
యోగ గురువు, పతంజలి వ్యవస్థాపకుడు రామ్‌దేవ్ బాబా ‘హిందూ రాష్ట్రం’ భావనపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. భారతదేశంలో ముస్లింలకు, క్రైస్తవులకు ఎలాంటి ప్రమాదం లేదని, ‘హిందూ రాష్ట్రం’ అనే భావన పట్ల ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని డియోబంద్ మదర్సాను 2009లో సందర్శించిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ రామ్‌దేవ్ బాబా మాట్లాడుతూ, “మన మతాలు వేరైనా మన పూర్వీకులు ఒక్కరే. భారతీయులందరికీ ఒకే సాంస్కృతిక వారసత్వం ఉంది. అందువల్ల ‘హిందూ రాష్ట్రం’ అనే భావనను అపార్థం చేసుకోవద్దు” అని అన్నారు.
హిందుస్థాన్‌లో ప్రతి మతానికీ సమాన గౌరవం ఉంటుందని, ముస్లింలు, క్రైస్తవులు తమ మతాచారాలను స్వేచ్ఛగా అనుసరించవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా తమకు నచ్చిన దుస్తులు ధరించవచ్చని, తమ విశ్వాసాలకు అనుగుణంగా జీవించవచ్చని పేర్కొంటూనే, భారతీయ సంస్కృతి, సద్గుణాలు, సాంప్రదాయ విలువలను అందరూ అలవరచుకోవాలని సూచించారు.
రామ్‌దేవ్ బాబా వ్యాఖ్యలకు రాజకీయ వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కాంగ్రెస్, AIMIM, సమాజ్‌వాదీ పార్టీ, ఎన్‌సీపీ నాయకులు తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పించారు. మరోవైపు, రామ్‌దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు భారతీయ సాంస్కృతిక ఐక్యత, సనాతన వారసత్వం గురించి చెప్పే ప్రయత్నమేనని భావిస్తున్నవారూ ఉన్నారు.




