News

‘దురంధర్‌’తో పడిపోయిన ఇమేజీ.. దాడులకు ప్లాన్ చేస్తున్న డీ-కంపెనీ

32views

బాలీవుడ్ హిట్ ఫిల్మ్ దురంధర్‌లో అండర్ వరల్డ్ డాన్ దావూద్‌ను పోలినట్టు ఉన్న బడే సాహెబ్ క్యారెక్టర్ మరణశయ్యపై ఉండటం దేశవ్యాప్త చర్చకు దారి తీసింది. దీంతో తమ పరపతి దెబ్బతిన్నదని భావిస్తున్న దావుద్ గ్యాంగ్ (డీ-కంపెనీ) ఇమేజీని పునరుద్ధరించుకునేందుకు ముంబైలో మళ్లీ క్రియాశీలకంగా మారినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. గ్యాంగ్‌లో కొత్త సభ్యులను చేర్చుకునేందుకు డీ-కంపెనీ ప్రయత్నిస్తోందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఈ బాధ్యతను షకీల్ గ్యాంగ్‌కు అప్పగించినట్టు సమాచారం. కొత్తగా చేరే వారికి శిక్షణ ఇచ్చి, ఆయుధాలు సమకూర్చే బాధ్యతను పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ తీసుకుంది. ఈ కుట్రకు అమలు పరిచే బాధ్యత మున్నా జింగాదా అనే షూటర్‌కు అప్పగించినట్టు తెలుస్తోంది.

ఈ ఆపరేషన్ కోసం డీ-కంపెనీ ముంబైలో ప్రత్యేకంగా కొందరిని గ్యాంగ్‌లోకి చేర్చుకుంటోంది. బూల్డోజర్ న్యాయం పేరిట జరుగుతున్న ఘటనలతో వారిని రెచ్చగొట్టి దాడులకు ఉసిగొల్పుతున్నట్టు సమాచారం. అయితే, కొత్తగా గ్యాంగ్‌లో చేరే వారికి తమ అసలు టార్గెట్ ఏమిటో దావూద్ గ్యాంగ్ చెప్పకుండా గోప్యంగా ఉంచుతున్నట్టు సమాచారం. ఐఎస్ఐ సాయంతో భారీ దాడులకు దిగడం లేదా భారత్‌లో ఎవరైనా కీలక వ్యక్తిని టార్గెట్ చేయడంపై దావూద్ గ్యాంగ్ దృష్టి సారించినట్టు నిఘా వర్గాలు చెబుతున్నాయి. గత కొంతకాలంగా తమ పరపతి పడిపోవడంతో కంగారు పడిన దావూద్ గ్యాంగ్ ఈ ప్రయత్నాలకు తెరతీసినట్టు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. పాక్ ఐఎస్ఐతో సంబంధాలున్న తొమ్మిది మందిని ఇప్పటికే ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో దావూద్ గ్యాంగ్ ఉదంతం కలకలం రేపుతోంది.