
కర్ణాటకలో ప్రభుత్వ ప్రాంగణాలు, ప్రజా ఆస్తుల్లో నిర్వహించే సమావేశాలు, ఊరేగింపులు, వేడుకలు, ఇతర సామూహిక కార్యక్రమాలపై నియంత్రణలు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం ‘కర్ణాటక రెగ్యులేషన్ ఆఫ్ యూజ్ ఆఫ్ గవర్నమెంట్ ప్రిమైసెస్ అండ్ పబ్లిక్ ప్రాపర్టీ బిల్లు–2026’ను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ప్రతిపాదిత బిల్లు అమల్లోకి వస్తే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు, పార్కులు, ఆటస్థలాలు, రహదారులు, నదీ తీరాలు, సరస్సుల పరిసరాలు తదితర ప్రభుత్వ ప్రాంగణాలు, ప్రజా ఆస్తుల్లో కార్యక్రమాలు నిర్వహించేందుకు ముందస్తు అనుమతి అవసరం కానుంది. అయితే ఇది కేవలం మతపరమైన కార్యక్రమాలకే పరిమితం కాకుండా వివిధ రకాల సమావేశాలు, కార్యక్రమాలు, ఊరేగింపులకు వర్తించేలా రూపొందిస్తున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
ఆర్‌ఎస్‌ఎస్‌ను లక్ష్యంగా చేసుకున్నారా?
ప్రతిపాదిత చట్టంపై కర్ణాటకలో రాజకీయ వివాదం మొదలైంది. ప్రభుత్వ ప్రజా ఆస్తులను ఉపయోగించే ఆర్‌ఎస్‌ఎస్ వంటి సంస్థల కార్యకలాపాలను నియంత్రించడమే అసలు లక్ష్యమని బీజేపీ ఆరోపిస్తోంది. ముఖ్యంగా ఆర్‌ఎస్‌ఎస్ నిర్వహించే పథ్ సంచలనాలు, ఇతర బహిరంగ కార్యక్రమాల నేపథ్యంలో ఈ బిల్లు చర్చనీయాంశంగా మారింది.
ముందస్తు అనుమతి తప్పనిసరి
ప్రతిపాదిత నిబంధనల ప్రకారం ప్రభుత్వ ప్రాంగణాలు లేదా ప్రజా ఆస్తుల్లో సమావేశాలు, సభలు, ఊరేగింపులు, వేడుకలు, ఇతర సామూహిక కార్యక్రమాలు నిర్వహించాలంటే సంబంధిత అధికారుల నుంచి ముందస్తు లిఖితపూర్వక అనుమతి పొందాల్సి ఉంటుంది. అనుమతి లేకుండా కార్యక్రమాలు నిర్వహించినా, విధించిన షరతులను ఉల్లంఘించినా శిక్షలు విధించే ప్రతిపాదనలు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
పునరావృత ఉల్లంఘనలకు మరింత కఠినమైన శిక్షలు ఉండేలా ముసాయిదాలో నిబంధనలు ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే తుది బిల్లు, దాని నిబంధనలు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాతే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
రాజకీయంగా వేడెక్కుతున్న అంశం
ప్రజా ఆస్తుల రక్షణ, అనధికార వినియోగాన్ని అరికట్టడం కోసం చట్టం అవసరమని ప్రభుత్వం చెబుతుండగా.. మత, సామాజిక, రాజకీయ సంస్థల బహిరంగ కార్యకలాపాలపై అధిక నియంత్రణలు విధించే ప్రమాదం ఉందని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ముఖ్యంగా ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమాల నేపథ్యంలో ఈ బిల్లు రావడంతో కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజకీయ వివాదం మరింత ముదిరింది. బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన అనంతరం దాని పరిధి, మినహాయింపులు, అనుమతుల విధానం, ఉల్లంఘనలకు సంబంధించిన శిక్షలపై మరింత స్పష్టత రానుంది.





