News

తాడేపల్లిగూడెంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ

9views

  హిందూ స్వరాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ పాలన నేడు దేశం అనుసరిస్తున్న సమగ్ర, ప్రజా సంక్షేమ పాలనకు చారిత్రక ఆదర్శమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని  ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, “సబ్ కా సాత్, సబ్ కా వికాస్” అనే సమగ్ర అభివృద్ధి స్ఫూర్తికి నిజమైన చారిత్రక ప్రేరణ ఛత్రపతి శివాజీ మహారాజ్ పాలనేనని అన్నారు.

బానిసత్వపు చీకట్లలో చిక్కుకున్న హిందూ సమాజంలో ఆత్మగౌరవాన్ని, స్వాతంత్ర్య స్పూర్తిని రగిలించిన మహానాయకుడు శివాజీ మహారాజ్ అని కొనియాడారు. పరిమిత సైన్యంతోనే అపారమైన ధైర్యం, అసాధారణ వ్యూహచాతుర్యంతో శక్తివంతమైన సామ్రాజ్యాలను సవాలు చేసి హిందవ స్వరాజ్యాన్ని స్థాపించిన మహావీరుడిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు.

మహిళల గౌరవ పరిరక్షణ, రైతు సంక్షేమం, అణగారిన వర్గాల అభ్యున్నతికి శివాజీ మహారాజ్ అందించిన పాలన ఆదర్శప్రాయమని మంత్రి వివరించారు. అఫ్జల్ ఖాన్ వంటి క్రూర శత్రువును సంహరించిన సందర్భంలోనూ, ఆగ్రా కోటలో బందీగా ఉన్న క్లిష్ట పరిస్థితుల్లోనూ ఆయన అపార ధైర్యసాహసాలు, వ్యూహాత్మక తెలివితేటలను ప్రదర్శించి చరిత్ర సృష్టించారని గుర్తుచేశారు.

దేశభక్తి, ధర్మరక్షణ, సుశాసనం, ప్రజా సంక్షేమం వంటి విలువలను ప్రతి ఒక్కరూ ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితంలో నుంచి స్ఫూర్తిగా తీసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌తో పాటు ప్రజాప్రతినిధులు, హిందూ సంఘాల నాయకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.