
భోపాల్: వివాహ బంధాన్ని రద్దు చేసే అధికారం ఏ మతపరమైన సంస్థ, కమిటీ లేదా సెమినరీకి లేదని మధ్యప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. కేవలం మసీదు కమిటీ జారీ చేసిన ఫత్వా ఆధారంగా వివాహం రద్దయినట్లు పరిగణించలేమని తేల్చిచెప్పింది. చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించి, రాజ్యాంగబద్ధమైన ఫ్యామిలీ కోర్టు ద్వారానే విడాకులు పొందాలని న్యాయస్థానం పేర్కొంది.
జస్టిస్ వివేక్ జైన్ ధర్మాసనం ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. భోపాల్‌కు చెందిన ‘దారుల్-దఫా మసాజిద్ కమిటీ’ జారీ చేసిన ఫత్వా ఆధారంగా తన వివాహ బంధం రద్దయిందని ప్రకటించాలని కోరిన ఓ భర్త దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం తిరస్కరించింది.
ఫత్వాకు స్వతంత్రంగా చట్టపరమైన గుర్తింపు లేదని, అది న్యాయస్థానం తీర్పుకు ప్రత్యామ్నాయం కాదని కోర్టు స్పష్టం చేసింది. వివాహ రద్దు వంటి పౌర హక్కులకు సంబంధించిన అంశాల్లో తుది నిర్ణయం తీసుకునే అధికారం రాజ్యాంగబద్ధమైన కోర్టులకే ఉంటుందని వెల్లడించింది.
అలాగే, విడాకులు కోరే వ్యక్తి సంబంధిత ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించి చట్ట ప్రకారం పిటిషన్ దాఖలు చేసుకునే పూర్తి హక్కు ఉందని హైకోర్టు పేర్కొంది. అలాంటి పిటిషన్‌ను సంబంధిత న్యాయస్థానం అమలులో ఉన్న చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా విచారించి నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేసింది.
మతపరమైన అభిప్రాయాలు లేదా ఫత్వాలు వ్యక్తిగత విశ్వాసాలకు సంబంధించినవే తప్ప, వాటికి స్వయంగా చట్టబద్ధమైన అమలు శక్తి ఉండదని ఈ తీర్పు మరోసారి స్పష్టం చేసింది. వివాహ రద్దు వంటి అంశాలు రాజ్యాంగం, దేశ చట్టాల పరిధిలోనే పరిష్కారం కావాలని మధ్యప్రదేశ్ హైకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.





