News

శాశ్వత ద్వేషం దీనికి పరిష్కారం కాదు : మోహన్ భాగవత్

34views
ముంబై : ముంబైలోని ‘ఇండియాస్ ఇంటర్నేషనల్ మూవ్‌మెంట్ టు యునైట్ నేషన్స్’ (I.I.M.U.N.) 15వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆరెస్సెస్ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2,000 మంది జెన్ జీ విద్యార్థులతో ఆయన సంభాషించారు. చైనా, పాక్ తో భారత్ ఎలాంటి సంబంధాలను నెరపాలి? అన్న అంశంపై మాట్లాడారు.
పాక్, చైనాతో భారత్ సరిహద్దులను పంచుకుంటోంది. ఈ రెండు దేశాలతో భారత్ తరచుగా సైనిక మరియు దౌత్యపరమైన ఉద్రిక్తతలను ఎదుర్కొంటూ వచ్చింది. ఇలాంటి ఘర్షణల సమయంలో, ఆ దేశాలతో అన్ని రకాల సంబంధాలను నిలిపివేయాలని చాలామంది డిమాండ్ చేస్తుంటారు. రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, పాకిస్థాన్ చైనాతో పౌరుల మధ్య, విద్యార్థుల మధ్య సంబంధాలు కొనసాగాలా లేక వాటిని నిలిపివేయాలా? ఇటువంటి సంబంధాల విషయంలో భారత్ ఎలాంటి విధానాన్ని అనుసరించాలి?
సమాధానం : సంఘర్షణ సమయాల్లో, మన ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు మనం కట్టుబడి ఉండాల్సిందే. కానీ, ఆ కారణంతో ఇప్పటికే ఉన్న బంధాలు తెగిపోకూడదు.మీరు పాకిస్తాన్, చైనా అనే రెండు ఉదాహరణలు ఇచ్చారు. తమ మధ్య 2,000 ఏళ్లుగా సంబంధాలు ఉన్నాయని చైనీయులే చెబుతారు. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. ఈ బంధాలను తెంచుకోలేము. సంఘర్షణ కొనసాగుతున్నంత కాలం వాటిని తాత్కాలికంగా నిలిపివేయవచ్చు. కానీ పరిష్కారం ఏమిటి? ఇతరులను జయించడం లేదా నాశనం చేయడం భారతీయ పరిష్కారం కాదు. అది సామరస్యపూర్వకమైన, సమ్మిళిత ప్రక్రియను సృష్టించడం. దానికి విలువలు అవసరం.
కాబట్టి, విభేదాలు ఈ సంబంధాలను తాత్కాలికంగా నిలిపివేయవచ్చు, కానీ అవి శాశ్వతంగా ఆగిపోకూడదు; అలా జరగకూడదు కూడా. విభేదాలు సమసిపోయిన తర్వాత, మనం ఎక్కడైతే ఆపామో అక్కడి నుండే మళ్లీ కొనసాగించాలి. మనం ముందుకు సాగాలి. శాశ్వత శత్రుత్వం లేదా శాశ్వత ద్వేషం దీనికి పరిష్కారం కాదు.
ఎక్కడైతే సమస్య వుంటుందో దానిని పరిష్కరించుకోవాల్సి వుంటుంది. దానికో పద్ధతి కూడా వుంటుంది. మనం ఆ మార్గాన్నే అనుసరించాలి. కానీ అది తాత్కాలికమైన విషయం; అది రాజకీయాలకు సంబంధించిన అంశం. పాకిస్థాన్ ప్రజలు తమ అంతరాత్మలో భారతీయులకు శత్రువులుగా ఉన్నారని అర్థం కాదు. అది నిజం కాదు. భారతీయులు అటువంటివారు కారు.భారతీయుల స్వభావమే అది కాదు.అయితే, దేశాలు, రాజకీయాలు మరియు అంతర్జాతీయ సరిహద్దులు కూడా ఉన్నాయి. ఇది వాస్తవం. కాబట్టి సంఘర్షణ సమయంలో మనం మన పక్షం వైపే నిలబడతాం. కానీ, ఏదో ఒక రోజు ఆ సంఘర్షణ ముగిసి, చివరికి ఐక్యత ఏర్పడాలని మనకు తెలుసు. మానవాళి ఒక్కటే.
సంఘర్షణ సమయాల్లో మాత్రం కాదు అని నేను మీకు చెబుతున్నాను. సంఘర్షణ అంటే సైనిక యుద్ధం కావచ్చు లేదా ఉగ్రవాదం కూడా కావచ్చు; ఉగ్రవాదం అనేది కూడా ఒక రకమైన సంఘర్షణే. ఈ ఉగ్రవాదం కేవలం తీవ్రవాద వర్గాల చర్యలకు మాత్రమే పరిమితం కాదు, ఇది ఒక సమగ్రమైన సిద్ధాంతం. పైగా,a thousand cuts అనే విధానం కూడా ఉంది; అంటే ఇది ఒక రహ్యమైన వ్యూహం. కాబట్టి, మనం దీనిని తదనుగుణంగానే ఎదుర్కోవాల్సి ఉంటుంది.’’ అని మోహన్ భాగవత్ అన్నారు.