
బంగ్లాదేశ్ జైలులో నిర్బంధంలో ఉన్న ఇస్కాన్ (ISKCON) హిందూ సాధువు చిన్మయ్ ప్రభు (చిన్మయ్ కృష్ణ దాస్) ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారిందని భారత్‌కు చెందిన ఇస్కాన్ నాయకుడు శ్రీ రాధా రమణ దాస్ తెలిపారు. ఈ విషయాన్ని ఆయన సామాజిక మాధ్యమ వేదిక ‘X’ ద్వారా వెల్లడిస్తూ, చిన్మయ్ ప్రభు ప్రాణాలకు తీవ్రమైన ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
రాధా రమణ దాస్ తెలిపిన వివరాల ప్రకారం, ఇటీవల చిన్మయ్ ప్రభు తల్లితో మాట్లాడిన సందర్భంగా ఆమె తన కుమారుడి ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. చిన్మయ్ ప్రభు గత 583 రోజులుగా జైలులో ఉన్నారని, చివరిసారిగా కలిసినప్పుడు ఆయన ఆరోగ్యం గణనీయంగా క్షీణించిందని ఆమె పేర్కొన్నట్లు వెల్లడించారు.

చిన్మయ్ ప్రభుకు మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు వెంటనే విదేశాలకు తరలించాల్సిన అవసరం ఉందని, ఆలస్యం జరిగితే ఆయన ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని రాధా రమణ దాస్ అన్నారు. ఈ విషయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకుని, మానవతా దృక్పథంతో అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉండగా, చిన్మయ్ ప్రభు తల్లి కూడా ఇటీవల తీవ్రమైన గుండెపోటుకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని దాస్ తెలిపారు. ఆమె ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని, చిన్మయ్ ప్రభు సురక్షితంగా విడుదలై ఆరోగ్యవంతంగా తిరిగి రావాలని భక్తులు, హిందూ సమాజం ప్రార్థించాలని ఆయన పిలుపునిచ్చారు.
అయితే, చిన్మయ్ ప్రభు ఆరోగ్య పరిస్థితి, చికిత్స అవసరం, అలాగే ఆయన నిర్బంధానికి సంబంధించిన వివరాలపై బంగ్లాదేశ్ అధికారుల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.





