News

వైఖానస ఆగమం.. విశిష్టమైన వైదిక ఆగమ సంప్రదాయం

0views

తిరుమల : ఆలయ ఆరాధనా సంప్రదాయాల్లో వైఖానస ఆగమానికి విశిష్టమైన స్థానం ఉందని పండితులు పేర్కొన్నారు. శ్రీ విఖనస మహర్షి వైఖానస ఆగమానికి మూలకర్త అని, ఆలయ ఆరాధనను శాస్త్రబద్ధంగా నిర్వహించేందుకు ఈ ఆగమ సంప్రదాయం మార్గదర్శకంగా నిలుస్తోందని తెలిపారు.

శ్రీ విఖనస మహర్షి జయంతిని పురస్కరించుకుని తిరుమల ఆస్థాన మండపంలో జయంతి సభ నిర్వహించారు. టీటీడీ అళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు, శ్రీ వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధని సభ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా పండితులు శ్రీ విఖనస మహర్షి గొప్పతనాన్ని, వైఖానస ఆగమ సంప్రదాయ విశిష్టతను వివరించారు. వైఖానస కల్పసూత్రం ఆధారంగా ఏర్పడిన ఈ సంప్రదాయం ఆలయ నిర్మాణం, దేవతా ప్రతిష్ఠ, నిత్యార్చన, ఉత్సవాలు, జ్ఞానం, యోగం తదితర అంశాలను శాస్త్రబద్ధంగా వివరిస్తుందని పేర్కొన్నారు.

తిరుమలలో వైఖానస ఆగమ సంప్రదాయం
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారికి వైఖానస ఆగమ విధానంలోనే అర్చనాదులు నిర్వహిస్తున్నారని పండితులు తెలిపారు. శ్రీవారి ఆలయంలో కొనసాగుతున్న ప్రాచీన ఆరాధనా సంప్రదాయానికి వైఖానస ఆగమం ప్రధాన ఆధారంగా ఉందని పేర్కొన్నారు.

వైఖానస ఆగమం కేవలం ఆలయ పూజా విధానాలకు మాత్రమే పరిమితం కాదని, భక్తి, ధర్మం, దయ, కరుణ, సర్వజీవహితం వంటి విశాలమైన ఆధ్యాత్మిక విలువలను కూడా బోధిస్తుందని వక్తలు వివరించారు.

ప్రాచీన జ్ఞాన సంపద పరిరక్షణ అవసరం
వైఖానస ఆగమ సంప్రదాయం ద్వారా తరతరాలుగా కొనసాగుతున్న ప్రాచీన జ్ఞాన సంపదను పరిరక్షించడం ఎంతో అవసరమని పండితులు అన్నారు. ఆగమ శాస్త్రాలపై పరిశోధనలు కొనసాగిస్తూ, వాటి విశిష్టతను భవిష్యత్ తరాలకు అందించడంలో తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్న కృషిని వారు అభినందించారు. ఆలయ సంప్రదాయాలు, ఆగమ విధానాలు, పూజా కైంకర్యాల వెనుక ఉన్న శాస్త్రీయ, ఆధ్యాత్మిక విశేషాలను నేటి తరానికి పరిచయం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి శ్రీ విఖనస ట్రస్ట్ కార్యదర్శి గంజాం ప్రభాకరాచార్యులు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా అగ్నిహోత్ర సనత్ కుమార్ ఆచార్యులు పాల్గొన్నారు.

ప్రధాన వక్తలుగా జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు ప్రొఫెసర్ డాక్టర్ వేదాంతం శ్రీవిష్ణు భట్టాచార్యులు, నంద్యాల నేషనల్ కళాశాల సంస్కృత ఆచార్యులు డాక్టర్ డి.వి. హయగ్రీవాచార్యులు పాల్గొని వైఖానస ఆగమ విశిష్టతపై ప్రసంగించారు.

కార్యక్రమంలో జీవీఎల్ఎన్ శ్రావణ్ కుమార్, అగ్నిహోత్రం శ్రీకర్, గుడిమళ్ల మాధురి, నారాయణ వరాహ వెంకట నరసింహ దీక్షితులు, గోవర్ధనం రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు.