News

వెంకటేశ్వర స్వామి కీర్తనలను అవమానించడం హిందూ సమాజాన్ని కించపరచడమే: VHP

23views
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సంకీర్తనలు, భక్తి గీతాలను రాజకీయ విమర్శలకు అనుగుణంగా వ్యంగ్యంగా ఉపయోగించడం హిందూ ద్రోహ చర్య అని విశ్వహిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి మహిమను, భక్తి పరంపరను అవమానించే  రైతు బంధు గోవిందా…రైతు భీమా గోవిందా అంటూ వ్యంగ్యంగా పాటలు పాడి రాజకీయ ప్రయోజనాలు పొందాలని ప్రయత్నించడం దుర్మార్గమైన చర్య అని VHP విమర్శించింది. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవమైన వెంకన్న స్వామి భక్తి గీతాలను అపహాస్యం చేయడం ద్వారా హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో ఆ పాట పాడిన దేశపతి శ్రీనివాస్ వెంటనే బేషరతుగా వెంకటేశ్వర స్వామి భక్తులకు, హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని VHP ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు బిఆర్ఎస్ పార్టీ హిందూ వ్యతిరేక ధోరణిని మరోసారి బయటపెడుతున్నాయని వారు విమర్శించారు.
హిందువుల విశ్వాసాలు, దేవతలను అవమానించే వారిని సమాజం తగిన విధంగా గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ విషయంపై దేశపతి శ్రీనివాస్ స్పందించి క్షమాపణ చెప్పకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఏ రాజకీయ పార్టీ అయినా హిందూ దేవీ దేవతలకు ఆపాదించకుండా విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవాలి కానీ, దేవీదేవతలను వాటిలో లాగడం క్షమించరాని నేరమని తీవ్ర ఆక్షేపణ చేశారు.