
రాష్ట్ర సచివాలయంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన నేడు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ పరిధిలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, కామన్ గుడ్ ఫండ్ (CGF) నిధుల వినియోగం, ధూప-దీప-నైవేద్యాల పథకం అమలు, ఆలయాల అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రి సమగ్రంగా సమీక్షించారు.
రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన, దేవాలయాల నిర్వహణలో పారదర్శకత మరియు సమర్థత పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న దేవాదాయ శాఖ పథకాలు ప్రజలకు మరింత చేరువయ్యేలా కార్యాచరణ చేపట్టాలని సూచించారు.
అలాగే రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు ముందస్తుగా పూర్తి చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. పుష్కరాల సందర్భంగా భద్రతా చర్యలు, తాగునీరు, పారిశుధ్యం, వసతి, రవాణా, వైద్య సేవలు వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు.
ఆలయాల అభివృద్ధి, భక్తుల సేవల విషయంలో ఎటువంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి హరి జవహర్లాల్, కమిషనర్ రామచంద్ర మోహన్, చీఫ్ ఇంజనీర్ శేఖర్‌తో పాటు శాఖకు చెందిన ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.





