News

సీలేరు అటవీ ప్రాంతాల్లో డ్రోన్‌తో 20 వేల విత్తన బంతుల వెదజల్లింపు

6views

అంతరించిపోతున్న అడవులను పునరుద్ధరించి పచ్చదనాన్ని పెంపొందించేందుకు విత్తన బంతుల (సీడ్ బాల్స్) వెదజల్లడం సమర్థవంతమైన చర్య అని అల్లూరి సీతారామరాజు జిల్లా  సీలేరు రేంజ్ అధికారి ఎస్. వెంకటరావు తెలిపారు. సీలేరు అటవీ పరిధిలోని పలు ప్రాంతాల్లో  రం డ్రోన్ సాయంతో 20 వేల విత్తన బంతులను వెదజల్లినట్లు వెల్లడించారు.

ధర్మాపురం, నిమ్మలగొంది, తొకరాయి, బంధవీధి, కొమ్ములువాడ పరిసర అటవీ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. జాఫ్రా, చింత, నేరేడు, రావి, మర్రి, కానుగ, తురకవేప తదితర వృక్షాల విత్తనాలతో మొత్తం 1.20 లక్షల విత్తన బంతులను తయారు చేసి అటవీ ప్రాంతాల్లో వెదజల్లాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు చెప్పారు.

ఇప్పటికే జూలై నెలలో అటవీ శాఖ సిబ్బంది, స్థానిక ప్రజల సహకారంతో వివిధ అటవీ ప్రాంతాలు, రైతుల పొలాల్లో లక్ష విత్తన బంతులను విజయవంతంగా వెదజల్లినట్లు వెంకటరావు తెలిపారు. మిగిలిన 20 వేల విత్తన బంతులను చేరుకోవడం కష్టమైన అటవీ ప్రాంతాల్లో డ్రోన్ సాంకేతికత ద్వారా వెదజల్లినట్లు వివరించారు.

ఈ కార్యక్రమంలో ట్రైనీ రేంజ్ అధికారి మణికృష్ణ, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఎం. రమణమ్మ, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కె. సతీష్‌తో పాటు అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.