
లండన్: ‘గంగా హారతి’ అనగానే కాశీ, హరిద్వార్, రిషికేశ్ ఘాట్లు గుర్తుకొస్తాయి. శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ ఆధ్యాత్మిక సంప్రదాయం ఇప్పుడు తొలిసారిగా లండన్‌లోని థేమ్స్ నది తీరానికి చేరనుంది. లండన్‌లో వచ్చే నెల 13న థేమ్స్ నది తీరంలో ప్రత్యేకంగా గంగా హారతిని నిర్వహించనున్నారు.
చిన్మయ మిషన్ యూకే, టోటల్లీ థేమ్స్ సంస్థల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. లండన్‌లోని ఓల్డ్ రాయల్ నేవల్ కాలేజ్, గ్రీన్‌విచ్‌లో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వివిధ కార్యక్రమాలు జరగనున్నాయి.
సాయంత్రం 4 గంటలకు కార్యక్రమాలు ప్రారంభమై ప్రత్యక్ష సంగీత, నృత్య ప్రదర్శనలు నిర్వహించనున్నారు. అనంతరం సూర్యాస్తమయ సమయంలో ప్రధాన ఆకర్షణగా గంగా హారతిని నిర్వహిస్తారు. రాయల్ స్టెప్స్ సమీపంలో సాయంత్రం 7.15 గంటలకు హారతి ప్రారంభం కానుంది.
థేమ్స్ పరిశుభ్రతకు ప్రాధాన్యం
గంగా హారతి సందర్భంగా పూలు, విగ్రహాలు లేదా ఇతర పూజా సామగ్రిని థేమ్స్ నదిలో వేయడానికి అనుమతి లేదని నిర్వాహకులు స్పష్టం చేశారు. నదిని పరిశుభ్రంగా, పర్యావరణహితంగా ఉంచుతూ బాధ్యతాయుతంగా వేడుకలో పాల్గొనాలని సందర్శకులకు సూచించారు.
కాశీ, హరిద్వార్, రిషికేశ్ వంటి భారతీయ పుణ్యక్షేత్రాల్లో ప్రసిద్ధి చెందిన గంగా హారతి సంప్రదాయాన్ని లండన్‌లో నిర్వహించడం ద్వారా భారతీయ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని అంతర్జాతీయ వేదికపై పరిచయం చేయనున్నారు.




