News

జమ్ము కశ్మీర్​లో పోలియో ఫ్రీ పాకిస్థాన్​ పోస్టర్లు కలకలం- విచారణకు సీఎంఓ ఆదేశం

7views

జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరీలో ‘పోలియో రహిత పాకిస్థాన్’ అనే పోస్టర్​ తీవ్ర కలకలం సృష్టించింది. ఈ నినాదంతో పల్స్ పోలియో టీకా ప్రచార కార్యక్రమం వ్యాప్తి చెందడంపై ఆరోగ్య శాఖ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. “పోలియో రహిత పాకిస్థాన్” అనే నినాదంతో అనధికారికంగా, తప్పుదోవ పట్టించే విధంగా చలామణి అవుతున్న కరపత్రంపై బ్లాక్ మెడికల్ ఆఫీసర్ (బీఎంఓ) నుంచి అధికారులు తక్షణ వివరణ కోరారు. ఒక రోజులోగా కండి అధికారి నుంచి తక్షణ వివరణ కోరుతూ రాజౌరి చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంఓ) ఉత్తర్వులు జారీ చేశారు.

సీఎంఓ అధికారిక ప్రకటన ప్రకారం ఇంటెన్సిఫైడ్ పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ (ఐపిపిఐ) ప్రోగ్రామ్, 2026కు సంబంధించిన ఒక ప్రకటన సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం అయ్యింది. ఇది కండి బీఎంఓ కార్యాలయం ద్వారా అధికారికంగా జారీ చేసినట్లుగా ఒక అభిప్రాయాన్ని కలిగించిందని అన్నారు. ఆ మెటీరియల్‌ను పరిశీలించగా, దానిపై జాతీయ అత్యవసర కార్యకలాపాల కేంద్రం (NEOC) లోగో, “పోలియో రహిత పాకిస్థాన్” అనే నినాదం ఉన్నట్లు తేలింది. వీటికి జమ్మూ కశ్మీర్ ఆరోగ్య, వైద్య విద్యా శాఖకు గానీ, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు గానీ సంబంధించిన ఏ కార్యక్రమానికి లేదా సమాచారానికి ఎటువంటి సంబంధం లేదని తెలిపారు.

ప్రస్తుతం పరిశీలనలో ఉన్న BMO పేరు, హోదా కూడా ఆ కరపత్రంలో ఉన్నాయి. ఆ లోగో, నినాదం ప్రాథమికంగా అనధికారికమైనవని ప్రకటనలో పేర్కొన్నారు. ఇవి తప్పుదోవ పట్టించేవని, ప్రభుత్వ అధికారిక ఆరోగ్య కార్యక్రమాలపై ప్రజల్లో గందరగోళం సృష్టించే అవకాశం ఉందని తెలిపారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అయూబ్ లోన్ ఈ ప్రకటన మెటీరియల్‌ను సోషల్ మీడియాలో ప్రచారం చేశారని ఆ లేఖలో చెప్పారు. ఈ విషయాన్ని అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఇది ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసి, విభాగానికి అపఖ్యాతిని తెస్తుందని పేర్కొన్నారు.

ఆ మెటీరియల్‌ను అధికారిక అనుమతితో తయారు చేశారా, ఆమోదించారా, ముద్రించారా, ప్రచురించారా లేదా ప్రచారం చేశారా అనే దానిపై ఒక రోజులోగా వివరణాత్మక నివేదిక, లిఖితపూర్వక వివరణ సమర్పించాలని BMOను ఆదేశించారు. కరపత్రాన్ని తయారుచేయడం, రూపకల్పన, ఆమోదించడం, ముద్రించడం, పంపిణీ చేయడానికి బాధ్యత వహించిన అధికారులు లేదా సంస్థలను గుర్తించమని కూడా సీఎంఓ స్పష్టం చేశారు.

ఎవరి అధికారంతో లోగో, విషయాలు పొందుపరచారో వివరించాలంటూ అడిగారు. దానిని వ్యాప్తికి చేసేందుకు ఎందుకు అనుమతించారో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ నుంచి కూడా వివరణ కోరారు. ఆఫీసు పేరుతో ఎటువంటి సమాచారం, ప్రకటన, పోస్టర్, కరపత్రం లేదా సోషల్ మీడియా కంటెంట్‌నైనా సరే, తగిన పరిశీలన, ఆమోదం లేకుండా విడుదల చేయకూడదని లేదా ప్రచారం చేయకూడదని CMO ఆదేశించారు.