ArticlesNews

రామాయణ మహాకావ్యంలో భక్తిరసానికి పరాకాష్ఠ గుహుడు

32views

రామాయణ మహాకావ్యంలో భక్తిరసానికి పరాకాష్ఠగా నిలిచే ఘట్టాల్లో నిషాదరాజు గుహుడి వృత్తాంతం అద్వితీయమైనది. పితృవాక్య పరిపాలన కోసం అడవులకు బయలుదేరిన దాశరథికి గంగాతీరంలో ఎదురైన తొలి ప్రేమామృతం గుహుడు.

శృంగిబేరపుర ప్రభువైన గుహుడు, రాముడు రాజ్యభోగాలను వీడి కారడవులకు వస్తున్నాడన్న వార్త వినగానే పిడుగు పడ్డట్టుగా విలవిల్లాడిపోయాడు. ఆ ఆవేదనలో అతడికి నిద్రాహారాలు కరవయ్యాయి. ఎప్పుడెప్పుడు రాముణ్ని చూద్దామా అని గంగాతీరం వైపు ఆశగా ఎదురుచూడసాగాడు. ‘మన స్వామి వస్తున్నారు, ఆయనకు ఏ చిన్న అసౌకర్యం కలగకుండా గమనించండి’ అంటూ గూడెంలోని వారందరినీ అప్రమత్తం చేశాడు. గుహుడి తపనలో రాజు పట్ల విధేయత మాత్రమే లేదు. ఆపదలో ఉన్న ఆత్మీయుడి కోసం తల్లడిల్లే ఒక అచ్చమైన భక్తుడి హృదయం ఉంది. రాముడి రాక కోసం వేచిచూస్తూ గుహుడు గడిపిన ప్రతి క్షణం ఒక యుగంలా, అతడి అచంచలమైన స్వామి భక్తికి నిలువుటద్దంలా నిలిచింది. రాముడు రాగానే పరుగున వెళ్లాడు.

స్వామిని చూసి పరవశించిపోయాడు. చక్రవర్తి కుమారుడు, సుకుమారుడైన రాముడు నారచీరలు కట్టి, జడలు ధరించి ఉండటం చూసి ఆ నిషాదరాజు హృదయం ద్రవించింది. తన రాజ్యమంతా రాముడిదేనని, శృంగిబేరపురంలోనే ఉండి ఏలమని వేడుకున్నాడు. కానీ, రాముడు తన వనవాస దీక్షను వివరించి, కేవలం విశ్రాంతికి అనుమతి కోరగా.. ఆ రాత్రంతా గుహుడు కంటిమీద కునుకు లేకుండా లక్ష్మణుడితో కలిసి కాపలా కాశాడు. గడ్డి పరకల మీద నిద్రిస్తున్న సీతారాములను చూస్తూ, ఆ నిషాద ప్రభువు కార్చిన కన్నీరు అతనిలోని అచంచలమైన అనురాగానికి నిదర్శనం.

గుహుడి భక్తిలో ఒక ప్రత్యేకత ఉంది. అతడు రాముణ్ని దైవంగానే కాదు, తన ప్రాణప్రదమైన మిత్రుడిగా భావించాడు. అందుకే, గంగను దాటించే సమయంలో రాముడి పాదధూళి తన పడవను ఎక్కడ స్త్రీగా మారుస్తుందోనని అమాయకంగా భయపడుతూనే, ఆ సాకుతో స్వామి పాదపూజ చేసి ధన్యుడయ్యాడు.

భరతుడు సైన్యంతో రాముణ్ని వెతుక్కుంటూ వచ్చినప్పుడు, గుహుడు ప్రదర్శించిన వీరత్వం అతడి స్వామిభక్తికి నిదర్శనం. ‘రాముడికి హాని తలపెట్టేవారు ఎవరైనా సరే, నా గంగను దాటలేరు’ అని ప్రతిజ్ఞ చేసిన ఆ నిషాదరాజు తెగువ సామాన్యమైనది కాదు. ఆ తరవాత భరతుడిలోని వైరాగ్యాన్ని, సోదర ప్రేమను గమనించి అతణ్ని ఆలింగనం చేసుకుని, అన్నదమ్ముల మధ్య వారధిలా నిలిచాడు గుహుడు.

రాముడు వనవాసం ముగించుకుని తిరిగి వస్తూ, భరద్వాజ ఆశ్రమం నుంచి హనుమంతుణ్ని ముందుగా గుహుడి దగ్గరికే పంపడం విశేషం. దీన్నిబట్టి రాముడి హృదయంలో గుహుడికి ఎంతటి ఉన్నత స్థానం ఉందో అర్థమవుతుంది. తన భక్తుణ్ని మిత్రుడిగా స్వీకరించి, ‘నువ్వు నా ప్రాణానితో సమానమ’ని రాముడు పలికిన మాటలు గుహుడి భక్తికి లభించిన ప్రతిఫలాలు.