News

విభజన నిర్వాసితులను “శరణార్థులు”గా అభివర్ణించకూడదు : మోహన్ భాగవత్

40views
భారత విభజన సమయంలో నిర్వాసితులైన వారిని “శరణార్థులు”గా అభివర్ణించకూడదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ సూచించారు. వారు తమ విశ్వాసాన్ని నిర్భయంగా ఆచరించడం కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేసిన పోరాట యోధులు అని అభివర్ణించారు.
ఈ నెల ఒకటో తేదీన నాగపూర్ లో సింధీ సమాజం నిర్వహిస్తున్న ‘సింధు ఎడ్యుకేషన్ సొసైటీ’ 75వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా విభజన సమయంలో నిరాశ్రయులైన కుటుంబాలు చేసిన త్యాగాన్ని మోహన్ భాగవత్ గుర్తు చేసుకున్నారు. వారు సంపద, సుఖాల కన్నా దేశాన్ని, ధర్మాన్ని ఎంచుకున్నారని, తరతరాలుగా సంపాదించుకున్న సర్వస్వాన్నీ తృణప్రాయంగా వదులుకున్నారన్నారు.
“తరాల తరబడి కూడబెట్టిన ఆస్తులు, భూములు, వ్యాపారాలు, భూములు.. ఇలా అన్నింటినీ వదిలేసి, ఇక్కడి వచ్చారన్నారు. వారు శరణార్థులు కారు; వారు నిస్సందేహంగా నిర్వాసితులు. వారి విషయంలో ‘శరణార్థి’ అనే పదాన్ని తప్పుగా ఉపయోగించారని అభ్యంతరం వ్యక్తం చేశారు. నిరాశ్రయులైన వారు ఒక పోరాటంలో ఓడిపోయినప్పటికీ, నిరాశకు లొంగిపోకుండా దృఢ సంకల్పం మరియు కఠోర శ్రమతో శూన్యం నుండి తమ జీవితాలను తిరిగి నిర్మించుకున్నారని ఆయన అన్నారు.
‘‘వారి దగ్గర ఏమీ ఉండేది కాదు. అయినా వారు కుమిలిపోతూ కూర్చోలేదు. సర్వస్వం కోల్పోయినప్పటికీ, ఇక్కడికి వచ్చి మళ్లీ అంతా కొత్తగా నిర్మించుకున్నారు. పరిస్థితుల ముందో, విధి ముందో మనిషి కృంగిపోకూడదు. ప్రయత్నం చేయాలి. ప్రయత్నం ద్వారా అంతా సవ్యంగా మారుతుంది. ఓపిక పట్టాలి, వేచి చూడాలి.’’ అని సూచించారు.
నిరాశ్రయుల జీవితాల నుండి నేర్చుకోదగిన కీలక పాఠం ‘స్థైర్యం’అని, కష్టాల ముందు కుంగిపోయేవారు పోరాటం మొదలవ్వకముందే ఓడిపోతారని అన్నారు.ఏడుస్తూ ఉండే వ్యక్తి యుద్ధం ప్రారంభం కాకముందే ఓడిపోతాడు. కానీ పోరాడేవాడు ఎల్లప్పుడూ ఏదో ఒకటి సాధిస్తాడు. అందువల్ల, జీవితంలో ఎన్నడూ ఓటమిని అంగీకరించకూడదు, పారిపోకూడదు.అని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా మోహన్ భాగవత్ భగవద్గీతను ఉటంకించారు. యుద్ధ రంగాన్ని విడిచి వెళ్లొద్దని కృష్ణుడు అర్జునునికి బోధించారన్నారు. ‘‘మొదటి పాఠం ఇది: ‘పారిపోవద్దు. పారిపోతే అపకీర్తిని మూటగట్టుకుంటావు. పోరాడి గెలిస్తే గౌరవాన్ని పొందుతావు. ఒకవేళ మరణిస్తే, గొప్ప యోగులకు కూడా లభించని స్థితిని పొందుతావు.’ దృఢంగా నిలబడి పోరాటాన్ని కొనసాగించడం వల్ల ఎప్పుడూ నష్టం జరగదు. కానీ పారిపోవడం, ఓటమిని అంగీకరించడం, చేతులు ముడుచుకుని కూర్చోవడం మరియు నిరాశకు లోనుకావడం వల్లనే నష్టం వాటిల్లుతుంది.” అని పేర్కొన్నారు.
పరిస్థితులు మారుతుంటాయి, సందర్భాలు వస్తుంటాయి, పోతుంటాయి; మంచి రోజులు, చెడు రోజులు రెండూ గడిచిపోతాయి. కానీ స్థిరంగా నిలిచిపోయేది ఒక్కటే—అదే, తన కృషితో దుఃఖాన్ని అధిగమించి ఎదిగే వ్యక్తి. వారు వృత్తులను ఎంచుకోలేదు, సంపదను ఎంచుకోలేదు; వారు దేశాన్ని ఎంచుకున్నారు, ధర్మాన్ని ఎంచుకున్నారు. అని ప్రశంసించారు.