News

‘పద్మావత్’ జోహార్‌పై స్వర భాస్కర్ వ్యాఖ్యలు.. భగ్గుమన్న బీజేపీ, కర్ణిసేన

6views

ముంబై: బాలీవుడ్ నటి స్వర భాస్కర్ చేసిన తాజా వ్యాఖ్యలు మరోసారి వివాదానికి దారితీశాయి. 2018లో విడుదలైన ‘పద్మావత్’ చిత్రంలోని ‘జోహార్’ (సామూహిక ఆత్మాహుతి) ఘట్టాన్ని ఉద్దేశిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలపై బీజేపీ, కర్ణిసేన తీవ్రంగా స్పందించాయి. మహిళల ఆత్మగౌరవం, త్యాగాలను కించపరిచేలా స్వర భాస్కర్ మాట్లాడారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న స్వర భాస్కర్.. శత్రువుల చేతికి చిక్కకుండా ఉండేందుకు మహిళలు ఆత్మాహుతి చేసుకోవడాన్ని గొప్పగా చిత్రించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. అత్యాచార ఘటనలు పెరుగుతున్న ప్రస్తుత సమాజంలో మహిళలకు ఇలాంటి సందేశాన్ని ఇవ్వడం సరికాదని ఆమె ప్రశ్నించారు.

ఆత్మాహుతి చేసుకోకపోతే తనను తాను పిరికిదానిగా భావించాలా? అని ఆమె ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో స్వర భాస్కర్ వివరణ ఇచ్చారు. తాను రాణి పద్మావతిని ఉద్దేశించి ‘పిరికిపంద’ అనే పదాన్ని ఉపయోగించలేదని స్పష్టం చేశారు.

స్వర భాస్కర్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రస్థాయిలో స్పందించింది. ఆమె ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదువుతున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా విమర్శించారు. మహిళలు తోటి మహిళలను గౌరవించుకోవాలని, చారిత్రక మహిళల త్యాగాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు.

మరోవైపు హిందూ సమాజాన్ని, రాజపుత్ర మహిళలను అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ బీహార్‌కు చెందిన బీజేపీ నేత కృష్ణ కుమార్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

కర్ణిసేన హెచ్చరిక
ఈ వివాదంపై కర్ణిసేన కూడా తీవ్రంగా స్పందించింది. హిందూ యోధురాళ్లను, వారి త్యాగాలను అవమానించే వ్యాఖ్యలను సహించబోమని ఆ సంస్థ మహిళా విభాగం అధ్యక్షురాలు కీర్తి రాథోడ్ హెచ్చరించారు.

హిందూ సంప్రదాయాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం ఎందుకని ఆమె ప్రశ్నించారు. ఇతర మతాలకు సంబంధించిన అంశాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయగలరా అని నిలదీశారు.