News

బలూచిస్థాన్‌ను స్వతంత్ర దేశంగా సొంత కరెన్సీని ప్రకటించిన ఉద్యమకారులు

33views

పాకిస్థాన్‌ నుంచి వేరుపడాలని దశాబ్దాలుగా డిమాండ్‌ చేస్తున్న బలూచ్‌ జాతీయవాద ఉద్యమకారులు తాజాగా బలూచిస్థాన్‌ను ‘రిపబ్లిక్‌ ఆఫ్‌ బలూచిస్థాన్‌’గా ప్రకటిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేశారు. తమ భూభాగాన్ని స్వతంత్ర దేశంగా అంతర్జాతీయ సమాజం గుర్తించాలని వారు విజ్ఞప్తి చేశారు.

ఉద్యమకారులు విడుదల చేసిన ప్రకటనలో, బలూచిస్థాన్‌లో 85 శాతం భూభాగం తమ నియంత్రణలో ఉందని పేర్కొన్నారు. అలాగే ‘మా చుకైన్‌ బలోచని’ పేరుతో జాతీయ గీతాన్ని, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించినట్లు, దేశ కరెన్సీగా ‘బలోచి ఫాల్స్‌’ను నిర్ణయించినట్లు తెలిపారు.

తమ ఆధీనంలోని ప్రాంతాల్లోని బంగారం, రాగి గనులు, 150కు పైగా సహజవాయు క్షేత్రాలు, సుమారు 1,200 బొగ్గు గనులపై తమ నియంత్రణ కొనసాగుతోందని ఉద్యమకారులు ప్రకటించారు. భారీ యుద్ధ విమానాలు, ట్యాంకులు, క్షిపణులు లేకపోయినా, సుమారు 5 లక్షల మంది సభ్యులతో కూడిన సైనిక బలగాల సహాయంతో ఈ ఏడాది చివరి నాటికి తమ ప్రాంతం నుంచి పాకిస్థాన్‌ దళాలను వెళ్లగొట్టగలమని వారు తమ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఈ వాదనలను స్వతంత్ర వర్గాలు ధ్రువీకరించలేదు.

భౌగోళికంగా బలూచిస్థాన్‌ పాకిస్థాన్‌లో అతిపెద్ద ప్రావిన్స్‌. దేశ భూభాగంలో సుమారు 44 శాతం ఈ ప్రాంత పరిధిలోనే ఉంది. ఇరాన్‌, ఆఫ్ఘానిస్థాన్‌లతో సరిహద్దులు పంచుకుంటున్న ఈ ప్రాంతం వ్యూహాత్మకంగా కీలకమైనది. బంగారం, రాగి, సహజవాయువు వంటి ఖనిజ సంపద సమృద్ధిగా ఉన్నప్పటికీ, అభివృద్ధి ఫలాలు తమకు అందడం లేదని స్థానికులు చాలా కాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

చారిత్రకంగా, 1947లో భారత విభజన సమయంలో కలాత్‌ ఖానేట్‌ పేరుతో ప్రత్యేక రాజ్యం ఉండేది. అనంతరం 1948లో ఆ ప్రాంతాన్ని పాకిస్థాన్‌లో విలీనం చేయడంతో అప్పటి నుంచి బలూచ్‌ జాతీయవాద ఉద్యమాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం వెలువడిన ఈ ప్రకటనపై పాకిస్థాన్‌ ప్రభుత్వం అధికారికంగా స్పందించాల్సి ఉంది.