
అయోధ్య రామమందిరాన్ని సందర్శించే భక్తుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండటంతో విరాళాలు కూడా భారీగా అందుతున్నాయి. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగినప్పటి నుంచి సుమారు 15 కోట్లకు పైగా ప్రజలు ఆలయాన్ని సందర్శించినట్లు ట్రస్ట్ వెల్లడించింది. ఫలితంగా రూ.500 కోట్లకు పైగా విరాళాలు అందాయని వివరించింది. వీటిని పారదర్శకంగా సురక్షితంగా భద్రపరుస్తున్నట్లు తెలిపింది. గణాంకాల ప్రకారం ఒక్కో భక్తుడి నుంచి సగటున రూ.33 కంటే ఎక్కువ విరాళం లభిస్తోందని వివరించింది.
రామమందిరంలో విరాళాల ప్రక్రియను సులభతరం చేయడానికి ఆరు పెద్ద హుండీలను ఏర్పాటు చేసినట్లు ట్రస్ట్ అధికారులు తెలిపారు. వీటికి అదనంగా మందిర ప్రాంగణంలోని ఇతర ఆలయాల వద్ద మరో 12 విరాళాల హుండీలను ఉంచినట్లు చెప్పారు. భక్తులు తమ ఇష్టానుసారం నగదు రూపంలో విరాళాలు ఇచ్చి, వెంటనే కంప్యూటరైజ్డ్ రసీదును పొందేందుకు వీలుగా నాలుగు కౌంటర్లను కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ విధానం భక్తులు సులభంగా విరాళాలు ఇవ్వడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రతి పైసాకు కచ్చితమైన లెక్కలు ఉన్నాయని, ఎటువంటి అక్రమాలు జరగలేదని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ సహా ఇతర అధికారులు నిరంతరం స్పష్టం చేస్తున్నారు.
ట్రస్ట్ సమాచారం ప్రకారం
రామమందిరానికి ప్రస్తుతం రోజుకు సగటున రూ.8 నుంచి రూ. 10 లక్షల వరకు విరాళాలు అందుతున్నాయి. ఈ మొత్తం ప్రధానంగా విరాళాల హుండీలు, కౌంటర్ల ద్వారానే వస్తున్నాయి. రామ్ లల్లాను దర్శించుకునేటప్పుడు భక్తులు నేరుగా విరాళాల పెట్టెల్లో డబ్బు వేస్తుంటారు. అదే కౌంటర్ల వద్ద విరాళాలు ఇచ్చేటప్పుడు రసీదు తీసుకునే విధానం ఉంటుంది. పారదర్శకత కోసం విరాళాల ప్రక్రియ అంతా CCTV నిఘాలోనే జరుగుతుంది. డబ్బును లెక్కించే ప్రదేశంలో వాయిస్ రికార్డింగ్ సదుపాయంతో కూడిన ఆధునిక CCTV వ్యవస్థలను ఏర్పాటు చేశారు.
డబ్బును లెక్కించడానికి ఒక ప్రత్యేక ఏజెన్సీని నియమించారు. ఆరుగురు సిబ్బంది రెండు షిఫ్టుల్లో ఈ లెక్కింపు ప్రక్రియను నిర్వహిస్తారు. వీరికి అదనంగా ట్రస్ట్ నియమించిన అధికారులు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు కూడా ఈ ప్రక్రియలో సహాయపడతారు. భక్తులు అందించిన విరాళాలను లెక్కించిన తర్వాత ఆ నిధులను ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్’ ఖాతాలో జమ చేస్తారు. నిర్ణీత పరిమితులకు అనుగుణంగా డబ్బును బ్యాంక్ ఖాతాలో జమ చేసి మిగిలిన నిధులను ఒక సంచిలో సీల్ చేసి సురక్షితమైన గదిలో భద్రపరుస్తారు.
ఏడాదికి రెండుసార్లు ఆడిట్
ఆన్‌లైన్ మాధ్యమాలు, చెక్కులు, UPI లేదా విరాళాల పెట్టెల ద్వారా ట్రస్ట్‌కు అందిన నిధులపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆడిట్ నిర్వహిస్తారు. ఇందుకోసం చార్టర్డ్ అకౌంటెంట్లను నియమించారు. అలాగే ఈ ప్రక్రియలో అంతర్గత బ్యాంక్ సిబ్బంది, అధికారులు కూడా పాల్గొంటారు. ఈ ఆడిట్‌లో ఆదాయం, వ్యయంతో సహా ప్రతి రూపాయికి సంబంధించిన వివరమైన లెక్కల పరిశీలన ఉంటుంది. ఈ ఆర్థిక వివరాలు ట్రస్ట్‌కు సమర్పించిన తర్వాత సమావేశాల సమయంలో దాని నిర్వాహక సభ్యులు పరిశీలిస్తారు.
రామ్ లల్లా ‘ప్రాణ ప్రతిష్ఠ’ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 15 కోట్లకు పైగా ప్రజలు దర్శించుకున్నారు. ట్రస్ట్‌కు మొత్తం రూ. 500 కోట్లకు పైగా విరాళాలు అందాయి. ఇందులో సుమారు రూ. 150 కోట్లు విరాళాల హుండీల ద్వారా రాగా మిగిలిన రూ. 350 కోట్లు ఆన్‌లైన్ మాధ్యమాలు, కౌంటర్ల ద్వారా సమకూరాయి. ఈ నిధులను ఆలయ నిర్వహణ, సేవా కార్యక్రమాలు, భవిష్యత్తు ప్రాజెక్టుల కోసం వినియోగిస్తామని ట్రస్ట్ పేర్కొంది. కాగా, అయోధ్యలోని భారీ రామమందిర ‘ప్రాణ ప్రతిష్ఠ’ 2024 జనవరి 22న జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.





