ArticlesNews

విశ్వాసం కోల్పోతున్న గ్రామసభలు

39views

‌గ్రామసభల్లో ప్రజల భాగస్వామ్యం తగ్గిందా? ముఖ్యంగా యువత, మహిళలు వాటిపట్ల ఆసక్తి చూపడం లేదా? అవునని అంగీకరించక తప్పదు. ఇటీవల నీతి ఆయోగ్‌ ‌విడుదల చేసి జాతీయ అధ్యయన నివేదిక దిగ్భ్రాంతి కలిగించేలా ఉంది. గ్రామసభల్లో మితిమీరిన రాజకీయ జోక్యం, పాలనాపరమైన అవినీతి, సమస్యలకు పరిష్కారం లభించకపోవడం, జవాబుదారీతనం , ప్రాతినిధ్యం లోపించడం.. ఇలా ఒకటేమిటి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. మరి ప్రజల్లో గ్రామసభల పట్ల నమ్మకం పెంచడం ఎలా? దీనికి కూడా పరిష్కార మార్గాలను సూచించింది ఈ నివేదిక.
‌ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో గ్రామీణ ప్రజలు ఉన్నది భారతదేశంలోనే. దాదాపు 65శాతం మంది గ్రామాల్లో నివసిస్తున్నారు. సంఖ్యాపరంగా చూస్తే దాదాపు 93 కోట్లకు పైగా ప్రజలు పల్లెటూళ్లలో జీవిస్తున్నారు. అత్యధికులు వ్యవసాయం, గ్రామీణ ఆధారిత పనుల్లో ఉపాధి పొందుతున్నారు. దేశ ఆహార స్వయంసమృద్ధిని కాపాడటంలో గ్రామీణ ప్రాంతాల పాత్ర అత్యంత కీలకమైనది. అందుకే మహాత్మాగాంధీ ‘గ్రామాలే దేశానికి వెన్నెముక’ అన్నారు. భారతదేశ ఆత్మ గ్రామాల్లోనే నివసిస్తోందని, అవి అభివృద్ధి చెందితేనే దేశం నిజమైన ప్రగతి సాధిస్తుందని ఆయన బలంగా చెప్పేవారు.

దురదృష్టవశాత్తు మన దేశంలోని చాలా గ్రామాలు కనీస మౌలిక వసతుల విషయంలో వెనుకబడి ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యాలు లేవు. పారిశుధ్ధ్య సమస్య తీవ్రంగా ఉంది. సురక్షితమైన తాగునీరు అందరికీ అందుబాటులో లేదు. ఆస్పత్రుల్లో డాక్టర్లు, మందులకు, సౌకర్యాలకు కొరత ఉంది. ప్రభుత్వ పాఠశాలలు ఉన్నా నాణ్యమైన విద్య అందడం లేదు. రైతులకు రుణ వసతి, గిట్టుబాటు, మద్దతు ధరల విషయంలో ఎప్పుడూ ఇబ్బందులే ఉన్నాయి. ఇంటర్నెట్‌ ‌సౌకర్యం పెరిగినా, ఆన్‌లైన్‌ ‌సేవలను పూర్తిగా వాడుకోలేకపోతున్నారు. విద్యుత్‌ ‌సరఫరా సరిగ్గా లేక వ్యవసాయం, చిన్న పరిశ్రమలు దెబ్బతింటున్నాయి. వీటిని పరిష్కరించడంలో గ్రామ పంచాయతీలకన్నా ప్రజల భాగస్వామ్యం ముఖ్యం.

ప్రజలకు దూరమైన సభలు
గ్రామసభల తీరుతెన్నులపై జాతీయ గ్రామీణాభి వృద్ధి పంచాయతీ రాజ్‌ ‌సంస్థ దేశ వ్యాప్తంగా ఒక సర్వే నిర్వహించింది. దీనికి సంబంధించిన నీతి ఆయోగ్‌ ‌నివేదికను రూపొందించి. ఇటీవల విడుదల చేసింది. ప్రజలు గ్రామ సభలకు ఎందుకు హాజరు కావడం లేదో తెలుసుకోడానికి దేశంలోని 26 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 400 గ్రామపంచాయతీలలో 7,790 మంది అభిప్రాయాలను సేకరించారు. వీరిలో దాదాపు 94% మందికి గ్రామసభల గురించి తెలిసినప్పటికీ, వారిలో 47 %మంది మాత్రమే సంవత్సరానికి ఒకటి లేదా రెండు సభలకు హాజరవుతున్నారు.

దాదాపు 55.5% మంది ప్రజలు తమ దైనందిన జీవనోపాధి, వ్యవసాయ పనుల కారణంగా గ్రామ సభలకు హాజరు కాలేకపోతున్నారు. ముఖ్యంగా మహిళలు (13.40%), వృద్ధులు (15.80%), యువత (16.73%), వలస కుటుంబాల (17.61%) హాజరు అత్యల్పంగా ఉన్నట్లు తేలింది. బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యం తక్కువగా ఉంది.

సభల తీరుపై నిరాశ
గ్రామసభల్లో తీసుకున్న నిర్ణయాలకు సరైన ఫలితాలు కనిపించకపోవడం, చర్చలు పునరావృతం కావడం, ప్రజా సమస్యలు పరిష్కారం కాకపోవడం వల్ల ప్రజల్లో నిరాశ పెరిగింది. రాజకీయ జోక్యం, జవాబుదారీతనం లేకపోవడం, పారదర్శకత లోపించడంపై 45.5% మంది ఆందోళన వ్యక్తం చేయగా, 41.9%మంది స్పష్టమైన ఫలితాలు రావడంలేదని తెలిపారు. 33.4% మంది చర్చలు పునరావృతమవుతూ లాంఛనప్రాయంగా మారు తున్నాయని తెలిపారు.16.2% మంది అవగాహన, సమాచార మార్పిడి సమస్యలను, 9.9% మంది ఆసక్తి లేకపోవడాన్ని గ్రామసభ సమావేశాలకు హాజరుకాకపోవడానికి కారణాలుగా పేర్కొన్నారు.

గ్రామసభలకు హాజరైనా మాట్లాడటంలో ఇబ్బంది ఉందని తెలిపిన వారు 35.8% మంది కాగా, 17.4% మంది నాయకులు, అధికారుల పట్ల భయాన్ని వ్యక్తంచేశారు. 17.2% మంది పలుకుబడి ఉన్నవారే చర్చలలో ఆధిపత్యం చెలాయిస్తారని పేర్కొన్నారు. 9.05% లింగ వివక్ష, 6.6% కుల వివక్షల కారణాలుగా చెప్పారు. ఎగువ కులాల ఆధిపత్యం ఎక్కువగా ఉండటం వల్ల ఎస్సీ,ఎస్టీ సామాజిక వర్గాలకు చెందినవారు తమ సమస్యలను సరిగ్గా వ్యక్తపరచలేకపోతున్నారు. మహిళా సర్పంచుల్లో 82% మంది గ్రామసభలు తమపట్ల సానుకూలంగా లేవని అభిప్రాయపడ్డారు. కాగా, స్థానిక అభివృద్ధి, సంక్షేమ పథకాలు, సమస్యలపై చర్చించడానికి గ్రామసభకు గ్రామస్థులు ఇప్పటికీ విలువ ఇస్తున్నారని ఈ అధ్యయనంలో తేలింది. సమావేశ తేదీలు అందరికీ ముందే తెలిసినప్పటికీ, గ్రామసభల్లో హక్కులు, నిర్ణయాలు తీసుకునే విధానాలపై పౌరులకు అవగాహన లోపించింది.

నివేదిక ఇచ్చిన సూచనలు
రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 243ఎ ‌ప్రకారం గ్రామసభ ప్రాముఖ్యతను తెలియజేస్తూ, ప్రజల భాగస్వామ్యాన్ని ప్రభావితం చేసే అంశాలను సూచించింది. స్థానిక పాలనలో కీలకమైన గ్రామ సభలు కేవలం ప్రజల హాజరీ నమోదుకే పరిమితం కాకుండా నమ్మదగినవిగా, ప్రజా సమస్యలను పరిష్కరించేవిగా ఉండాలని తెలిపింది. స్థానిక సమస్యల పరిష్కారంలో పౌరులు భాగస్వామ్య మయ్యేలా విధానపరమైన మార్పులు చేపట్టాలని సిఫార్సు చేసింది. గ్రామసభలు అభివృద్ధిని ప్రభావితం చేయగలవని, సమస్యలను పరిష్కరించగలవని, నిర్ణయాల అమలును స్పష్టంగా కనిపించేలా చేయ గలవని ప్రజలు విశ్వసించినప్పుడు, భాగస్వామ్యం అత్యధికంగా ఉంటుందని కూడా ఈ అధ్యయనం వెల్లడించింది.

ప్రజావిశ్వాసాన్ని పునరుద్ధరించడానికి గత తీర్మానాల సమీక్ష, అమలు పురోగతి, ఫిర్యాదుల పరిష్కారం అవసరమని సూచించింది. అలాగే ఆరోగ్యం, వ్యవసాయం, విద్య, సంక్షేమ పథకాలకు సంబంధించిన శాఖల అధికారులు సమావేశాలలో క్రమం తప్పకుండా పాల్గొనాలని కూడా పిలుపునిచ్చింది. గ్రామసభ అధికారాలు, సంక్షేమ హక్కులు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలు, జీపీడీపీ పక్రియలు, సామాజిక తనిఖీ యంత్రాం గాలు, భాగస్వామ్య బాధ్యతలు, స్థానిక ప్రజాస్వామ్య జవాబుదారీతనం వంటి అంశాలను వివరించే పుస్తకాలను స్థానిక భాషల్లో ముద్రించి పంపిణీ చేయాలని సూచించారు.

సమన్వయం అవసరం
గ్రామసభను కేవలం ప్రభుత్వ పథకాలు, ఇళ్లు లేదా పెన్షన్ల లబ్ధిదారులను ఎంపిక చేసే స్థలంగానే చాలామంది ప్రజలు భావిస్తున్నారు. రోజువారీ కూలీలు, వలస కార్మికులు, మహిళలు, యువత, ఎస్సీ- ఎస్టీ వర్గాలు, బలహీన వర్గాలు, యువత, మారువ•ల, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల భాగస్వామ్యాన్ని పెంపొం దించడానికి ప్రత్యేక ప్రయత్నాలు చేయాలని సిఫార్సు చేసింది. వారి కోసం వర్గాల వారీగా సభలు నిర్వహించాలని పేర్కొంది. పంచాయతీ అధికారులు గ్రామసభల నిర్వహణకు కనీసం రెండు రోజుల ముందే ప్రజలకు పూర్తిస్థాయి సమాచారం అందించాలి.

కృత్రిమ మేధస్సువంటి సాంకేతికతను ఉపయోగించి, జాతీయ స్థాయిలో, టెలివిజన్‌, ‌రేడియో, పాఠశాలలు, స్వయం సహాయక బృందాలు, సోషల్‌ ‌మీడియా ద్వారా గ్రామసభ అవగాహన ప్రచారాన్ని ప్రారంభించాలని ప్రతిపాదించింది. సమావేశాల గురించి గ్రామస్తులకు తెలియజేయ డానికి లౌడ్‌స్పీకర్‌, ‌డప్పులు కొట్టడం అత్యుత్తమ మార్గమని సూచించింది. దీనిని 42.9%మంది ఇష్టపడ్డారు. ఇంటింటి ప్రచారాలకు 17.1% మంది మొగ్గుచూపగా, 15.8% మంది సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి వాట్సాప్‌ ‌గ్రూపులను ఇష్టపడ్డారు.

రాజకీయ జోక్యమే ప్రధాన కారణం
గ్రామసభలు బలహీనపడటానికి ఆర్థిక స్వయంప్రతిపత్తి లేకపోవడం, రాజకీయ జోక్యం, పాలనాపరమైన అవినీతి, చట్టాలపై ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం, అధికారాల వికేంద్రీకరణ సక్రమంగా జరగకపోవడం ప్రధాన కారణాలు.

గ్రామసభ ఆమోదం లేకుండానే అధికారులు నిధులు ఖర్చు చేయడం, పనుల మంజూరులో పారదర్శకత లోపించడం జరుగుతున్నాయి. ఇందుకు కారణం గ్రామ పంచాయతీలకు సొంత ఆదాయ వనరులు నామమాత్రంగానే ఉండటమే. ఎన్నికైన సర్పంచ్‌, ‌వార్డు సభ్యుల కంటే రాజకీయపార్టీలు, ఎమ్మెల్యేలు, ఎంపీల జోక్యం ఎక్కువైంది. గ్రామ స్థాయిలో జరగాల్సిన పనులను వారే నిర్ణయిస్తున్నారు. దీనివల్ల గ్రామసభల తీర్మానాలకు విలువ లేకుండా పోతోంది. నిధుల కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై ఆధారపడాల్సి వస్తుంది.

రాష్ట్రాల్లో అధికార పార్టీకి అనుకూలంగా లేని పంచాయతీలకు నిధులు సకాలంలో విడుదల కావు. దీనివల్ల ప్రతిపక్ష సర్పంచులు ఉన్న గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతోంది. పార్టీరహితంగా జరగాల్సిన పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు నేరుగా జోక్యం చేసుకుంటున్నాయి. దీనివల్ల గ్రామాల్లో గ్రూపు రాజకీయాలు పెరిగి, గ్రామసభల్లో సామరస్యం దెబ్బతింటోంది.

గ్రామ సభ అంటే ఏమిటి?
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 243(‌బి) ప్రకారం గ్రామసభ అంటే ఆ పంచాయితీలోని ప్రత్యక్ష ప్రజాస్వామ్య వేదిక. వాటి ప్రధాన విధులు-

అభివృద్ధి ప్రణాళికలు: గ్రామానికి అవసర మైన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను చర్చించి ఆమోదించడం, 2. పారదర్శకత, పర్యవేక్షణ: గ్రామ పంచాయతీ చేసే ఖర్చులు, వార్షిక బడ్జెట్‌, ఆడిట్‌ ‌నివేదికలను పరిశీలించి, నిధుల వినియోగాన్ని పర్యవేక్షించడం, 3. లబ్ధిదారుల ఎంపిక: ప్రభుత్వ పథకాలకు అర్హులైన పేదలు లేదా లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపికచేయడం, 4 సామాజిక తనిఖీ : జరుగుతున్న అభివృద్ధి పనుల నాణ్యతను తనిఖీ చేయడం.
గ్రామసభ ఆ గ్రామంలోని ఓటర్లందరి సభ. ఇది శాసనసభలా వ్యవహరిస్తూ నిర్ణయాలు తీసుకుంటుంది. గ్రామ పంచాయతీ సదరు గ్రామ సభలోని ఓటర్లు ఎన్నుకున్న సర్పంచ్‌, ‌వార్డు సభ్యులతో కూడిన కార్యనిర్వాహక కమిటీ. గ్రామసభలు సాధారణంగా సంవత్సరానికి కనీసం 2 నుండి 4 సార్లు సమావేశమవుతాయి.

ప్రాచీన భారతంలో గ్రామసభలు
వేల సంవత్సరాల క్రితమే భారతదేశ చరిత్రలో ఈ వ్యవస్థను చూడవచ్చు. మూడున్నర వేల సంవత్సరాల క్రితమే గ్రామసభల నిర్మాణం, వాటి అధికారాలు, పనితీరు అద్బుతంగా ఉండేవి. అవి పూర్తి స్వయంప్రతిపత్తితో పని చేసిన చిన్నపాటి గణతంత్ర వ్యవస్థలు. రాజులు, రాజ్యాల సరిహద్దులు మారినా గ్రామాల్లోని ఈ పాలనావ్యవస్థ వేల సంవత్సరాల పాటు చెక్కు చెదరకుండా కొనసాగింది. గ్రామాల్లో స్థానిక నిర్ణయాల కోసం సభ, సమితి, విధాత పేర్లతో అనుభవజ్ఞులైన పెద్దలతో కూడిన మండలులు పనిచేసేవి. గ్రామపెద్దను ‘గ్రామణి’ అని పిలిచేవారు. ఈ సభల్లో సామాజిక, రాజకీయ సమస్యలను చర్చించి, వివాదాలను పరిష్కరించే వారు. కౌటిల్యుడి అర్థశాస్త్రంలో గ్రామపెద్దల మండలి గురించి ప్రస్తావించారు.మౌర్యుల కాలంలో గ్రామాధికారిని ‘గ్రామిక’, గుప్తుల కాలంలో ‘గ్రామపతి’ అనేవారు. వీరు గ్రామ సభ సహాయంతో భూముల కేటాయింపు, పన్నుల వసూలు, రహదారులు, చెరువుల మరమ్మతులను పర్యవేక్షించే వారు. మౌర్యుల కాలంలో గ్రామపాలనపై రాజుల జోక్యం చాలా తక్కువగా ఉండేది.

చోళులకాలం నాటి గ్రామసభలు అత్యున్నత శిఖరానికి చేరాయి. తమిళనాడులోని ‘ఉత్తర మేరూరు శాసనం’ ప్రకారం గ్రామ సభ సభ్యులను ‘కుడవోలై’ (లాటరీ పద్ధతి) ద్వారా ఎన్నుకునేవారు. పోటీ చేసే అభ్యర్థుల పేర్లను తాటి ఆకులపై రాసి కుండలో వేసేవారు. ఒక చిన్న బాలుడి చేత ఆకులను తీయించి విజేతలను ప్రకటించేవారు. గ్రామసభ సభ్యత్వం కోసం ప్రయత్నించే అభ్యర్థికి సొంత ఇల్లు ఉండాలి, వేదాలపై అవగాహన ఉండాలి, వయసు 35-70 ఏళ్ల మధ్య ఉండాలి, పన్నులు సరిగ్గా చెల్లించి ఉండాలి. అవినీతికి పాల్పడినా, తప్పుడు లెక్కలు చూపించినా వారిని, వారి బంధువులను ఎన్నికల నుండి శాశ్వతంగా బహిష్కరించేవారు. గ్రామసభలకు పూర్తి న్యాయాధికారాలు ఉండేవి. చిన్న చిన్న దొంగతనాలు, భూ వివాదాలు, సివిల్‌, ‌క్రిమినల్‌ ‌కేసులను గ్రామసభలే విచారించి తీర్పులు ఇచ్చేవి. రాజుకు చెల్లించాల్సిన పన్నులను గ్రామసభే సేకరించి ప్రభుత్వ ఖజానాకు పంపేది. కరవులు, వరదలు వచ్చినప్పుడు పన్ను మినహాయింపులు ఇచ్చే అధికారం కూడా గ్రామసభలకే ఉండేది.

‌క్రాంతిదేవ్‌ ‌మిత్ర
సీనియర్‌ ‌జర్నలిస్ట్