హిందూ వివాహానికి ‘సప్తపది’ తప్పనిసరి.. రిజిస్ట్రేషన్ ఒక్కటే సరిపోదు: గుజరాత్ హైకోర్టు చారిత్రాత్మక తీర్పు

హిందూ వివాహ వ్యవస్థలో శాస్త్రోక్త ఆచారాల ప్రాముఖ్యతను నొక్కిచెబుతూ గుజరాత్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. హిందూ సంప్రదాయం ప్రకారం ‘సప్తపది’ (అగ్ని సాక్షిగా ఏడడుగులు వేయడం) వంటి వివాహ క్రతువులు నిర్వహించకుండా కేవలం మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పొందినంత మాత్రాన ఆ వివాహం చట్టబద్ధంగా చెల్లుబాటు కాదని స్పష్టం చేసింది.
జస్టిస్ ఇలేష్ వోరా, జస్టిస్ ఆర్.టి. వాచ్ఛాని ధర్మాసనం హిందూ వివాహం అనేది కేవలం పాటలు, నృత్యాలు, విందులతో ముగిసే కార్యక్రమం కాదని పేర్కొంది. పవిత్రమైన అగ్ని సాక్షిగా వధూవరులు సప్తపది పూర్తి చేయడం ద్వారా మాత్రమే వివాహానికి ఆధ్యాత్మిక, సామాజిక, చట్టపరమైన గుర్తింపు లభిస్తుందని తీర్పులో స్పష్టం చేసింది.
యునైటెడ్ కింగ్‌డమ్‌లో నివసిస్తున్న కౌశల్ సోనార్ దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణ సందర్భంగా ఈ తీర్పు వెలువడింది. అహ్మదాబాద్‌కు చెందిన ఓ మహిళ తన సంతకాలను మోసపూరితంగా సేకరించి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయించిందని, తమ మధ్య హిందూ సంప్రదాయం ప్రకారం ఎలాంటి వివాహ క్రతువులు జరగలేదని కౌశల్ హైకోర్టును ఆశ్రయించారు.
ఇంతకుముందు ఫ్యామిలీ కోర్టు ఆయన పిటిషన్‌ను తిరస్కరించగా, హైకోర్టులో విచారణ సందర్భంగా సదరు మహిళ కూడా తమ మధ్య శాస్త్రోక్త వివాహ ఆచారాలు జరగలేదని అంగీకరించింది. దీంతో హిందూ వివాహ చట్టంలోని నిబంధనలను పరిశీలించిన ధర్మాసనం, సప్తపది వంటి తప్పనిసరి క్రతువులు నిర్వహించని పక్షంలో ఆ వివాహం చట్టపరంగా చెల్లదని తేల్చిచెప్పింది.
ఈ నేపథ్యంలో ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసిన హైకోర్టు, కేవలం వివాహ రిజిస్ట్రేషన్ ఆధారంగా హిందూ వివాహం చెల్లుబాటు అవుతుందని చెప్పలేమని స్పష్టం చేస్తూ కీలక తీర్పును వెలువరించింది.





