News

కూతురి చదువు కోసం పరుగెత్తిన తల్లి.. చెప్పులు చేతిలో పట్టుకుని మారథాన్‌లో విజయం

25views

బీడ్‌: దృఢ సంకల్పం ఉంటే ఎలాంటి సవాళ్లనైనా అధిగమించవచ్చని నిరూపించారు మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లా అంబాజోగైకు చెందిన రమాబాయి రణ్‌వీర్‌ (47). ఓ వైపు కుటుంబ బాధ్యతలు.. మరోవైపు పిల్లల చదువుపై తల్లి అంకితభావం.. ఈ రెండింటినీ తన పరుగులో చూపించిన ఆమె ఇప్పుడు స్ఫూర్తిదాయకంగా నిలిచారు.

భారతీయ ప్రసారక్‌ సంస్థకు చెందిన ఖోలేశ్వర్‌ విద్యా సముదాయం అమృత మహోత్సవం సందర్భంగా గత నెల 30న నిర్వహించిన ‘అమృత్‌ దౌడ్‌’ మారథాన్‌లో రమాబాయి పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో స్థానిక యువతీ యువకులు పాల్గొన్న ఈ పోటీలో ఆమె రూ.3 వేల నగదు బహుమతిని గెలుచుకున్నారు.

అయితే ఈ విజయానికి అసలు కారణం బహుమతి కాదని.. తన కూతురి చదువుకు ఆర్థికంగా తోడ్పడాలనే సంకల్పమని రమాబాయి తెలిపారు. మారథాన్‌లో గెలిచిన నగదు బహుమతిని తన కుమార్తె చదువుకు ఉపయోగించాలని ఆమె నిర్ణయించుకున్నారు.

చెప్పులు జారినా.. ఆగని పరుగు
నిరాడంబరమైన చీర, సాధారణ చెప్పులు ధరించి రమాబాయి మారథాన్‌లో పాల్గొన్నారు. పోటీలో పాల్గొన్న ఇతర యువతీ యువకులతో పోలిస్తే ఆమె ప్రత్యేకంగా కనిపించలేదు. పైగా రేసు ప్రారంభమైన తర్వాత ఆమె ధరించిన చెప్పులు పదేపదే జారిపోవడంతో పరుగుపై ప్రభావం పడింది.

అయినా రమాబాయి వెనక్కి తగ్గలేదు. చెప్పులు తన వేగానికి అడ్డంకిగా మారుతున్నాయని గుర్తించి వాటిని కాళ్ల నుంచి తీసి చేతుల్లో పట్టుకున్నారు. అనంతరం వట్టి కాళ్లతో రాళ్లు ఉన్న రహదారిపై పరుగును కొనసాగించారు.

చీరతో పరుగెత్తడం, పాదరక్షలు లేకపోవడం వంటి ఎన్నో ఇబ్బందులు ఎదురైనా ఆమె తన దృష్టిని గమ్యస్థానంపైనే నిలిపారు. బూట్లు, ట్రాక్‌ సూట్లు ధరించి వేగంగా పరుగెత్తుతున్న యువ పోటీదారులను వెనక్కి నెట్టి ముందుకు సాగారు.

గెలుపు కంటే గొప్ప సందేశం
చివరికి అందరినీ అధిగమించి ముందుగా గమ్యస్థాన రేఖను చేరుకుని మారథాన్‌ విజేతగా నిలిచారు రమాబాయి. ఆమె విజయంతో అక్కడి ప్రేక్షకులు, నిర్వాహకులు భావోద్వేగానికి గురయ్యారు. కూతురి చదువు కోసం ఆమె చూపించిన పట్టుదల, నిబద్ధతను వారు అభినందించారు.

రమాబాయి గెలుచుకున్న రూ.3 వేల నగదు బహుమతి పెద్ద మొత్తం కాకపోవచ్చు. కానీ తల్లి ప్రేమ, పిల్లల భవిష్యత్తుపై ఉన్న బాధ్యత, లక్ష్యాన్ని చేరుకోవాలనే దృఢ సంకల్పం కలిస్తే చిన్న విజయమే ఎంత గొప్ప అర్థాన్ని సంతరించుకుంటుందో ఆమె నిరూపించారు.

కూతురి చదువు కోసం చీరలో.. చెప్పులు చేతిలో పట్టుకుని.. వట్టి కాళ్లతో పరుగెత్తిన రమాబాయి రణ్‌వీర్‌ విజయం ఇప్పుడు తల్లిదండ్రుల అంకితభావానికి, పట్టుదలకు ఒక స్ఫూర్తిదాయక ఉదాహరణగా నిలిచింది.