
దీన్‌దయాళ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యొక్క నిర్వహణ కమిటీ మరియు వార్షిక సర్వసభ్య సమావేశం ఆగస్టు 6–7 తేదీలలో చిత్రకూట్‌లోని దీన్‌దయాళ్ పరిసర్లోని జె.పి. ఆడిటోరియంలో జరిగాయి. ఈ సమావేశానికి వివిధ రంగాలకు చెందిన సామాజిక కార్యకర్తలు, వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన బాధ్యులు పాల్గొన్నారు.
నానాజీ దేశ్ ముఖ్, దీనదయాళ్, భారత మాత చిత్ర పటాలకు పుష్పార్చన చేయడంతో ఈ సమావేశం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆరెస్సెస్ అఖిల భారతీయ కార్యకారిణి సదస్యులు సురేష్ సోనీ, దీనదయాళ్ రీసెర్చ్ సెంటర్ అధ్యక్షుడు పూర్ణేంద్ర సక్సేనా తదితరులు పాల్గొన్నారు.
సర్వసభ్య సమావేశంలో, చిత్రకూట్, గోండా, బీడ్, నాగపూర్, ఢిల్లీలలోని దీన్‌దయాళ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రాజెక్టుల ద్వారా చేపట్టిన కార్యకలాపాలపై ప్రజెంటేషన్లు ఇచ్చారు; అలాగే, గ్రామ స్థాయిలో వ్యక్తులు మరియు సమాజంపై ఆ సంస్థ కృషి చూపిస్తున్న ప్రభావంపై విశ్లేషణ జరిగింది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికల అమలు మరియు వాటి స్థూల ఫలితాలపై చర్చలు జరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కార్యకలాపాల ప్రణాళిక మరియు రూపకల్పనపై కూడా సమగ్ర చర్చలు జరిగాయి.
ఈ సందర్భంగా శ్రీ సురేష్ సోని మాట్లాడుతూ, ఏకాభిప్రాయంతో తీసుకున్న నిర్ణయాలను వంద శాతం చిత్తశుద్ధితో అమలు చేయాలని, అమలు బాధ్యత కలిగిన వారు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని నొక్కి చెప్పారు. నేటి యువతకు చేరువయ్యేలా, భారతదేశపు సనాతన (కాలాతీత) తత్వాన్ని ప్రస్తుత కాలానికి అనుగుణంగా మలచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
మన సమాజం చాలా వైవిధ్యభరితమైనదని, అయినప్పటికీ మనం దానిలో పరస్పర ఆధారిత స్ఫూర్తిని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.. ప్రతి ఒక్కరూ ప్రకృతితో సామరస్యంగా జీవించాలి; మన చర్యలు మరియు కార్యకలాపాలు ఆచరణాత్మకంగా, సముచితంగా ఉండి, సమాజానికి సానుకూల ఫలితాలను అందించాలని సూచించారు. స్థానిక వనరులను ఉత్తమంగా ఉపయోగించుకోవడం ద్వారా ప్రతి ఒక్కరూ స్వయం సమృద్ధి, స్వాతంత్ర్యం సాధించేలా మనం చూడాలి, అదే సమయంలో మన ప్రయత్నాలలో నిరంతర ఆవిష్కరణలను కూడా చేర్చుతూ వుండాలన్నారు.
గ్రామ కమిటీల శిక్షణ కోసం ఓ శిక్షణా విధానం వుండాలని సూచించారు. ఆ సభ్యులలో బాధ్యతా భావాన్ని మరింత పెంపొందించాలని, దీని ద్వారా వారికి నిర్దిష్టమైన విధులను అప్పగించాలని సురేష్ సోనీ సూచించారు. అన్ని ప్రాజెక్టుల కోసం సమీప గ్రామాలను గుర్తించి, కార్యకర్తలను అన్ని రకాల శిక్షణను అందించాలన్నారు. ఇలా చేయడం ద్వారా గ్రామాలు స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేస్తాయన్నారు.
గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన స్వరూప, స్వభావాలను కాపాడుకుంటూనే, పట్టణ తరహా మౌలిక సదుపాయాలను కూడా కలిపించవచ్చన్నారు. ఈ మోడల్ ద్వారా గ్రామాలను అభివృద్ధి చేసుకోవచ్చని అన్నారు. అలాగే దీనదయాళ్ రీసెర్చి సంస్థ కార్యకలాపాలను మరిన్ని గ్రామాలకు కూడా విస్తరించాలని సూచించారు. సమాజంలోని అన్ని వర్గాల సహకారం, భాగస్వామ్యంతో సంస్థ పనితీరును మరింత విస్తరించుకోవాలని సూచించారు.





