News

పురావస్తు సర్వేలో అలనాటి అమరావతి కీలక శాసనాలు వెలుగులోకి

41views

 

నల్లమల అటవీ ప్రాంతంలో నిర్వహించిన పురావస్తు సర్వేలో అలనాటి అమరావతి చరిత్రకు సంబంధించిన కీలక శాసనాలు వెలుగులోకి రావడం చారిత్రక పరిణామమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం అయ్యంబొట్లపల్లె సమీపంలో భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ నిర్వహించిన సర్వేలో 13వ శతాబ్దానికి చెందిన తెలుగు శాసనం లభించినట్లు అధికారులు తెలిపారు. కాకతీయ రాణి రుద్రమదేవి సేనాపతి మల్లికార్జున నాయకుడు ధాన్యకటకం, నేటి అమరావతిలోని బుద్ధదేవునికి వెల్మపల్లి గ్రామాన్ని దానంగా ఇచ్చిన విషయాన్ని ఈ శాసనం తెలియజేస్తోందని పురావస్తు శాస్త్రవేత్తలు వెల్లడించారు.

ఈ సందర్భంగా పురావస్తు శాస్త్రవేత్తలు, అటవీశాఖ సిబ్బందిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందించారు. అమరావతి చరిత్ర, బౌద్ధ వారసత్వానికి ఈ శాసనాలు మరింత బలమైన ఆధారాలని పేర్కొన్నారు.

నల్లమల అటవీ ప్రాంతంలో మరిన్ని పురావస్తు పరిశోధనలకు అటవీశాఖ తరఫున పూర్తి సహకారం అందిస్తామని, రాష్ట్ర వారసత్వ సంపదను గుర్తించి, భావి తరాలకు పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు.