
అంతరించిపోతున్న అటవీ సంపదను పునరుద్ధరించేందుకు విత్తన బంతులు (సీడ్ బాల్స్) సమర్థవంతమైన మార్గమని, పచ్చని ప్రకృతి పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు విత్తన బంతుల కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సీలేరు అటవీ రేంజ్ అధికారి వెంకటరావు పిలుపునిచ్చారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి అటవీ డివిజన్ పరిధిలోని సీలేరు రేంజ్లో బుధవారం అటవీ సిబ్బంది, పాఠశాల విద్యార్థులతో కలిసి పలు ప్రాంతాల్లో విత్తన బంతులు చల్లే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వెంకటరావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పచ్చదనం పెంపు లక్ష్యంగా 2.50 కోట్ల విత్తన బంతుల తయారీకి శ్రీకారం చుట్టిందన్నారు. చింతపల్లి అటవీ డివిజన్లో 6.50 లక్షల విత్తన బంతులు తయారు చేయాలని లక్ష్యంగా నిర్దేశించగా, అందులో సీలేరు రేంజ్ పరిధిలోనే 1.20 లక్షల విత్తన బంతులను తయారు చేసి అటవీ ప్రాంతాలు, పాఠశాలల పరిసరాల్లో చల్లుతున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, అటవీ సిబ్బంది కలిసి 1,100 విత్తన బంతులను చల్లి పచ్చదనం పరిరక్షణకు తమ వంతు సహకారం అందించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ అధికారి రమణమ్మ, సెక్షన్ ఆఫీసర్ సతీష్, పాఠశాల ప్రిన్సిపాల్ బుచ్చిబాబు, అటవీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.





