
మహిళలు కేవలం కుటుంబ బాధ్యతలకే పరిమితం కాదని, అవకాశాన్ని అందిపుచ్చుకుని సంకల్పంతో ముందుకు సాగితే వ్యాపార రంగంలోనూ అద్భుత విజయాలు సాధించగలరని గుజరాత్‌కు చెందిన దర్యాబెన్ రాజ్‌పుత్ నిరూపించారు. ఒకప్పుడు ఇంటింటికీ తిరిగి పాలు అమ్మిన ఆమె… నేడు కోట్ల రూపాయల పాల వ్యాపారాన్ని నిర్వహిస్తూ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్న విజయవంతమైన మహిళా పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందారు.
గుజరాత్‌లోని బనాస్కాంఠా జిల్లాకు చెందిన దర్యాబెన్‌కు 18 ఏళ్ల వయసులోనే వివాహమైంది. పెళ్లి తర్వాత సాధారణ గృహిణిలా కుటుంబ బాధ్యతలతో జీవితం సాగించిన ఆమెను కుటుంబ ఆర్థిక పరిస్థితులు కొత్త దిశగా ఆలోచించేలా చేశాయి. పెద్దగా చదువు లేకపోయినా, తనకు బాగా తెలిసిన పశుపోషణనే జీవనోపాధిగా ఎంచుకున్నారు.
ప్రతిరోజూ తెల్లవారుజామునే లేచి ఇంటి పనులు పూర్తి చేసి, పశువుల సంరక్షణ చేపట్టి, పాలు పితికి గ్రామంలో విక్రయించేవారు. అయితే అక్కడితో ఆగకుండా పశువుల సంఖ్యను క్రమంగా పెంచుకుంటూ సొంతంగా డెయిరీ ఫామ్‌ను స్థాపించారు. ఎన్నో సవాళ్లు ఎదురైనా పట్టుదలతో ముందుకు సాగుతూ వ్యాపారాన్ని విస్తరించారు.
రెండు పశువులతో ప్రారంభమైన ఆమె ప్రయాణం నేడు దాదాపు 300 పశువుల డెయిరీ ఫామ్‌గా ఎదిగింది. ప్రస్తుతం రోజుకు వెయ్యి లీటర్లకు పైగా పాలను ఉత్పత్తి చేస్తూ, 14 మందికి స్థిరమైన ఉపాధి కల్పిస్తున్నారు.
దర్యాబెన్ మాట్లాడుతూ, “ఒకప్పుడు నేను ఒంటరిగా ప్రారంభించిన ఈ డెయిరీ ఫామ్ నేడు పలువురి జీవనాధారంగా మారింది. అన్ని ఖర్చులు పోనూ సంవత్సరానికి సుమారు రూ.1.85 కోట్ల ఆదాయం వస్తోంది. స్థానిక సహకార బ్యాంకు, బనాస్ డెయిరీ సహకార వ్యవస్థ నాకు ఎంతో అండగా నిలిచాయి. కష్టానికి సరైన ఆలోచన, ప్రణాళిక తోడైతే అసాధ్యం అనేదే ఉండదు” అని తెలిపారు.
దర్యాబెన్ విజయం గ్రామీణ మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తూ, పశుపోషణను లాభదాయకమైన వ్యాపారంగా మలచుకోవచ్చనే సందేశాన్ని చాటుతోంది.





