
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)పై అనుచిత, అవమానకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర హోంమంత్రి ప్రియాంక్ ఖర్గేపై కేసు నమోదు చేయాలని బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది.
గత ఏడాది నిర్వహించిన ఓ సమావేశంలో ప్రియాంక్ ఖర్గే ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధిస్తామని వ్యాఖ్యానించడమే కాకుండా, ఆ సంస్థను, స్వయంసేవకులను కించపరిచేలా మాట్లాడారని ఆరోపిస్తూ చిక్కమగళూరుకు చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించి ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి, ఫిర్యాదులో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని పేర్కొంటూ ప్రియాంక్ ఖర్గేపై కేసు నమోదు చేసి చట్టపరమైన విచారణ చేపట్టాలని సంబంధిత పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ పరిణామం కర్ణాటక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆర్‌ఎస్‌ఎస్‌పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో న్యాయస్థానం జోక్యం చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.




