
ఆయుర్వేద సౌందర్య చిట్కాలు అనగానే ‘పాత కాలపు పద్ధతులు’ అంటూ కొట్టిపారేసేవారు చాలామందే. కానీ ప్రాచీన భారతీయ జీవన విధానంలో భాగమైన ఆయుర్వేదం ఆరోగ్య పరిరక్షణతో పాటు సౌందర్య పోషణలోనూ కీలక పాత్ర పోషిస్తుందని ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌శ్రీ పథి నమ్ముతారు. చిన్నతనం నుంచే ఆయుర్వేద పద్ధతులను తన జీవనశైలిలో భాగం చేసుకున్న ఆమె.. వాటి ద్వారా పొందిన అనుభవంతో ఈ ప్రాచీన విజ్ఞానంపై మరింత ఆసక్తి పెంచుకున్నారు. ఆ అనుభవమే చివరకు ఆమెను ఆయుర్వేద ఆధారిత సౌందర్య వ్యాపారం వైపు నడిపించింది.
తమిళనాడులోని కోయంబత్తూరులో పెరిగిన రాజ్‌శ్రీకి చిన్నప్పటి నుంచే ఆయుర్వేదంతో పరిచయం ఏర్పడింది. ఆమె కుటుంబంలో ఆయుర్వేద పద్ధతులను ప్రత్యేకంగా పాటించేవారు.
ఆదివారం వచ్చిందంటే ఇంట్లోని మహిళలంతా ప్రత్యేకమైన నూనెలతో మసాజ్ చేయించుకోవడం, మూలికలతో జుట్టు సంరక్షణ చేసుకోవడం సాధారణంగా ఉండేదట. యూకలిప్టస్ ఆకులతో వేడి చేసిన నీటితో తలస్నానం చేయడం, షాంపూకు బదులుగా కుంకుడు కాయ రసాన్ని ఉపయోగించడం వంటి పద్ధతులను చిన్నతనంలోనే ఆమె గమనించారు.
ఈ సహజ పద్ధతుల కారణంగా జుట్టు ఆరోగ్యంగా, నల్లగా, ఒత్తుగా కనిపించడంతో పాటు సహజమైన పరిమళాన్ని కూడా వెదజల్లడాన్ని ఆమె గమనించేవారు. అప్పుడే ఆయుర్వేదం కేవలం ఆరోగ్య సమస్యలకు సంబంధించిన విధానం మాత్రమే కాదని.. సహజ సౌందర్య పరిరక్షణలోనూ దానికి ప్రత్యేకమైన స్థానం ఉందని ఆమెకు అర్థమైంది.
ఈ అనుభవమే ప్రాచీన భారతీయ సౌందర్య పద్ధతులను ఆధునిక తరానికి పరిచయం చేయాలనే ఆలోచనకు బీజం వేసింది.
వ్యాపార కుటుంబంలో జన్మించిన రాజ్‌శ్రీ కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో ఓనర్/ప్రెసిడెంట్స్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌ను పూర్తిచేశారు. భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత కుటుంబానికి చెందిన దుస్తుల వ్యాపారంలో చేరి దాన్ని విజయవంతంగా ముందుకు నడిపించారు.
కళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ‘ఇండియా డిజైన్ ఫోరమ్’ అనే సంస్థను కూడా స్థాపించారు. అనంతరం 2002లో స్నేహితులతో కలిసి ప్రాచీన ఆయుర్వేద మూలికలను ఆధారంగా చేసుకుని సహజసిద్ధమైన చర్మ, కేశ సంరక్షణ, బాడీ కేర్ ఉత్పత్తులను తయారుచేసే సంస్థను ప్రారంభించారు.
దాదాపు రెండు దశాబ్దాల పాటు ఆ సంస్థలో కొనసాగిన తర్వాత 2022లో బయటకు వచ్చి సొంతంగా మరో వ్యాపారాన్ని ప్రారంభించారు. ఈసారి ఆమె లక్ష్యం మరింత స్పష్టంగా ఉంది.. భారతీయ ఆయుర్వేద జ్ఞానాన్ని ఆధునిక శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానించి ఈ తరం వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడం.
ఆయుర్వేద ఉత్పత్తులు సహజసిద్ధమైన ప్రయోజనాలను అందించినప్పటికీ వాటి ప్రభావం కనిపించడానికి కొంత సమయం పడుతుందని చాలామంది భావిస్తారు. ఆధునిక వినియోగదారులు మాత్రం త్వరిత ఫలితాలను కోరుకుంటున్నారు. ఈ రెండు అవసరాలను సమన్వయం చేయడమే తన లక్ష్యమని రాజ్‌శ్రీ చెబుతున్నారు.
అందులో భాగంగా స్విట్జర్లాండ్‌కు చెందిన బయోటెక్నాలజీ సంస్థలతో కలిసి పనిచేస్తూ.. అక్కడి ప్రయోగశాలల్లో పరిశీలించిన వృక్ష ఆధారిత పదార్థాలను ఆయుర్వేద మూలికలతో మేళవించి సౌందర్య ఉత్పత్తులను అభివృద్ధి చేస్తున్నట్లు ఆమె తెలిపారు.
తొలుత జుట్టు సంరక్షణ ఉత్పత్తులతో ప్రారంభించిన ఆమె.. ప్రస్తుతం చర్మ సంరక్షణ ఉత్పత్తుల రంగంలోకీ విస్తరించారు. హెయిర్ ఆయిల్స్, షాంపూలు, కండిషనర్లు, చర్మానికి మెరుపునిచ్చే సీరమ్స్ వంటి ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
సహజ పదార్థాలకు ప్రాధాన్యం ఇవ్వడం తమ ఉత్పత్తుల ప్రత్యేకతగా ఆమె పేర్కొంటున్నారు. సల్ఫేట్లు, పారాబెన్లు, కృత్రిమ పరిమళాలు వంటి పదార్థాలను ఉపయోగించకుండా ఉత్పత్తులను రూపొందిస్తున్నామని చెబుతున్నారు.
రాజ్‌శ్రీ ప్రయాణం కేవలం ఒక బ్యూటీ బ్రాండ్ విజయగాథ మాత్రమే కాదు. చిన్నతనంలో కుటుంబం నుంచి పరిచయమైన భారతీయ సంప్రదాయాలను ఆధునిక వ్యాపార ఆలోచనతో అనుసంధానించిన కథ కూడా. ప్రాచీన ఆయుర్వేద జ్ఞానాన్ని ఆధునిక సాంకేతికతతో కలిపి ప్రపంచ వినియోగదారులకు అందించాలనే ప్రయత్నం ఆమె వ్యాపార ప్రయాణానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది.
వ్యాపార రంగంలో ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా పద్మశ్రీ పురస్కారం లభించడంతో పాటు.. దేశ, విదేశాల్లో జరిగే పలు ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేస్తూ తన అనుభవాలను పంచుకుంటున్నారు. సంప్రదాయ జ్ఞానాన్ని ఆధునిక ఆవిష్కరణలతో కలిపితే కొత్త అవకాశాలను సృష్టించవచ్చనే సందేశాన్ని ఆమె ప్రయాణం అందిస్తోంది.




