభుత్వం జోక్యాన్ని నివారించడానికి, మహారాజా ప్రతి ఆడపిల్లనీ, మహిళనీ తన ‘కుమార్తె’గా, ప్రతి అబ్బాయిని తన ‘కుమారుడి’గా పరిగణిస్తూ 675 దత్తత పత్రాలపై సంతకం చేసి, ‘మీరు నా కుమారులు, కుమార్తెలు, మీరు కోరుకున్నంత కాలం ఇక్కడ ఉండండి’ అని అన్నారు. వీరు జామ్‌నగర్‌లో సుమారు 9 సంవత్సరాలు నివసించారు. యుద్ధం తరువాత వారు పోలాండ్‌కు తిరిగి వెళ్లారు. జామ్‌నగర్ మహారాజాకి కృతజ్ఞతగా, పోలిష్ రాజధానిలోని ఒక కూడలికి ‘గుడ్ మహారాజా స్క్వేర్’ అని పేరు పెట్టారు.
1996 నవంబర్ 12వ తేదీ రాత్రి, హర్యానాలోని చర్ఖీ-దాద్రి సమీపంలో సౌదీ అరేబియా, కజఖ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన రెండు విమానాలు ఢీకొని కూలిపోయాయి. రెండు విమానాల్లోనూ మొత్తం 351 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 300 మంది ముస్లింలు కాగా, 12 మంది క్రైస్తవులు. ప్రమాదం జరిగిన వెంటనే, జిల్లా సంఘచాలక్ జిత్రామ్‌జీ, ఇతర స్వయంసేవకులు, డాక్టర్ హెడ్గేవార్ ఆసుపత్రి వైద్యులు, సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చీకటి పడటంతో, పెట్రోమాక్స్ లైట్లు, జనరేటర్లు ఏర్పాట్లు చేసి, వెంటనే మృతదేహాలన్నింటినీ భివానీలోని ఆసుపత్రికి తరలించారు. ఈ వార్త తెలియగానే, ఉదయానికల్లా మృతుల బంధువులు, పోలీసు యంత్రాంగం, పాత్రికేయులు మొదలైనవారు అక్కడికి చేరుకోవడం ప్రారంభించారు. మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించారు. బంధువులు ఎవరో తెలియని 76 మంది ముస్లింలు, ముగ్గురు క్రైస్తవులను వారి వారి మత, ఆచారాల ప్రకారం ఖననం చేశారు. ఈ పనిలో స్థానిక మత గురువు, ముంబైకి చెందిన కొందరు వ్యక్తులు సహాయపడ్డారు. మూడు రోజుల తరువాత, నవంబర్ 15న, దాద్రీ మసీదులో జరిగిన కృతజ్ఞతా సభలో జిల్లా సంఘచాలక్ జీత్రామ్‌జీని సత్కరించారు. మర్నాడు, చాలా వార్తా పత్రికలలో ప్రధాన శీర్షిక, ‘మసీదులో ఖాకీ నిక్కరు.. కాషాయ కండువాకి గౌరవం’ అని వచ్చింది.
ఇది స్వయంసేవకుల ద్వారా జరిగిన ధర్మ సాక్షాత్కారం. జామ్‌నగర్ మహారాజు కార్యం స్వచ్ఛమైన ధర్మం నుండి ప్రేరణ పొందింది. మణిపూర్‌లో పిల్లలకు విద్యను అందించాలన్న భయ్యాజీ కేనే చొరవ కూడా ధర్మం నుండి ప్రేరణ పొందింది. వారితో అంతర్ దృష్టితో మమేకమవ్వడానికి, వారి బాధలను అర్థం చేసుకోవడానికి, ఎలాంటి వివక్ష లేకుండా వాటిని తగ్గించడానికి సాధ్యమైనదంతా చేయడానికి ఆధ్యాత్మికత ఆయనకు వీలు కల్పించింది. ఇదే నిజమైన ధర్మం.
క్లుప్తంగా చెప్పాలంటే –
వ్యక్తులను ధార్మికులుగా, సమాజాన్ని ధర్మబద్ధంగా (లౌకికంగా కాదు) మార్చడమే సంఘ్ ప్రయత్నం. అటువంటి సమాజాన్ని సృష్టించడం అంటే, దేశం హిందూగా మారడమే. సేవ విషయానికి వస్తే, దానిని ఒక ‘ధర్మం’గా చేయడం భారతీయ సంప్రదాయం. స్వామి వివేకానంద దీనిని ‘శివ’ భావనతో ప్రాణులకు సేవ చేయడం అని అన్నారు. మానవునికి (జీవునికి) సేవ చేయడమే ఆ భగవంతుడిని (శివుడిని) ఆరాధించడం.
మన్మోహన్ వైద్య