News

బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం-2026 ముగింపు ‘హైదరాబాద్ డిక్లరేషన్’కు ఏకగ్రీవ ఆమోదం

8views

హైదరాబాద్: భారతదేశం బ్రిక్స్ అధ్యక్షతన భారతీయ మజ్దూర్ సంఘ్ (BMS) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన 15వ బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం (BTUF) సమ్మిట్–2026 విజయవంతంగా ముగిసింది. సదస్సు ముగింపు సందర్భంగా కార్మిక సంక్షేమం, సామాజిక భద్రత, సమ్మిళిత అభివృద్ధి, సామాజిక సంభాషణ, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలకు ప్రాధాన్యం ఇస్తూ రూపొందించిన ‘హైదరాబాద్ డిక్లరేషన్’ను సభ్య దేశాల ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదించారు.

ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా మాట్లాడుతూ, ప్రభుత్వం, యాజమాన్యం, కార్మికులు పరస్పర విశ్వాసం, సంభాషణ, సహకారంతో ముందుకు సాగినప్పుడే పారిశ్రామిక కుటుంబ భావన సాకారమవుతుందని పేర్కొన్నారు. సాంకేతికత మానవాళి సంక్షేమానికి ఉపయోగపడాలని, అసమానతలు పెంచకుండా గౌరవప్రదమైన ఉపాధి అవకాశాలను సృష్టించే దిశగా అడుగులు వేయాలని ఆయన సూచించారు.

సదస్సులో సార్వత్రిక సామాజిక భద్రత, మహిళా కార్మిక సాధికారత, స్కిల్లింగ్–రీ-స్కిల్లింగ్–అప్-స్కిల్లింగ్, మానవ కేంద్రిత కృత్రిమ మేధస్సు (AI), శ్రమ భవిష్యత్తు వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు.

భారతీయ మజ్దూర్ సంఘ్ జాతీయ అధ్యక్షుడు ఎస్. మల్లేశం మాట్లాడుతూ, హైదరాబాద్ డిక్లరేషన్ కార్మిక సంక్షేమం, సామాజిక న్యాయం, స్థిరమైన అభివృద్ధి, గౌరవప్రదమైన ఉపాధి పట్ల బ్రిక్స్ దేశాల ఉమ్మడి సంకల్పానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు.

బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా తదితర బ్రిక్స్ దేశాల ప్రతినిధులు భారతదేశం సమర్థవంతంగా నిర్వహించిన ఈ సదస్సును అభినందించారు. కార్మికుల హక్కుల పరిరక్షణ, సామాజిక భద్రత, పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు కలిసి పనిచేయాలని అభిప్రాయపడ్డారు.

హైదరాబాద్ డిక్లరేషన్ ప్రపంచవ్యాప్తంగా కార్మిక సంక్షేమం, సామాజిక న్యాయం, మానవ కేంద్రిత సాంకేతిక అభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తుందని ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు.