
విశాఖపట్నంలోని శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో అత్యంత పవిత్రంగా భావించే సింహగిరి ప్రదక్షిణ ఈ నెల 28, 29 తేదీల్లో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ తెలిపారు. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశమున్న నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
కలెక్టరేట్ సమావేశ మందిరంలో పోలీసు కమిషనర్, జాయింట్ కలెక్టర్, వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జూలై 28 సాయంత్రం 4 గంటలకు తొలి పావంచా వద్ద అనువంశిక ధర్మకర్త ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అధికారికంగా గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుందని తెలిపారు. అయితే భక్తులు ఉదయం నుంచే ప్రదక్షిణ ప్రారంభించే అవకాశం ఉన్నందున అన్ని సౌకర్యాలు ముందుగానే సిద్ధంగా ఉంచాలని సూచించారు.
తొలి పావంచా వద్ద కొబ్బరికాయలు సమర్పించేందుకు 50 క్యూలైన్లు, 100 ఐరన్ స్టాండ్లు ఏర్పాటు చేయడంతో పాటు భక్తుల రద్దీని బట్టి అదనపు కౌంటర్లు కూడా సిద్ధం చేయాలని ఆదేశించారు. అలాగే ప్రత్యేక కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి మొత్తం ప్రదక్షిణ ఏర్పాట్లను పర్యవేక్షించాలని సూచించారు.
సుమారు 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మార్గమంతా తాగునీటి సౌకర్యం, బయో టాయిలెట్లు, విశ్రాంతి కేంద్రాలు, వైద్య శిబిరాలు, అంబులెన్స్‌లు, మొబైల్ మెడికల్ యూనిట్లు, విద్యుద్దీపాలు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 50 నీటి ట్యాంకులను అందుబాటులో ఉంచడంతో పాటు ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒక విశ్రాంతి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
భక్తుల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక ట్రాఫిక్ కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ సూచించారు. నగరంలో ట్రాఫిక్ మళ్లింపులు, పార్కింగ్ స్థలాలు, హోల్డింగ్ పాయింట్లు, సూచిక బోర్డులు, బారికేడ్లు ముందుగానే సిద్ధం చేయాలని చెప్పారు. హనుమంతువాక జంక్షన్ వద్ద ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని, జాతీయ రహదారిని భక్తులు సురక్షితంగా దాటేందుకు తాత్కాలిక ఫుట్ ఓవర్ బ్రిడ్జిల ఏర్పాటును పరిశీలించాలని సూచించారు.
ప్రదక్షిణ మార్గంలోని రోడ్లు, వీధి దీపాలకు మరమ్మతులు చేపట్టడంతో పాటు తొలి పావంచా వరకు ప్రత్యేక బస్సులు నడపాలని, బీఆర్టీఎస్ రోడ్డులో బస్సుల పార్కింగ్‌కు బదులుగా ప్రత్యామ్నాయ స్థలాలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. లక్షలాది మంది భక్తులు పాల్గొనే నేపథ్యంలో భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, దొంగతనాలు వంటి ఘటనలు జరగకుండా విస్తృత పోలీసు బందోబస్తుతో పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా సింహాచలం దేవస్థానం ఈవో జె. వెంకటరావు మాట్లాడుతూ, జూలై 29న గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకున్న భక్తులకు శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దర్శనం ఉచితంగా కల్పించనున్నట్లు వెల్లడించారు.





