News

ప్రతి విషయంలోనూ దైవత్వాన్ని దర్శించాలి : మోహన్ భగవత్

24views

అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్‌సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ న్యూయార్క్ ఈస్ట్ విలేజ్ ఉన్న ‘భక్తి సెంటర్’లో ఇస్కాన్ (ISKCON) నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఈ మొత్తం ప్రపంచాన్ని శ్రీకృష్ణుని స్వరూపంగా అభివర్ణించారు. ప్రపంచంలో రకరకాల వైవిధ్యాలు, భిన్నాభిప్రాయాలు, ఘర్షణలు, విభిన్న పరిస్థితులు ఉన్నప్పటికీ, వాటన్నింటి వెనుక అంతర్లీనంగా ఉన్నది శ్రీకృష్ణ తత్వమేనని స్పష్టం చేశారు.

జీవితంలో వచ్చే సవాళ్లు, బాధ్యతల నుంచి ఎవరూ పారిపోకూడదని భగవద్గీతలోని మూల సందేశాన్ని ప్రస్తావిస్తూ ఆయన వివరించారు. ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని నిష్టతో నెరవేరుస్తూ ప్రతి విషయంలోనూ దైవత్వాన్ని దర్శించాలని సూచించారు. ఈ సందేశం ప్రతి ఒక్కరి హృదయానికి చేరినప్పుడు ఈ ప్రపంచం భౌతిక సరిహద్దులకు పరిమితం కాకుండా మానవులందరికీ స్వర్గధామంలా మారుతుందని పేర్కొన్నారు.

కార్పొరేట్ కంపెనీ పనితీరును ఉదాహరణగా చూపిస్తూ, అక్కడ ఉన్నతాధికారులు, సీఈఓలు ప్రణాళికలు రూపొందిస్తే ఉద్యోగులందరూ ఐక్యంగా ఆ లక్ష్య సాధన కోసం శ్రమిస్తారని గుర్తుచేశారు. అందరూ ఒకే ఉమ్మడి లక్ష్యం కోసం పనిచేస్తున్నామని గ్రహించినప్పుడు ప్రగతి వేగవంతమవుతుందని తెలిపారు. ఇదే భావనతో మానవాళి అంతా భగవంతుని సేవలో నిమగ్నమై ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని కూడా మోహన్ భగవత్ ప్రస్తావించారు. సమాజాన్ని ఉన్నతమైన చేతన వైపు సిద్ధం చేయడానికి, ఆ చైతన్యాన్ని సమాజంలోని ప్రతి వర్గానికి చేరవేసేందుకు సంఘం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు.