
నేటి ప్రపంచంలో ఎక్కడ చూసినా విభేదాలు, ఘర్షణలు, అసహనం, పరస్పర అనుమానాలు కనిపిస్తున్నాయి. కుటుంబాలలో, సమాజంలో, రాజకీయాలలో, మత సంబంధ చర్చలలో, సామాజిక మాధ్యమాలలో కూడా చిన్న విషయాలు పెద్ద వివాదాలుగా మారుతున్నాయి. ఈ పరిస్థితిని చూసినప్పుడు చాలామంది సమాజం మారాలని, చట్టాలు కఠినంగా ఉండాలని, మంచి నాయకులు రావాలని కోరుకుంటారు. ఇవన్నీ అవసరమే. అయితే భారతీయ యోగదర్శనం ఈ సమస్యలకు మరింత లోతైన కారణాన్ని చూపిస్తోంది. అది ఏమిటంటే – సమాజంలోని సమస్యలకు అసలు మూలం వ్యక్తుల చిత్తంలోనే ఉంది.
మనస్సు, బుద్ధి, అహంకారం మూడింటినీ కలిపి చిత్తము అంటాము. ఆలోచన చేసేది మనస్సు, చేసేవాడిని నేను అనే భావన అహంకారము, వివేచన చేసి నిశ్చయానికి వచ్చేది బుద్ధి- ఈ మూడిటి కలయికే చిత్తము. అంటే అన్ని సమస్యలకు మూలం వ్యక్తి మనస్సులో, బుద్ధిలో, అహంకారంలో ఉందని భావం. మనస్సులో నిరంతరం ఉప్పొంగే ఆలోచనలు, ఉద్రేకాలు, కోరికలు, భయాలు, ద్వేషాలు, అహంకారాలు మొదలైన వాటిని అర్థం చేసుకొని నియంత్రించి, నిరోధించే ప్రక్రియే యోగం.
యోగ కేవలం శారీరక వ్యాయామం కాదు, వ్యక్తిని లోపల నుండి సంస్కరించి, అతని ద్వారా సమాజంలో సమరసతను, సమన్వయాన్ని పెంపొందించే అద్భుతమయిన విజ్ఞానం. వ్యక్తిని సమాజంతో, సమాజాన్ని మానవత్వంతో, మానవత్వాన్ని విశ్వచైతన్యంతో అనుసంధానించే ఈ యోగ మార్గము ఎల్లవేళలా మానవ నాగరికతకు మార్గదర్శకంగా నిలిచింది.
చిత్తభూములు
యోగసంప్రదాయం ప్రకారం మనిషి చిత్తం ప్రధానంగా ఐదు స్థితులలో సంచరిస్తుంది. వాటిని క్షిప్త, మూఢ, విక్షిప్త, ఏకాగ్ర, నిరుద్ధలను చిత్త భూములు అంటారు. ఈ చిత్తము త్రిగుణాత్మకము. అంటే మూడు గుణములు కలిగినది. తమస్సు, రజస్సు, సత్వము అనే మూడు ప్రకృతి గుణాలవల్ల చిత్తానికి పై అయిదు స్థితులు కలుగుతాయి. కేవలం తమోగుణం మూఢ చిత్తస్థితిని, రజస్సు సత్వము కలిసియున్న చిత్తము విక్షిప్త స్థితిని, కేవల రజోగుణము క్షిప్తమనే చిత్త స్థితిని, కేవల సత్వగుణము ఏకాగ్రమనే చిత్తస్థితిని, శుద్ధసత్వం అనే గుణం నిరుద్ధమనే చిత్తస్థితిని కలుగజేస్తాయి. సత్వగుణము శుద్ధ స్థితినే శుద్ధసత్వ స్థితి అంటారు. చిత్తములో ఎల్లప్పుడు ఏదో ఒక విషయయానికి సంబంధించిన జ్ఞానము కలుగుతూనే ఉంటుంది. దీనికే చిత్తవృత్తి అనిపేరు. ఈ చిత్తవృత్తులను అదుపుచేయడాన్నే పతంజలి యోగసూత్రాలలో “యోగః చిత్తవృత్తి నిరోదః” అని నిర్వచించారు. అంటే మనసులోకి అలల అలలుగా వచ్చే ఆలోచనలను అదుపు చేయడమే యోగము.
ప్రపంచంలోని ఏకకణ జీవి అయిన అమీబా నుంచి మానవుని దాకా జీవులన్నీ ఈ అయిదు చిత్తభూముల్లో ఏదో ఒక స్థితికి చెంది ఉంటాయి. ఆయా జీవుల ఎదుగుదలకు, పతనానికి ఈ చిత్తభూములే కారణం. ఈ ఐదు స్థితులను అర్థం చేసుకుంటే మన వ్యక్తిగత జీవితాన్ని మాత్రమే కాక, సమాజంలో జరుగుతున్న అనేక సంఘటనలకు మూలకారణాలను కూడా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.
క్షిప్త చిత్తభూమి (వ్యాకులత గల చిత్తము)
మొదటిది క్షిప్త చిత్తభూమి. రజోగుణం అధికంగా కలిగిన జీవులలో ఈ స్థితి ఏర్పడుతుంది. ఇంద్రియ సుఖాలను ఎక్కువగా కోరుకునే సగటు మానవుల మనసు ఎక్కువగా ఈ స్థితిలో ఉంటుంది. ఈ స్థితిలో ఉన్న మనస్సు నిరంతరం చంచలంగా, అనేక ఉద్రేకాలతో నిండి ఉంటుంది. కనపడిన సుఖాన్ని అనుభవిద్దామనుకునేవారు, ధన వ్యామోహం కలినవాళ్లు ఈ చిత్తభూమిలో ఉన్నట్లుగా గుర్తించవచ్చు. ఇలాంటి మనస్సు ఉన్న వ్యక్తి ఏ విషయాన్నీ ప్రశాంతంగా పరిశీలించలేడు. అతడు వెంటనే హడావిడిగా స్పందిస్తాడు. త్వరగా కోపం వస్తుంది. పూర్తి విషయాన్ని తెలుసుకోకుండానే వాదిస్తాడు, తీర్పు ఇస్తాడు, అభిప్రాయాలు ఏర్పరచుకుంటాడు. నేడు అనేకమంది చేసే ఆవేశపూరిత వ్యాఖ్యలు, పుట్టించే పుకార్లు, వాటి కారణంగా ఏర్పడే ఉద్రిక్తతలు మనం చూస్తునే ఉన్నాం. రాజకీయ లేదా మతపరమైన అంశాలపై చెలరేగే వివాదాలు ఘర్షణలు ఈ క్షిప్త చిత్త స్థితినుంచి పుట్టినవే. ఈ చిత్త స్థితిలో ఉన్న వ్యక్తులు ఎక్కువగా ఉన్న సమాజంలో సవ్యమైన సంభాషణలు అడ్డగోలు వాదనలుగా మారి, చివరికి అవి గొడవలవటం మనం చూస్తునే ఉన్నాం.
మూఢ చిత్తభూమి (మందబుద్ధిగల చిత్తము)
వ్యక్తి స్వభావంలో తమోగుణం (అధికంగా ఉన్నప్పుడు ఈ స్థితి ఏర్పడుతుంది. ఈ మనస్థితిగల మనిషి తనలోగల సత్వ, రజోగుణాలని అణగద్రొక్కి ఆవేశంతో ప్రవర్తిస్తాడు. దీన్నే రాక్షస ప్రవృత్తి అంటాం. మనస్సును అజ్ఞానం, భయం, జడత్వాలు పూర్తిగా ఆక్రమించుకున్నప్పుడు ఈ స్థితి కలుగుతుంది. ఇలాంటి వ్యక్తి ఏ విషయాన్ని పరిశీలించడు. వాటినీ తారుమారుగా అర్థం చేసుకుంటాడు. తను వినిన, చూసిన విషయాలను నిలకడగా ఆలోచించి నిజమా, కాదా అని తేల్చుకోకుండా గుడ్డిగా నమ్మేస్తాడు.
“వినదగునెవ్వరుచెప్పిన వినినంతనె వేగపడక వివరింపదగున్, కనికల్ల నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ” అనే శతకపద్యం ఈ విషయాన్నే స్పష్టం చేస్తుంది. మూఢ నమ్మకాలు, మూఢ భక్తి, వర్గ ద్వేషాలు, భయంవల్ల తీసుకునే నిర్ణయాలు ఈ మనఃస్థితికి లక్షణాలు. తమోగుణ ఉద్రేకంచేత చిత్తం క్రోధంగా ఉంటుంది. ఈ మనఃస్థితి కలవాళ్లు అధర్మం వైపే ఎక్కువగా మొగ్గుచూపుతారు. వీరికి స్త్రీలపట్ల, ధనం పట్ల వ్యామోహం ఎక్కువ. (సదా కామినీ కాంచ నాదులపైన వ్యామోహాన్ని కలిగి ఉంటారు.) ఇలాంటి మనఃస్థితి కల వ్యక్తులవల్ల సమాజంలో ఎల్లవేళలా అశాంతి, అరాజకత్వం రాజ్యమేలుతాయి.
విక్షిప్త చిత్తభూమి (చంచల చిత్తము)
ఈ స్థితిలో రజోగుణం, సత్వగుణం రెండూ ఉద్రేక స్థితిలో ఉంటాయి. అందువల్ల వ్యక్తి నిలకడ లేక ఊగిసలాడుతూ ఉంటాడు. ప్రతి మనిషి ఎప్పటికీ ఒకే గుణం కలిగి ఉండడు. గుణాలు హెచ్చుతూ తగ్గుతూ ఉంటాయి. ఏదో ఒక దశలో అతని మనసులో నేను ఎందుకు కోపపడుతున్నాను?, ఇతరులను ఎందుకు ద్వేషిస్తున్నాను?, జీవితానికి అసలు అర్థం ఏమిటి? అనే ఆలోచనలు కలుగు తాయి. అలాంటి ఊగిసలాట ఉన్న స్థితినే విక్షిప్త చిత్తం అంటారు. ఇది మనిషి జీవితంలో మంచి మార్పుకు ప్రారంభ స్థితి. వ్యక్తి మంచి మార్గం వైపు ఆకర్షితుడవుతాడు; మరోవైపు పాత అలవాట్లు, ఉద్రేకాలు వెనక్కి లాగుతుంటాయి. ఒకవైపు యోగం, ధ్యానం, సేవా భావం, ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతుంటే, మరోవైపు రాజకీయ విద్వేషము, సామాజిక విభేదాలు, ఆవేశపూరిత ప్రతిస్పందనలు కూడా కనిపిస్తుంటాయి. ఇలాంటి స్థితిలో చైతన్యం మేలుకుంటోంది కానీ ఇంకా పూర్తిగా స్థిరపడని స్థితి.
ఏకాగ్ర చిత్త భూమి (స్థిర చిత్తము)
పై విక్షిప్త మనఃస్థితిని దాటిన వ్యక్తి ఏకాగ్రమైన చిత్తాన్ని కలిగి ఉండే స్థితికి చేరుకుంటాడు. అంటే ఆ వ్యక్తి 24 గంటలు అదే మనఃస్థితిలో ఉండటానికి కాదు, అతడు ఏకాగ్రత ఎక్కువగా కలిగిన సమయం రోజులో ఎక్కువగా ఉంటుందని అర్థం. ఈ చిత్త స్థితిలో సత్వగుణం అధికంగా ఉంటుంది. అది యథార్థ విషయాలపైన మనసును నిలుపుతుంది. ఈ స్థితిలో బ్రతుకు పరమార్ధం కూడా మనసులో పొడచూపుతుంది.
ఇది అవిద్యను తొలగిస్తుంది. అవిద్యతోపాటు దాని దగ్గర చుట్టాలయిన అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ రూప క్లేశాలను తొలగిస్తుంది. (చిత్తము నిర్మలంగా ఉండటానికి అడ్డుపడేవి క్లేశములు.) ఈ స్థితిలో మనస్సు స్థిరంగా ఉంటుంది. ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. కోపం వచ్చినా దానికి లొంగిపోడు, అదుపుచేసుకుంటాడు. ఇతరుల మాటలను శ్రద్ధగా వింటాడు. వారిమీద తన అభిప్రా యాన్ని బలవంతంగా రుద్దడానికి ప్రయత్నించడు. సమస్యలను శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తాడు. కుటుంబంలో, కార్యాలయాలలో, సమాజంలో ఇలాంటి వ్యక్తులు ఎక్కువగా ఉంటే వారు వివాదాలను తగ్గించి, సమన్వయాన్ని పెంచగలుగు తారు. పతంజలిమహర్షి చెప్పిన మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష అనే గుణాలు ఈ మనఃస్థితిలో సహజంగా వికసిస్తాయి. ఇతరుల సుఖాన్ని చూసి సంతోషించడం, బాధను చూసి కరుణ చూపించడం, మంచి పనిని చూసి అభినందించడం, చెడు విషయాల పట్ల ద్వేషంతో కాక వివేకంతో స్పందించడం – ఇవన్నీ ఏకాగ్ర చిత్తస్థితికి లక్షణాలు.
నిరుద్ధ చిత్తభూమి (నిరోధ చిత్తము)
యోగసాధన లక్ష్యం నిరుద్ధ చిత్తస్థితిని సాధించడమే. ఈ మనస్థితిలో పూర్తి శుద్ధమయిన సత్వగుణం అధికంగా ఉంటుంది. మనస్సు పూర్తిగా ప్రశాంతంగా ఉంటుంది. అహంకారం, ద్వేషం, అసూయ, ప్రతీకారం వంటి చెడు భావనలు అణగిపోతాయి. ఈ మనఃస్థితి కలిగిన వ్యక్తి ఇతరులు కూడా తనవంటివారనే భావన కలిగి ఉంటాడు. అందరిలోనూ ఒకే చైతన్యాన్ని అనుభవించడం ప్రారంభిస్తాడు. మన రుషులు, యోగులు, మహనీయుల జీవితాలు గమనించినట్లయితే వారు ఈ మనఃస్థితిలో అత్యధిక సమయం గడపినట్లు స్పష్టమవుతుంది. అలాంటి వ్యక్తుల సమక్షంలో మనం చెప్పలేని ప్రశాంతత అనుభవిస్తాం. నిరుద్ధ చిత్తభూమిలో ఉన్న వ్యక్తులు సమాజంలో విభేదాలను పెంచరు, సరికదా వాటిని తగ్గించటమేకాక అసలు విభేదాలే పుట్టని విధంగా జీవిస్తారు.
ఈ ఐదు చిత్తభూములను పరిశీలించినప్పుడు సమాజంలో కనిపించే ప్రతి సమస్య వెనుక ఏదో ఒక చిత్తస్థితి పనిచేస్తుందని అర్థమవుతుంది. క్షిప్త చిత్తం ఉన్నప్పుడు ఆవేశం పెరుగుతుంది. మూఢ చిత్తం ఉన్నప్పుడు అజ్ఞానం పెరుగుతుంది. విక్షిప్త చిత్తం ఉన్నప్పుడు మార్పు కోసం మనసులో ఘర్షణ జరుగుతుంది. ఏకాగ్ర చిత్తం ఉన్నప్పుడు సామరస్యం పెరుగుతుంది. చిత్తం నిరుద్ధ స్థితిలో ఉన్నప్పుడు వైశ్వికదృష్టి ఏర్పడుతుంది. వైశ్వికదృష్టి అంటే మొత్తం విశ్వాన్ని తన ఆలోచనలో పొదువుకునే దృష్టి.
పై చిత్తభూములలో ఏ స్థితిలో ఉన్న వ్యక్తికైనా తపస్సు సాధ్యపడుతుంది. ఏ వ్యక్తి అయినా పట్టుదలతో యోగ సాధనచేస్తే సామాన్య మానవుడు ఊహించని శక్తిని పొందుతాడు అని చెబుతున్నది పతంజలి యోగశాస్త్రం. సమాధి అనేది మనస్సు సహజ స్థితి. అది అన్ని చిత్తభూములలోను కలగ వచ్చు. అయితే శుద్ధి సంస్కారము లేకుండా కలిగే సమాధిశక్తులు లోకానికి అపకారమే చేస్తాయి. మన పురాణాలలోని హిరణ్యకశిపుడు రావణుడు మొదలైనవారు ఉగ్ర తపస్సు(సమాధి) చేసి సాధించిన మానవాతీత శక్తులు లోకానికి ఎంతహాని కలిగిం చాయో మనకందరికీ తెలుసు. వారు సాధించిన సమాధులు , మూఢ క్షిప్త చిత్తస్థితులనుంచి వచ్చినవి.
యోగసూత్రములలోని మూడవ భాగమైన విభూతి పాదములో ఈ అతీంద్రియ శక్తుల గురించిన పూర్తి వివరాలు లభిస్తాయి.
చిత్తభూములలో రకములు
పతంజలి యోగ సూత్రముల భాష్యకర్త వాచస్పతిమిశ్రుడు చిత్తభూములు రెండు రకాలుగా ఉంటాయని చెప్పాడు.
- మొదటి రకం: క్షిప్త, మూఢ, విక్షిప్త స్థితులలో కలిగే సమాధి స్థితులు. వీటిని అయోగిక సమాధు లంటారు. ఇవి హేయమైనవి. ఇవి ఒకరకమైన పూనకాలు అని చెప్పవచ్చు. ఇవి ఆధ్యాత్మిక ప్రగతికి అడ్డుగోడలు, విడిచిపెట్టవలసినవి.
- రెండవ రకం: ఏకాగ్ర, నిరుద్ధ చిత్తస్థితులలో ఏర్పడే సమాధిస్థితులు. ఇవి కోరదగినవి. వీటిని యోగిక సమాధులు అంటారు. ఇవి ఆధ్యాత్మిక వికాసానికి దారితీస్తాయి.
సమాధి అనేది పరిశుద్ధమైన మనసులో మాత్రమే కలిగేది కాదని, తగిన సాధన ఉంటే కలుషిత మనఃస్థితిలో కూడా కలుగవచ్చని యోగ శాస్త్రం చెబుతోంది. కానీ ఆ రెండు సమాధులమధ్య రామ రావణులమధ్య, నరసింహ హిరణ్యకశిపుల మధ్య ఉండేంత తేడా ఉంటుంది. వారి వారి చరిత్రలు ఒకటి లోకాన్ని రక్షించేదిగాను, మరొకటి లోకాన్ని చేటు తెచ్చేదిగాను ఉండటం మనకు తెలుసు.
అయోగిక చిత్త భూములు
ఈ అయోగిక సమాధి స్థితులు లేక హేయ సమాధి స్థితుల గురించి మనకి తెలిసి ఉండటం అవసరం. అది హేయ సమాధి స్థితిలో జీవించిన అనేకమంది మత ప్రవక్తలు, రాజకీయ నాయకులు ఇతర ప్రముఖ వ్యక్తులు, వారు నడిపిన మత, రాజకీయ, సామాజిక ఉద్యమాల వల్ల సమాజానికి కలిగిన హానిని అర్థంచేసుకోవటానికి ఉపయోగ పడుతుంది.
కొత్త మతాలు, సిద్ధాంతాలు లేదా ఉద్యమాలు ప్రారంభంలో ఉదాత్తంగా కనిపించినా వాస్తవానికి అవి అహంకారం, కోరిక, ద్వేషం లేదా మోహం చేత ప్రేరేపించబడినవై ఉంటాయి. కానీ ఇవి ఒక తీవ్రమైన సమాధి/మానసిక స్థితి నుంచి పుట్టాయి కాబట్టి, వాటికి అమితమైన జనాకర్షణ శక్తి ఉంటుంది. ఆయా వ్యక్తుల మత బోధనలు నమ్మేవారిలో గ్రుడ్డి నమ్మకం, మొండి పట్టుదల ప్రపంచాన్నంతటినీ తమలో కలుపుకోవాలనే కోరిక ఏర్పడుతుంది.
శ్రీ రాం స్వరూప్ అనే యోగి, తత్త్వవేత్త అభిప్రాయం ప్రకారం అధమస్థాయి చిత్తభూములు కూడా తమవైన దేవుళ్లను, ప్రవక్తలను, ఉగ్ర మతాలను సృష్టించగలవు. అయితే అవి యోగిక చిత్తభూమి నుంచి పుట్టే దైవభావనలకు, ధార్మిక భావనలకు పూర్తిగా వ్యతిరేకమయినవి. యోగిక చిత్తభూమిలో దర్శనమయ్యే దేవతలు మానవ జీవితాన్ని ఆనందమయం చేసి వారిని పరమార్ధం వైపు నడిపిస్తాయి. మరొకవైపు అయోగిక చిత్తభూముల నుంచి పుట్టే ప్రవక్తలు వారి దేవుళ్లు ఆ మతస్థుల్లో కామం, క్రోధం, ద్వేషం, అహంకారం, ఈర్ష్య, దురాక్రమణతత్త్వం, మోసకారితనం మొదలైన లక్షణాలను కలిగిస్తాయి.
అయోగిక చిత్తభూములలో పుట్టిన మతాల దైవం తమవారిని మాత్రమే ప్రేమిస్తాడు. తన మతానికి వెలుపల ఉన్నవారిని ద్వేషించమని బోధిస్తాడు. తన మతంలోనివారు తనను మాత్రమే ఆరాధించాలని దేవిరిస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే భయ, ప్రలోభాల ద్వారా ఇటువంటి మతాలు వ్యాపిస్తాయి. సమాజానికి చేటుతెస్తాయి.
ఈ రకమైన మతాలలో ఆరంభ దశల్లో కలిగే భక్తి, ఉత్సాహం, విశ్వాసం వంటివి, క్రమేణ జ్ఞానంగా, సమత్వంగా మారకపోవడంవల్ల అవి ప్రమాదకరంగా మారతాయి.
భక్తి – మతోన్మాదంగా,
విశ్వాసం – అంధ విశ్వాసంగా,
ఉత్సాహం – హింసాత్మక మతోత్సాహంగా,
ఆత్మవిశ్వాసం – అహంకారంగా మారుతుంది.
ఈ మనస్తత్వ ధోరణితో God verses Gods, God verses Goddess , God verses Science, God verses King, God verses Places of worship ల పేరుతో సమాజంలో సంఘర్షణ తలెత్తుతాయి. అవి సమాజంలో అరాజకానికి దారితీస్తాయి.
అందుకే చరిత్రలో చాలామంది తత్వవేత్తలు, మేధావులు ఇటువంటి దేవతా భావనలను ప్రశ్నించారు. కొందరు పూర్తిగా తిరస్కరించారు.
యోగదృష్టిలో ఇలాంటి దేవతలు నిజమైన పరమాత్మ స్వరూపాలు కావు; అవి మనిషి మనస్సులోని లోతైన కోరికలు, భయాలు, ద్వేషాలు, ఆశలు, అహంకారాల నుంచి ఉద్భవించిన మానసిక- ఆధ్యాత్మిక రూపాలు.
దైవదర్శనంలా కనిపించే ప్రతి అనుభవం కూడా పరమ సత్యాన్ని ప్రతిబింబించదు. అది మనస్సులోని కోరిక, ద్వేషం, అహంకారం లేదా మోహం నుంచి వచ్చిన లోపాలను ఇతరులపై ఆపాదించడం కూడా కావచ్చు.
అందువల్ల నిజమైన ఆధ్యాత్మికతను గుర్తించడం అత్యంత అవసరం.
సనాతన వైదిక ధర్మంలో ఇలాంటి అయోగిక చిత్తభూముల నుంచి ఉత్పన్నమయిన 72 అవైదిక మతాలను ఆదిశంకరులు తమ ప్రజ్ఞాపాటవముల ద్వారా అణచివేసి సనాతన వైదిక ధర్మాన్ని పునరుద్ధ రించారు. ఇటువంటి శుద్ధి మరే ఇతర మతాలలో జరగలేదు.
యోగిక చిత్తభూములు
యోగిక చిత్తభూములలో ఏర్పడిన సమాధి నుంచి ఉద్భవించే దేవతాభావన పైవాటికి పూర్తి భిన్నంగా ఉంటుంది. సాధకుని అంతరంగం, ముందే పూర్వ అంగములందు అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారములో క్రమ క్రమముగా పండుతూ ధ్యాన, సమాధులను అభ్యసించటం వల్ల దిగువస్థాయి చిత్తభూములయిన క్షిప్త, మూఢ, విక్షిప్తలను దాటి ఏకాగ్ర చిత్తభూమి యందు స్థిరతను, స్వచ్ఛతను కలిగి ఉంటుంది. ఆ స్థితిలో విశ్వచైతన్యాన్ని దర్శించగలుగుతుంది. ప్రాణ(శ్వాస)శక్తి దానితో తాదాత్మ్యం చెందుతుంది. అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం, శౌచం, సంతోషం, స్వాధ్యాయం, తపస్సు, ఈశ్వరప్రణిధానములతో కూడిన జీవనశైలి వల్ల సాధకునిలోని శక్తి అపరిమితమై, అకుంఠితమై విస్తృతిని సంతరించుకుంటుంది. దివ్యత్వాన్ని కైవసం చేసుకోగలుగుతుంది. ఈ స్థితిలో సాధకుని చిత్తము ఈ దివ్యత్వాన్ని పురుష రూపంలోగానీ, స్త్రీ రూపంలో గానీ లేక ఏ రూపము లేని నిర్గుణతత్వంగా కానీ భావనచేయగలుగుతుంది. జీవుడు, జగత్తు, ఈశ్వరుల మధ్య ఏకత్వాన్ని దర్శించగలుగుతుంది.
ఈ యోగమార్గమును అనుసరించి రుషులు విశ్వంలోని అంతరాంతరాలలో దాగి ఉన్న శాశ్వత సత్యాలను గ్రహించి లోకకళ్యాణానికై వాటిని శాస్త్రముల రూపంలో పొందుపరచి ఉంచారు. మానవ జీవన శైలిని చక్కదిద్దగలిగారు. Gశీd ఙవతీsవs Gశీds, Gశీd ఙవతీsవs Gవఅdవతీ, Gశీd ఙవతీsవs Scఱవఅcవ వంటి సంఘర్షణలు తలెత్తకుండా జాతిని కాపాడారు. భగవంతుడు జీవితంలో ఒక భాగం మాత్రమే కాదు, ఆయన మన అస్తిత్వంలో అంతర్భాగమన్న ప్రజ్ఞతో కూడిన ఎరుకను నిలబెట్టారు. భగవత్ చైతన్యమే వ్యక్తి దేహంలో నిరంతరం ప్రవహిస్తూ ఉనికికి, ఉనికి కోల్పోవడానికి కారణమౌతున్నదని సామాన్య ప్రజానీకానికి అర్ధ మయ్యేలా చెప్పారు. సర్వత్రా ఏకాత్మ దర్శనమును చేయించారు. సర్వత్రా ఏకాత్మ దర్శనమును గావించుతూ, ఉపాధి ధర్మములను అనుసరించి సమన్వయబుద్ధితో వ్యవహరించుతూ సుఖ శాంతులను అనుభవించేలా మార్గనిర్దేశం చేశారు.
ఇలా యోగిక చిత్తభూమిలో పరమాత్మ దివ్యత్వాన్ని దర్శించినవారి వలననే భారతీయ సనాతన వైదిక హిందూ మతము అనాదిగా అఖండ జీవన పరంపరని కొనసాగిస్తున్నది. నాటి వాల్మీకి, వ్యాస రుషుల నుంచి నేటి భగవాన్ రమణులు, రామకృష్ణ పరమహంసల వరకు ఈ ఆధ్యాత్మిక జీవన సరళి మానవాళికి ఆదర్శంగా నిలబడి మార్గనిర్దేశము చేస్తున్నది.
ప్రపంచ దేశాలకు భారత్ పిలుపు
ఇటీవలి కాలంలో భారతీయ విద్యలకు, విజ్ఞానా నికి ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. ఉదా : యోగవిద్యను గుర్తిస్తూ అంతర్జాతీయ యోగ దినంగా ప్రకటించడం, సస్వర వేద పఠనాన్ని ప్రపంచ అమూర్త వారసత్వ సంపదగా గుర్తించడం దీనికి ఉదాహరణలు.
యోగం కేవలం బహిరంగమైన ఆసన ప్రాణాయామములే కాదు అది మానవ ప్రవర్తనను, ఆలోచనాధోరణిని ఉన్నతపరచి ప్రపంచంలో మానవీయ సమాజాన్ని స్థాపించగలిగే అద్భుత అంతరంగ శాస్త్రమని చెప్పవచ్చు.
నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న పర్యావరణ ఉత్పాతం, యుద్ధభయం, అణ్యస్త్ర దురుపయోగం మొదలైన విశ్వవ్యాప్త ప్రమాదాలను అరికట్టగలిగే మానసిక స్థైర్యాన్ని యోగ కలుగజేస్తుందనడంలో సందేహం లేదు.
ఈ యోగవిజ్ఞానం ద్వారా ప్రపంచంలోని వివిధ మతాలు వాటి ప్రవర్తనా తీరుతెన్నులు, అవి ఏయే చిత్తభూముల సౌధాలపై నిలబడి ఉన్నాయో సరిచూసుకొని, దిద్దుకొని విశ్వమానవ కళ్యాణానికి తమవంతు పాత్రను పోషించాలని భారత్ ఆహ్వానిస్తున్నది.
మనిషి మనస్సులోని ద్వేషాన్ని ప్రేమగా, అహం కారాన్ని వినయంగా, అసూయను ఆనందంగా, భయాన్ని ధైర్యంగా మార్చగల శక్తి ఒక్క యోగసాధనలో మాత్రమే ఉన్నది.
‘యోగం ఒక అంతరంగ శాస్త్రం, ఇది సాధారణ వ్యక్తిని అసాధారణ వ్యక్తిగా తీర్చిదిద్దగల దివ్యమైన మనో విజ్ఞానం’ అన్న స్వామి వివేకానంద వాణికి బలం చేకూర్చేలా ప్రవర్తించుదాం.
సమాజాలను మార్చాలంటే ముందుగా చిత్తాన్ని మార్చుకోవాలి. ఇది యోగం ద్వారా మాత్రమే సాధ్యం.





