News

‘మహర్షి సుశ్రుత సంగ్రహం’ గ్రంథావిష్కరణ

30views

ప్రపంచ వైద్య చరిత్రలో శస్త్రచికిత్స పితామహుడిగా ఖ్యాతి పొందిన మహర్షి సుశ్రుత మహోన్నత సేవలను నేటి తరానికి పరిచయం చేసే ఉద్దేశంతో రూపొందించిన ‘మహర్షి సుశ్రుత సంగ్రహం’ సమగ్ర గ్రంథాన్ని విజయవాడలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఈ గ్రంథం వెలువడటం భారతీయ సనాతన వైద్య విజ్ఞానానికి గర్వకారణమని హైకోర్టు న్యాయమూర్తి కృష్ణ మోహన్ పేర్కొన్నారు.

ప్రొఫెసర్ చంద్ర వి.ఎన్. ఆధ్వర్యంలో 36 మంది అంతర్జాతీయ నిపుణుల సహకారంతో ఈ గ్రంథం రూపొందింది. మహర్షి సుశ్రుతుని వైద్య శాస్త్రానికి చేసిన విశిష్ట సేవలు, శస్త్రచికిత్స రంగంలో ఆయన అందించిన అమూల్యమైన జ్ఞానాన్ని ప్రపంచానికి పరిచయం చేసే విలువైన రచనగా ఈ గ్రంథాన్ని ఆయన అభివర్ణించారు.

ఈ సందర్భంగా ప్రపంచంలోనే అత్యంత పురాతన, ప్రతిష్ఠాత్మక వైద్య సంస్థలలో ఒకటైన స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బర్గ్ రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్‌లో మహర్షి సుశ్రుతుని కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు చేసిన కృషిని న్యాయమూర్తి కృష్ణ మోహన్ ప్రత్యేకంగా అభినందించారు. స్వామిమలైలో ప్రత్యేకంగా రూపొందించిన ఆ విగ్రహం ప్రతిష్ఠలో ప్రొఫెసర్ చంద్ర కీలక పాత్ర పోషించారని కొనియాడారు.

ప్రొఫెసర్ చంద్ర మాట్లాడుతూ, ప్రాచీన భారతదేశంలో వారణాసి కేవలం ఆధ్యాత్మిక క్షేత్రం మాత్రమే కాకుండా విజ్ఞానశాస్త్రం, ఖగోళశాస్త్రం, వైద్యశాస్త్రం, శస్త్రచికిత్సలకు అంతర్జాతీయ స్థాయి కేంద్రంగా వెలుగొందిందని తెలిపారు. మహర్షి సుశ్రుతుని వారసత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తృతంగా చాటి చెప్పడం ప్రతి భారతీయుడి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.