News

సుశ్రుతుని వైద్య వారసత్వాన్ని ప్రపంచానికి చాటిన ‘సౌశ్రుతం 2026’

7views

న్యూఢిల్లీ: శస్త్రచికిత్స పితామహుడిగా గుర్తింపు పొందిన ఆచార్య సుశ్రుతుని అపార వైద్య వారసత్వాన్ని ప్రపంచానికి మరింత చేరువ చేసే లక్ష్యంతో నిర్వహిస్తున్న మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు ‘సౌశ్రుతం 2026’ బుధవారం న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (AIIA)లో ప్రారంభమైంది. సుశ్రుత జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సదస్సును ప్రారంభించడంతో పాటు సంస్థలోని ఎంఆర్ఐ విభాగాన్ని కూడా ప్రారంభించారు.

ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, శతాబ్దాల క్రితమే శస్త్రచికిత్స రంగంలో ఆచార్య సుశ్రుతుడు అందించిన మార్గదర్శకత్వం వైద్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందని పేర్కొన్నారు. ప్లాస్టిక్ సర్జరీ, కంటి శుక్లాల శస్త్రచికిత్స, కణితుల చికిత్స, ఈఎన్టీ శస్త్రచికిత్స వంటి అనేక రంగాల్లో ఆయన ప్రవేశపెట్టిన విధానాలు ఆధునిక వైద్యశాస్త్రానికే పునాది వేశాయని అన్నారు.

‘సుశ్రుత సంహిత’ భారతీయ వైద్య సంప్రదాయానికి మాత్రమే కాకుండా ప్రపంచ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల అభివృద్ధికీ విశేషంగా దోహదపడిందని రాష్ట్రపతి తెలిపారు. శస్త్రచికిత్సలో నైపుణ్యంతో పాటు వైద్య నైతికత, రోగుల పట్ల కరుణ, శాస్త్రీయ దృక్పథాన్ని సుశ్రుతుడు సమన్వయం చేశారని ఆమె పేర్కొన్నారు.

ఆయుర్వేదం సమగ్ర ఆరోగ్య సంరక్షణకు ప్రతీక అని పేర్కొన్న రాష్ట్రపతి, ఈ ప్రాచీన జ్ఞానాన్ని ఆధునిక శాస్త్రీయ పరిశోధనలు, డిజిటల్ హెల్త్ సాంకేతికతలతో అనుసంధానించి ప్రపంచవ్యాప్తంగా మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. శాస్త్రీయ ఆధారాలు, ప్రామాణిక డాక్యుమెంటేషన్ ద్వారా ఆయుర్వేదానికి అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

యువ వైద్య విద్యార్థులు, పరిశోధకులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, ఆచార్య సుశ్రుతుని స్ఫూర్తిగా తీసుకుని వినూత్న పరిశోధనలు చేపట్టాలని, నాణ్యమైన శాస్త్రీయ ఆధారాలను రూపొందించాలని, అవసరమైన చోట ఆధునిక సాంకేతికతను స్వీకరించాలని సూచించారు. అదే సమయంలో వైద్య వృత్తిలో నైతిక విలువలు, సేవాభావం, కరుణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.