
న్యూఢిల్లీ: ‘పద్మావత్’ చిత్రంలోని ‘జౌహర్’ ఘట్టంపై నటి స్వరా ఫహద్ అహ్మద్ (గతంలో స్వరా భాస్కర్) చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు న్యాయవాది అమితా సచ్‌దేవా అభ్యంతరం వ్యక్తం చేశారు. స్వరా వెంటనే క్షమాపణ చెప్పాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
ఈ మేరకు అమితా సచ్‌దేవా సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో స్పందించారు. ‘పద్మావత్’ చిత్రం చిత్తూరు మహిళలు, రాణి పద్మావతి వీరత్వం, త్యాగాలను ‘జౌహర్’ నేపథ్యంలో చూపించిందని పేర్కొన్నారు. ఈ విషయం తెలిసినప్పటికీ స్వరా చేసిన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగానే చేసినవిగా తాను భావిస్తున్నట్లు ఆమె తెలిపారు.
‘తప్పుడు అనువాదం’ అంటూ వివరణ ఇవ్వడం సరైన సమాధానం కాదని అమితా సచ్‌దేవా పేర్కొన్నారు. బాధితులకు జీవించే హక్కు ఉందనే ఉద్దేశంతో వ్యాఖ్యలు చేసి ఉంటే, రాణి పద్మావతి లేదా జౌహర్ ప్రస్తావన లేకుండానే ఆ విషయాన్ని చెప్పి ఉండవచ్చని అన్నారు.
తన అభ్యంతరాన్ని కేవలం విజ్ఞప్తిగా భావించవద్దని, క్షమాపణ చెప్పకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అమితా సచ్‌దేవా తన పోస్టులో పేర్కొన్నారు. రాణి పద్మావతి, జౌహర్‌కు పాల్పడిన మహిళలు, ఆ చారిత్రక నేపథ్యానికి గౌరవం చూపుతూ క్షమాపణ చెప్పాలని కోరారు.
ఇదిలా ఉండగా, ‘పద్మావత్’ చిత్ర సహ రచయిత ప్రకాశ్ కపాడియా కూడా ఈ అంశంపై గతంలో స్పందించారు. ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, చరిత్ర పుస్తకాల్లో నమోదైన సమాచారం, తాను చేసిన పరిశోధన ఆధారంగానే చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు.
‘పద్మావత్’లో జౌహర్ సన్నివేశంతో సహా చూపించిన అంశాలు ఆ కాలం నాటి పరిస్థితులను ప్రతిబింబించేలా ఉన్నాయని ప్రకాశ్ కపాడియా పేర్కొన్నారు. ఒకే సినిమాను ఒక్కొక్కరు ఒక్కో దృక్పథంతో చూస్తారని, ప్రేక్షకుడి ఆలోచనా విధానాన్ని బట్టి సినిమా పట్ల అభిప్రాయం మారవచ్చని అన్నారు.
‘పద్మావత్’ విడుదల సమయంలో సినిమా చూడకుండానే పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేసి, నిరసనలు చేపట్టారని ఆయన గుర్తుచేశారు. ఈ అంశంపై చర్చ చాలా కాలంగా కొనసాగుతోందని, సినిమా పట్ల ప్రజలు ఎలాంటి అభిప్రాయం కలిగి ఉండాలనుకుంటున్నారనేది వారి వ్యక్తిగత నిర్ణయమని ప్రకాశ్ కపాడియా వ్యాఖ్యానించారు.
స్వరా ఫహద్ అహ్మద్ వ్యాఖ్యలు, వాటిపై వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో ఈ వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది.





