News

‘వందేమాతరం’పై కాంగ్రెస్ తీరుపై బంకిమ్ వారసుడి ఆవేదన.. సోనియా గాంధీకి లేఖ

37views

కోల్‌కతా: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ‘వందేమాతరం’ గీతం ఆలాపనకు సంబంధించిన పరిణామాలపై బంకిమ్ చంద్ర చట్టోపాధ్యాయ కుటుంబ వారసుడు, పశ్చిమ బెంగాల్‌లోని నైహాటి బీజేపీ ఎమ్మెల్యే సుమిత్రో ఛటర్జీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై దేశ ప్రజలకు, ముఖ్యంగా బెంగాల్ ప్రజలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆమెకు లేఖ రాశారు.

‘చారిత్రక తప్పుకు పునరావృతం’
ఆగస్టు 15న కాంగ్రెస్ కార్యాలయంలో ‘వందేమాతరం’ను పూర్తిగా ఆలపించకుండా అడ్డుకునే ప్రయత్నం జరగడం దురదృష్టకరమని సుమిత్రో ఛటర్జీ పేర్కొన్నారు. ఇది గతంలో కాంగ్రెస్ చేసిన ‘చారిత్రక తప్పుకు సిగ్గుమాలిన పునరావృతం’ అని విమర్శించారు.

‘వందేమాతరం’ ఏ ఒక్క రాజకీయ పార్టీకి చెందినది కాదని.. స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రతో, అమరవీరుల త్యాగాలతో ముడిపడిన జాతీయ ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. ఈ గీతాన్ని పూర్తిగా ఆలపించేందుకు సంకోచించడం స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను అవమానించడమేనని అన్నారు.

‘చరిత్ర ఎవరినీ క్షమించదు’
1937లో మహ్మద్ అలీ జిన్నా అభ్యంతరాలకు తలొగ్గి కాంగ్రెస్ ‘వందేమాతరం’ గీతాన్ని కుదించిందని సుమిత్రో ఛటర్జీ ఆరోపించారు. అప్పటి ద్వంద్వ వైఖరి, రాజీ ధోరణి నీడ ఇప్పటికీ కాంగ్రెస్ వ్యవహారశైలిలో కనిపిస్తోందని విమర్శించారు.

తమ సొంత స్వాతంత్ర్య మంత్రాన్ని గౌరవించడంలో విఫలమయ్యే నాయకత్వం కాలగర్భంలో కలిసిపోతుందని హెచ్చరించారు. ‘చరిత్ర ఎవరినీ క్షమించదు’ అని తన లేఖలో పేర్కొన్నారు.

కాంగ్రెస్ కార్యాలయంలో చోటుచేసుకున్న ఈ పరిణామం బెంగాలీలతో పాటు దేశవ్యాప్తంగా ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని సుమిత్రో ఛటర్జీ అన్నారు. తాను రాజకీయ నేతగా కాకుండా ఒక సాధారణ పౌరుడిగా, దేశభక్తుడిగా ఈ లేఖ రాస్తున్నానని తెలిపారు.

సోనియా గాంధీ ఈ ఘటనపై ఆత్మవిమర్శ చేసుకుని దేశ ప్రజలకు, ముఖ్యంగా బెంగాల్ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.