మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లు, మొబైల్ యాప్స్, సోషల్ మీడియా ద్వారా జీవిత భాగస్వామిని వెతుక్కోవడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. కానీ బిహార్‌లోని మిథిలాంచల్ ప్రాంతంలో మాత్రం దాదాపు 700 ఏళ్లుగా కొనసాగుతున్న ఓ ప్రత్యేక వివాహ సంప్రదాయం ఇప్పటికీ సజీవంగా ఉంది. ఇక్కడ వరుడు, వధువు కుటుంబాలు ఒకేచోట నేరుగా సమావేశమై సంబంధాలు మాట్లాడుకుంటాయి. అయితే అందం, ఆస్తి, ఉద్యోగం కంటే కుటుంబ వంశ వృక్షానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఇరు కుటుంబాల పూర్వీకుల వివరాల్ని పరిశీలించి రక్తసంబంధం లేదని నిర్ధరించిన తర్వాతే వివాహానికి సామాజిక ఆమోదం లభిస్తుంది. ఈ ప్రత్యేక సంప్రదాయమే ‘సౌరత్ సభ’. దీని ప్రత్యేకతల్ని ఈటీవీ భారత్ ప్రతినిధి రాజ్ కుమార్ ఝా వివరించారు.
బిహార్ మధుబనీ జిల్లా రహికా బ్లాక్ గచ్చి గ్రామం సమీపంలోని 22 బీఘాల తోటలో ప్రతి ఏడాది ఈ సభ నిర్వహిస్తారు. హిందూ పంచాంగంలోని జ్యేష్ఠ, ఆషాఢ మాసాల్లో 11 రోజుల పాటు సాగే ఈ సమావేశానికి మైథిల్ బ్రాహ్మణులు, కర్ణ కాయస్థ కుటుంబాలు పెద్ద సంఖ్యలో హాజరవుతాయి. ఈ ఏడాది జులై 2 నుంచి 12 వరకు ఈ సభ నిర్వహించారు.
స్వయం వరాన్ని తలపించే విధానం
సౌరత్ సభలో పెళ్లికి సిద్ధంగా ఉన్న వరులు సంప్రదాయ దుస్తుల్లో సభకు వస్తారు. వధువు కుటుంబ సభ్యులు వారిని కలిసి మాట్లాడి, నచ్చిన వరుడిని ఎంపిక చేస్తారు. అక్కడితో అయిపోలేదు. అంటే సంబంధం వెంటనే ఖరారైనట్లు కాదు. తర్వాత పంజీకార్‌లుగా పిలిచే వంశవృక్ష నిపుణులు ఇరు కుటుంబాల వంశపారంపర్య రికార్డుల్ని పరిశీలిస్తారు. కనీసం 7 తరాల వరకు ఎలాంటి రక్త సంబంధం లేదని నిర్ధరించిన తర్వాతే వివాహానికి అనుమతి ఇస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఆ వివాహానికి సమాజంలో అధికారిక గుర్తింపు లభిస్తుంది.

సభకు ప్రాణం- పంజీ వ్యవస్థ
సౌరత్ సభ ప్రత్యేకత అంతా పంజీ వ్యవస్థలోనే దాగి ఉంది. శతాబ్దాలుగా కుటుంబాల వంశ వృక్షాల్ని నమోదు చేస్తూ వస్తున్న పంజీకార్లు ప్రతి కుటుంబానికి సంబంధించిన రికార్డుల్ని భద్రపరుస్తున్నారు. కోర్టు వివాహానికి మేజిస్ట్రేట్ ఆమోదం ఎంత ముఖ్యమో, సౌరత్ సభలో జరిగే వివాహానికి పంజీకార్ అనుమతి కూడా అంతే కీలకంగా భావిస్తారు. పంజీకార్ ప్రమోద్ మిశ్రా వివరాల ప్రకారం, ఈ పంజీ వ్యవస్థను 1310 AD లో లిఖిత పూర్వకంగా నమోదు చేశారు. అనంతరం 1735లో ఖండ్వాల రాజవంశానికి చెందిన రాజా రాఘవ సింగ్ మిథిలాంచల్ ప్రాంతంలో సుమారు 12 సౌరత్ సభల్ని ఏర్పాటు చేశారు. వాటి మధ్య కనీసం 40 కిలోమీటర్లు ఉండేలా ప్రణాళిక రూపొందించారు.

పెళ్లిళ్లకే కాదు విజ్ఞాన వేదిక కూడా
ఒకప్పుడు సౌరత్ సభ కేవలం వివాహ సంబంధాలు కుదిర్చే వేదిక మాత్రమే కాదు. పండితుల మధ్య శాస్త్ర చర్చలు, సామాజిక అంశాలపై చర్చలు కూడా ఇక్కడే జరిగేవి. వరుల విద్య, వ్యక్తిత్వం, సంస్కారం, కుటుంబ నేపథ్యాన్ని కూడా ఈ సభలోనే అంచనా వేసేవారు. స్థానికుల కథనం ప్రకారం- వైద్యులు, ఇంజినీర్లు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సహా అనేక మంది ప్రముఖుల వివాహాలు కూడా ఈ సంప్రదాయం ద్వారానే జరిగాయి.
కాలం మారడంతో ఈ సంప్రదాయం కూడా క్రమంగా ప్రభావం కోల్పోతోంది. ఒకప్పుడు లక్షలాది మంది హాజరయ్యే ఈ సభకు ఇప్పుడు అంతగా స్పందన కనిపించడం లేదు. స్థానికుల వివరాల ప్రకారం 1971లో సుమారు 1.5 లక్షల మంది, 1991లో సుమారు 50 వేల మంది ఈ సభకు హాజరయ్యారు. ప్రస్తుతం వలసలు, ఆధునిక జీవన శైలి, ఆన్‌లైన్ మ్యాట్రిమోనీ వేదికల ప్రభావంతో పాల్గొనే వారి సంఖ్య తగ్గుతోంది. అయితే ఈ ఏడాది జరిగిన సభలో కూడా సుమారు 80 వివాహ ఒప్పందాలు నమోదయ్యాయి. మరో 100కుపైగా కుటుంబాలు వరుడు- వధువు వివరాల కోసం సభను సందర్శించాయి. మిథిలాంచల్ ప్రాంతంలో ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే వివాహానికి ఆమోదం లభించడం ఈ సంప్రదాయం ప్రత్యేకత. స్థానిక పండితులు, పంజీకార్లు సౌరత్ సభను కేవలం పెళ్లిళ్ల వేదికగానే కాకుండా మిథిలా సంస్కృతికి ప్రతీకగా అభివర్ణిస్తున్నారు. శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయాన్ని భావితరాలకు పరిచయం చేసి పరిరక్షించాల్సిన అవసరం ఉందని వారు సూచిస్తున్నారు.




