
పండరీపూర్: భక్తి పారవశ్యంతో సాగే ఆషాఢీ వారీ సందర్భంగా పండరీపూర్‌లోని శ్రీ విఠోబా రుక్మిణీ దర్శనం కోసం లక్షలాది మంది వార్కరీలు తరలిరానున్న నేపథ్యంలో మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల మతపరమైన మనోభావాలను గౌరవిస్తూ పండరీపూర్ పట్టణం, పరిసర ప్రాంతాల్లో ఈ నెల 29 వరకు మాంసం విక్రయాలపై నిషేధం విధించింది.
సోలాపూర్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి జయకుమార్ గోరే సూచనల మేరకు జిల్లా కలెక్టర్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఆషాఢీ వారీ సమయంలో మహారాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు పాదయాత్రగా పండరీపూర్‌కు చేరుకుంటారని, ఈ పవిత్ర సమయంలో మాంసం విక్రయాలు భక్తుల మనోభావాలను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించి మాంసం లేదా మటన్ విక్రయాలు కొనసాగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఈ నిర్ణయాన్ని వార్కరీ సంఘాలు స్వాగతించాయి.
గజానన్ మహారాజ్ పల్లకీ యాత్రకు భారీ ఏర్పాట్లు
శ్రీ క్షేత్ర షేగావ్ నుంచి పండరీపూర్‌కు బయలుదేరిన శ్రీ గజానన్ మహారాజ్ పల్లకీ యాత్ర ఈ నెల 18న సోలాపూర్‌కు చేరుకోనుంది. పల్లకీతో పాటు వేలాది మంది వార్కరీలు రెండు రోజుల పాటు నగరంలో బస చేయనున్న నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు.
సోలాపూర్ మేయర్ వినాయక కొండ్యాల్ ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పల్లకీ మార్గాలను పరిశీలించారు. రూప భవాని చౌక్, తుల్జాపూర్ వేస్, కస్తూర్బా మార్కెట్, సామ్రాట్ చౌక్, శ్రీ సద్గురు ప్రభాకర్ స్వామి మహారాజ్ మందిర్, బాలివేస్ టెలిఫోన్ భవన్, కుంబార్ వేస్, కౌంతం చౌక్, కన్నా చౌక్ తదితర ప్రాంతాల్లో ఏర్పాట్లను సమీక్షించారు.
వార్కరీలు బస చేసే ఉపలపు కళ్యాణ మండపం, అక్కడి నుంచి పల్లకీ వెళ్లే మోదీ రైల్వే బ్రిడ్జి, ధమాని నగర్ మార్గాల్లో కూడా సన్నాహాలను పరిశీలించారు.
వార్కరీలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మేయర్ అధికారులను ఆదేశించారు. పల్లకీ మార్గాల్లో అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించడం, రోడ్లపై గుంతలను పూడ్చడం, పరిశుభ్రతను మెరుగుపరచడం వంటి చర్యలు వేగంగా పూర్తి చేయాలని సూచించారు.
మున్సిపల్ కమిషనర్ డాక్టర్ సచిన్ ఓంబాసే మాట్లాడుతూ, పల్లకీ మార్గాల్లో పారిశుధ్యం, తాగునీటి సరఫరా, ఆరోగ్య సేవలు, అగ్నిమాపక, అత్యవసర విభాగాలను సిద్ధంగా ఉంచాలని అధికారులకు సూచించారు.
భగవంతుడు విఠోబా దర్శనం కోసం సాగించే ఈ పవిత్ర యాత్రలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పండరీపూర్ క్షేత్రంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడంపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది.





