
హైదరాబాద్: మదర్సాల్లో జాతీయ గీతం ‘జనగణమన’, జాతీయ గేయం ‘వందేమాతరం’ ఆలపించడాన్ని తప్పనిసరి చేయాలని బీజేపీ నాయకురాలు మాధవీలత డిమాండ్ చేశారు. విద్యార్థుల్లో దేశభక్తి భావన పెంపొందించడంతో పాటు, ఆధునిక విద్యకు ప్రాధాన్యం కల్పించేలా ఆంగ్ల విద్యను కూడా మదర్సాల్లో ప్రవేశపెట్టాలని ఆమె సూచించారు.
హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన మాధవీలత మాట్లాడుతూ.. మదర్సాల్లో చదువుతున్న విద్యార్థులను ఆధునిక ప్రపంచానికి అనుగుణంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. వారికి ఆంగ్ల విద్యతో పాటు దేశ చరిత్ర, రాజ్యాంగ విలువలు, జాతీయ చైతన్యాన్ని పెంపొందించే అంశాలను బోధించాలని అభిప్రాయపడ్డారు.
“మదర్సాల్లో వందేమాతరం, జనగణమన ఆలపించడం తప్పనిసరి కావాలి. విద్యార్థులు గర్వంగా ‘భారత్ మాతాకీ జై’ అని నినదించేలా దేశభక్తి భావనను పెంపొందించాలి. వారిని బాహ్య ప్రపంచంతో అనుసంధానం చేసి, సమగ్ర విద్యను అందించడం అవసరం” అని ఆమె పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో వందేమాతరం ప్రాధాన్యంపై చర్చ జరుగుతున్న తరుణంలో మాధవీలత చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇదిలా ఉండగా, ఇటీవల పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం గుర్తింపు పొందిన మదర్సాల్లో వందేమాతరం ఆలపించడాన్ని తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, ఆ నిర్ణయాన్ని కొందరు కలకత్తా హైకోర్టులో సవాలు చేశారు.
జాతీయ చిహ్నాలు, దేశభక్తి విలువలు అన్ని విద్యాసంస్థల్లో సమానంగా ప్రోత్సహించబడాలని మాధవీలత ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.





