News

శ్రీ రాజమన్నార్ గోపాలస్వామి దేవాలయంలో టెంపుల్ యోగా

34views

విజయనగరంలోని శ్రీ రాజమన్నార్ గోపాలస్వామి దేవాలయం ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించిన టెంపుల్ యోగా కార్యక్రమం భక్తులను, స్థానిక ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా బుధవారం జరిగిన ఈ ప్రత్యేక యోగా సెషన్‌లో జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొని యోగాసనాలు అభ్యసించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన ఆధ్యాత్మిక-ఆరోగ్య సంపద అని పేర్కొన్నారు. నిత్యం కొంత సమయం యోగాకు కేటాయించడం ద్వారా మానసిక ఒత్తిడి తగ్గడంతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు.

దేవాలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా యోగా సాధనకు ఆధ్యాత్మికతను జోడించి ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందని ఆయన అన్నారు. అలాగే జూన్ 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమాలను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

యోగాభ్యాసం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని, యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని అధికారులు ప్రజలకు సూచించారు.