News

హిందూ ఆలయం కూల్చివేతలో ఉత్సుకత.. చర్చి విషయంలో మాత్రం అలసత్వం

17views

తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో కురుంబూర్ రైల్వే స్టేషన్ సమీపాన ఉన్న 200 ఏళ్ల నాటి ‘‘రైలాడి వినాయగర్’’ ఆలయ కూల్చివేతపై హిందూ మున్నణి తీవ్రంగా మండిపడింది. ఈ కూల్చివేతను ఖండిస్తున్నట్లు ప్రకటించింది. అదే ప్రాంతంలో మరో మతపరమైన నిర్మాణం కూడా వుందని, దానిని తొలగించడంలో రైల్వే అధికారులు వివక్షాపూరిత వైఖరిని అవలంబించారని ఆరోపించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర సహాయ మంత్రి మురుగన్‌కి వినతి పత్రం కూడా సమర్పించారు.

హిందూ ఆలయ కూల్చివేతకు బాధ్యులైన టి.ఎన్. ప్రమీల, ఇతర రైల్వే అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆ వినతి పత్రంలో డిమాండ్ చేశారు. వినాయగర్ ఆలయాన్ని అదే స్థలంలో తిరిగి నిర్మించాలని కూడా ఆ ప్రతినిధి బృందం విజ్ఞప్తి చేసింది. తగిన చర్యలు తీసుకుంటామని మురుగన్ ఆ బృందానికి హామీ ఇచ్చినట్లు హిందూ మున్నాని తెలిపింది.

రైల్వే భూమిని ఆక్రమించారన్న ఆరోపణలకు సంబంధించిన కోర్టు ఆదేశాల మేరకు, ఆగస్టు 19, 20 తేదీల మధ్య రాత్రి వేళ కురుంబూర్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఆలయాన్ని కూల్చివేయడానికి రైల్వే అధికారులు ఎర్త్‌ మూవర్‌ను ఉపయోగించారని ‘హిందూ మున్నణి’ పేర్కొంది. ఈ చర్యను నిలిపివేయాలని హిందూ భక్తులు, ఆ సంస్థ ప్రతినిధులు విజ్ఞప్తి చేసినప్పటికీ, కూల్చివేతను కొనసాగించారని ఆ సంస్థ ఆరోపించింది.

ఆగస్టు 19 ఉదయం తాము అధికారులను కలిసి, ఆలయ కూల్చివేతను నిలిపివేయాలని విజ్ఞప్తి చేసినట్లు హిందూ మున్నణి ప్రతినిధులు తెలిపారు. అయితే, అధికారులు ఆ ప్రక్రియను కొనసాగించడానికి సిద్ధమవుతున్నారని తెలిసి తాము ఆశ్చర్యపోయామని, ఆ తర్వాత కొద్ది గంటల వ్యవధిలోనే ఆలయాన్ని కూల్చివేశారని వారు పేర్కొన్నారు. రైల్వే అధికారులు ఈ స్థలాన్ని ఆక్రమణకు గురైన రైల్వే ఆస్తిగా గుర్తించామని, కోర్టు ఆదేశాల మేరకే ఈ చర్య చేపట్టామని పేర్కొన్నారు.

అయితే, ‘జీసస్ రీడీమ్స్’ (Jesus Redeems) అనే స్వచ్ఛంద సంస్థను నడుపుతున్న బోధకుడు మోహన్ సి. లాజరస్‌కు సంబంధించిన సమీపంలోని చర్చిని మాత్రం ఏమీ చేయకుండా వదిలేశారని హిందూ మున్నణి ఆరోపించింది. హిందూ ఆలయాన్ని కూల్చివేయాలని ఆదేశించడంలోనూ, అదే సమయంలో చర్చిని మాత్రం అలాగే ఉంచడంలోనూ మదురైకి చెందిన ఒక రైల్వే అధికారి పాత్ర ఉందని కూడా ఆ సంస్థ ఆరోపించింది.