ArticlesNews

సత్లెజ్ చిత్రం భావ ప్రకటనా స్వేచ్ఛకి నిదర్శనమా?

26views

– ప్రదక్షిణ

హిందీ సినిమా సత్లెజ్ గురించిన వివాదం ముదురుతోంది. ఇది ఖలిస్థానీ సానుభూతిపరుడు, మానవ హక్కుల కార్యకర్త కూడా అయిన జస్వంత్ సింగ్ ఖల్రా జీవితం మీద రూపొందించిన చిత్రం. ప్రఖ్యాత నటుడు దిల్జిత్ దోసంజ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని, ప్రముఖ నిర్మాత రాన్నీ స్క్రూవాలా, దిల్జీత్ దోసంజ్, అభిషేక్ చౌబే నిర్మించగా, హానీ ట్రెహాన్ దర్శకత్వం వహించారు.

మూడు సంవత్సరాల క్రితం “పంజాబ్ 95′ పేరుతో ఇదే సినిమాని సెన్సార్ కి పంపగా, సెన్సార్ బోర్డు వారు, ఈ వివాదాస్పద చిత్రానికి 100కి పైగా కట్స్ సూచించారు. అయితే దర్శక నిర్మాతలు ఆ పని చేయకుండా, సత్లెజ్ అని పేరు మార్చి, జీ 5 OTT ప్లాట్ఫామ్ లో 3 జులై 2026 తేదీన విడుదల చేసారు ( OTT ప్లాట్ఫామ్ కి సెన్సార్ సర్టిఫికేషన్ అవసరం లేదు). కేవలం రెండు రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులతో, ఈ సినిమాని OTT నుంచి తొలగించారు. ఐటీ చట్టం 2000, 69A సెక్షన్ కింద; రూల్ 16, ఐటి రూల్స్ 2021 కింద దీన్ని తొలగించమని ఆదేశించారు. అయితే భారతదేశంలో OTTలో లేకపోయినా ప్రపంచమంతా ఈ సినిమా అందుబాటులో ఉంది. అలాగే యూట్యూబ్ లో కూడా భారతదేశంతో అంతటా అందుబాటులో ఉంది.

ఈలోపు అమెరికా పౌరుడైన దిల్జీత్ దోసంజ్ ఈ సినిమాని అందరూ డౌన్లోడ్ చేసుకుని చూడాలని ప్రకటన చేశాడు. అయితే అసలు వివాదం ఎందుకు మొదలైంది?

ఈ సినిమా పూర్తిగా ఏకపక్షంగా ఉందని విమర్శకుల అభిప్రాయం. 1980 – 90లలో ముఖ్యంగా పంజాబ్, ఢిల్లీలలో చెలరేగిన ఖలిస్థానీ వేర్పాటువాదుల ఉగ్రవాదంలో వేలాదిమంది ప్రజలు హత్య చేయబడ్డారు. ముఖ్యంగా హిందువులను, వాళ్ళు హిందువులు కాబట్టి ఏరి ఏరి చంపేశారు. ఆ భయంకరమైన విపత్కర పరిస్థితుల్లో పంజాబ్ ముఖ్యమంత్రి శ్రీ బీయాంత్ సింగ్ ( తరువాత కాలంలో ఈయనని హత్య చేశారు), పంజాబ్ రాష్ట్ర డీజీపీ శ్రీ కేపీఎస్ గిల్ లు చూపించిన తెగువ, ధైర్యం మరపురానిది, భారత జాతి మరచిపోకూడనిది. వారు ఒక దశాబ్ద కాలంలో, పోలీసు సిబ్బందితో ఉగ్రవాదాన్ని ఎదుర్కొని పంజాబ్ నుంచి సాయుధ ఉగ్రవాదాన్ని పూర్తిగా పెకిలించివేశారు. అధికారిక అంకెల ప్రకారం 11690 మంది అమాయక ప్రజలు బలి అయితే, 1740 మంది సాయుధ పోలీసులు అమరులయ్యారు. ( వాస్తవంగా ఈ సంఖ్య ఎన్నో రెట్లు ఎక్కువ). వేలాది పోలీసుల కుటుంబాలని ఉగ్రవాదులు చిత్రహింసలు పెట్టి హత్యలు చేసారు. ఖలిస్థానీ ఉగ్రవాదులు చేసిన మారణకాండ గురించి ఈ సినిమా ఏమీ మాట్లాడదు.

ఇదే కాలంలో పోలీసులు చూపిన అతి దౌర్జన్యం, కక్షపూరిత చర్యల వల్ల, వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారని పోలీసుల మీద ఆరోపణ చేయబడింది. ఆ కల్లోల కాలంలో జరిగిన హింస, మారణకాండలో, పోలీసుల దౌర్జన్యం జరిగిన మాట వాస్తవమేనని, అయితే ఖలిస్థానీ సానుభూతిపరులు చెబుతున్నట్లుగా ఈ సంఖ్య వేలల్లో లేదని విశ్లేషకులు తెలియజేశారు.

ఈ సినిమాలో పంజాబ్లో ఖలిస్థానీ ఉగ్రవాదాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, అకాలిదళ పార్టీకి కూడా చెందిన ఖల్రా, కేవలం పోలీసు దౌర్జన్యాలని ఎత్తి చూపి, ఒక ఉద్యమాన్ని నడిపాడని మాత్రమే ఈ సినిమా చూపిస్తోంది. అతను అకాలీదళ పార్టీ నాయకుడని, ఖలిస్థానీ సానుభూతిపరుడు కూడా అని, లిబరేషన్ ఖలిస్థాన్ అనే పత్రికకి సంపాదకుడని ఈ సినిమా చూపించదు.

1995లో కొంతమంది పోలీసులు ఖల్రాని పోలీసు కస్టడీలో హత్య చేసారు. దేశవ్యాప్తంగా దుమారం లేపిన ఈ అమానుష చర్యని అందరూ ఖండించారు. నేరస్థులు అందరికీ యావజ్జీవ కారాగార శిక్ష విధించారు, వారు ఇప్పటికీ జైలులోనే ఉన్నారు.

అయితే ఖలిస్థానీ ఉగ్రవాదులు చంపిన వేలాదిమంది ప్రజలకు, వందలాది మంది పోలీసులకు, వారి కుటుంబాలకు ఎటువంటి న్యాయం జరగలేదు. అయితే ఈ విషయాలు ఈ సినిమా చూపించదు.
కాంగ్రెస్ ముఖ్యమంత్రి బీయాంత్ సింగ్ ను, అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని కూడా ఖలిస్థానీ ఉగ్రవాదంలో కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ, ఈ రోజు ఈ సినిమా మీద రాజకీయం చేస్తోంది. ఇందిరా గాంధీ హంతకులను కీర్తిస్తూ వారి పైన సినిమా తీస్తే కాంగ్రెస్ పార్టీ ఊరుకుంటుందా?

సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్ లో పాకిస్తాన్ ఐఎస్ఐ జోక్యం ఉంటుందని, ముఖ్యంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణా ముమ్మరంగా సాగుతోందని అందరికీ తెలిసినప్పటికీ, 2027లో జరగబోయే విధానసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, ఈ సినిమాని అన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయి.

అంతర్జాతీయంగా, ముఖ్యంగా కెనడా, అమెరికాలలో, గత కొన్ని సంవత్సరాలుగా,
ఖలిస్థానీ వేర్పాటువాదం తిరిగి మొదలైన ఈ ఆందోళనకర సమయంలో ఈ సినిమా తీయాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది? ఇందిరా గాంధీ హంతకులు వీరోచితంగా ఆమెను హత్య చేస్తున్నట్లు చూపించే ఉదంతంతో శకటాలు తయారు చేసి కెనడాలో ఊరేగించారు. పంజాబ్ లో ఎన్నో గురుద్వారాలలో ఖలిస్థానీ ఉగ్రవాదానికి కారణమైన జర్నైల్ సింగ్ భిన్ద్రంవాలే చిత్రపటాలను అతను అమరవీరుడు అని ప్రకటించి ప్రదర్శిస్తున్నాయి. మొత్తం ఉగ్రవాదాన్ని కాకుండా, ఏకపక్షంగా ఒక ఖలిస్థానీ సానుభూతిపరుడిని, ఒకే కోణంలో మానవహక్కుల కార్యకర్తగా మాత్రమే చూపించడంలో దాగి ఉన్న రహస్య కారణం ఏమిటి? ప్రస్తుతం ఎన్నికల ముందు పంజాబ్ ప్రజల మనోభావాలు రెచ్చగొడితే ఎవరికి ప్రయోజనం కలుగుతుంది?

OTT ప్లాట్ఫామ్లలో చిత్రాలు హింస, సెక్స్ లతో ఉండి, ఎన్నో కథాంశాలు వక్రీకరణకి గురి అవుతున్నాయని తెలిసి కూడా, ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం వాటిని చట్ట పరిధిలోకి ఎందుకు తేవట్లేదు? దేశభద్రతకి భంగం వాటిల్లుతుంటే, ఏకపక్ష భావప్రకటనా స్వేచ్ఛ, చిత్ర నిర్మాతలకి, దర్శకులకి ఎక్కువ ముఖ్యమా?