News

ప్రపంచంలోనే తొలి ఐవీఎఫ్ దూడ జననం- అసోం యూనివర్సిటీ పరిశోధకుల అద్భుత ఆవిష్కరణ

4views

దేశీయ పశు జాతుల పరిరక్షణలో అస్సోం మరో కీలక ముందడుగు వేసింది. పశుసంవర్ధక, బయోటెక్నాలజీ రంగంలో ఒక చరిత్రాత్మక మైలురాయిని నమోదు చేసింది. అసోం రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ స్వదేశీ ‘లఖిమి’ జాతికి చెందిన ఆడ దూడ ఐవీఎఫ్ పద్ధతి ద్వారా జన్మించింది. ప్రపంచంలో ఐవీఎఫ్ పద్ధతిలో దూడ జన్మించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. రాష్ట్రంలోని పశు సంపద సంరక్షణ, పాడి పరిశ్రమ అభివృద్ధి దిశగా పరిశోధనలు చేస్తున్న అసోం వెటర్నరీ అండ్ ఫిషరీ యూనివర్సిటీ ఈ ఘనత సాధించింది. దేశీయ పశు జాతుల పరిరక్షణతో పాటు పాల ఉత్పత్తిని పెంచేందుకు ఈ సాంకేతికత కీలకంగా మారుతుందని పరిశోధకులు భావిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘రాష్ట్రీయ గోకుల మిషన్’ ఆర్థిక సహాయంతో అసోం వెటర్నరీ అండ్ ఫిషరీ యూనివర్సిటీ పరిధిలోని ప్రయోగశాలలో దీనికి సంబంధించిన ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. స్వచ్ఛమైన లఖిమి జాతి ఆవు పిండం ద్వారా ఈ ఆడ దూడను ఉత్పత్తి చేశారు. దేశీయ పశు జాతుల జన్యు వనరులను కాపాడుకోవడంతో పాటు వాటి సంఖ్యను పెంచేందుకు ఈ సాంకేతికతను ఉపయోగించవచ్చని పరిశోధకులు చెప్పారు.

ఇది నాగరికత- సృజనల అద్భుతమైన కలయికగా అభివర్ణించారు. అసోం ఒక చరిత్రాత్మక విజయాన్ని సాధించినట్లు చెప్పారు. అసోంకు చెందిన స్థానిక లఖిమి జాతికి చెందిన ప్రపంచపు తొలి ఐవీఎఫ్ దూడ స్థానిక జన్మించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ మైలురాయి అసోం పాడి పరిశ్రమకు, పశుసంవర్ధక రంగానికి సరికొత్త ద్వారాలు తెరుస్తుందని సీఎం విశ్వాసం వ్యక్తం చేశారు. స్థానిక జాతుల సంరక్షణ, పశువులలో వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరచడం, పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచడం ద్వారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. ఈ చరిత్రాత్మక విజయానికి తెరవెనుక శ్రమించిన వెటర్నరీ శాస్త్రవేత్తలు, నిపుణులందరికీ అభినందించారు.

దేశీయ పశువుల ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచడం ద్వారా చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం కలిగించే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోందని హిమంత తెలిపారు. ముఖ్యంగా పాడి పరిశ్రమపై ఆధారపడే కుటుంబాలకు అధిక పాల ఉత్పత్తి కలిగిన పశువులు అందుబాటులోకి వస్తే వారి ఆదాయం పెరిగే అవకాశం ఉంటుందని అన్నారు. ‘లఖిమి’ అనేది అసోం ప్రాంతానికి చెందిన స్వదేశీ పశువుల జాతి. ఇవి ఉష్ణమండల, ఉపఉష్ణమండల వాతావరణ వాతవరణాలతో పాటు వేడి ప్రదేశాల్లో జీవించగలుగుతాయి. ఈ జాతి పశువులు సంప్రదాయబద్ధంగా వ్యవసాయ పనులకు, అధిక పోషకాలు ఉన్న పాలు ఇవ్వడానికి ప్రసిద్ధి.